;;;;; ఆలోచనాలోచనాలు ;;;;; -----౦ సంస్కృత సూక్తి సుధ ౦---- ***** దరిద్రాయ కృతం దానం, శూన్య లింగస్య పూజనమ్! అనాథ ప్రేత సంస్కారమ్, అశ్వమేధ సమం విదుః !! దరిద్రం తో బాధపడేవారికి చేయబడిన దానము, పూజాపునస్కారాలు లేని శివలింగానికి చెయ్యబడిన పూజ, దిక్కు లేని అనాథ శవానికి చెయ్యబడిన అంత్యక్రియలు ( ఈ మూడు పనులు) అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యంతో సమానం. ***** జనితా చోపనీతాచ, యశ్చ విద్యాం ప్రయచ్ఛతి, అన్నదాతా, భయత్రాతా. సచైతే పితర స్మ్రతాః!! తనకు జన్మనిచ్చినవాడు, ఉపనయనం (వడుగు) చేసినవాడు, అన్నం పెట్టినవాడు, ఆపదలో ఉండగా భయాన్ని పోగొట్టి రక్షించినవాడు ఈ ఐదుగురు తండ్రులుగా పరిగణింపబడతారు. ***** అతిథౌ తిష్ఠతి ద్వారే హ్యాపో గృహ్ణాతియో నరః! ఆపోశనం సురాపానం, అన్నం గోమాంస భక్షణమ్!! వాకిట్లో అతిథి ఆకలితో ఉండగా , అతణ్ణి విడిచి గృహస్థు అన్నం తినేముందు పట్టే ఆపోశనం కల్లు సేవనంతో సమానం. అతడు భుజించే ఆహారం గోమాంసంతో సమానం. అతిథిని విడిచి భోజనం చెయ్యడం పాపకృత్యమని పెద్దల వాక్కు. ***** పితాచ ఋణవాన్ శత్రుః, మాతాచ వ్యభిచారిణీ! భార్యా రూపవతీ శత్రుః, పుత్రశ్శత్రురపండితః!! ఋణవంతుడైన తండ్రి, వ్యభిచరించే తల్లి, మిక్కిలి రూపవతి అయిన భార్య, విద్యావంతుడుగాని కుమారుడు , వీరంతా శత్రువులవంటివారు. ***** జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్ర బాంధవాః! జిహ్వాగ్రే బంధనం ప్రాప్తిః, జిహ్వాగ్రే మరణం ధ్రువమ్!! మంచిమాట వలన లక్ష్మీ ( సంపదలు) కలుగుతాయి. మంచి మాటలవలన మిత్రులు మరియు బంధువులు ఏర్పడతారు. సరియగు మాట లేమితో కారాగారవాసం లభించవచ్చు. చెడుమాట కారణంగా మరణం కూడా ప్రాప్తించవచ్చు. కాబట్టి మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. చివరగా ఒక చమత్కార శ్లోకం తో ముగిద్దాం. ***** వైద్యరాజ నమస్తుభ్యం, యమరాజ సహోదర! యమస్తు హరతి ప్రాణాన్, వైద్యః ప్రాణాన్, ధనానిచ!! యమధర్మరాజు సోదరుడవైన ఓ వైద్యరాజా! నీకు నమస్కారము. యమధర్మరాజు కేవలం ప్రాణాలు మాత్రమే కొనిపోగలడు. తమరు ధనాన్ని మరియు ప్రాణాన్ని రెండింటినీ తొలగించగల సమర్థులు. తేది 8--10--2023, ఆదివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి