20, డిసెంబర్ 2023, బుధవారం

శ్రీ దేవీ భాగవతం


శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



హరిశ్చంద్రుణ్ణి సమీపించాడు. రాజా! నీ క్రతువు పూర్తి అవుతుంది. నీ రోగం ఉపశమిస్తుంది. కంగారు

పడకు. ఒక్క విషయం తెలుసుకో. దయకు మించిన పుణ్యం లేదు. హింసకు మించిన పాపం లేదు.

ఆత్మదేహాన్ని రక్షించుకోవడం కోసం పరదేహాన్ని ఖండించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు.

సర్వభూతాలనూ దయగా చూస్తే జగత్పతి సంతోషిస్తాడు. అంతకు మించిన శాంతి లేదు, సౌఖ్యం లేదు.ఆత్మవత్సర్వభూతాని అనే వేదోక్తిని మరిచిపోకు. అందరికీ ప్రియంగా జీవించాలి. ఒకరిని చంపి మనం

సుఖపడదామనుకోవడం వట్టి భ్రమ. ఏ వైరం ఉందని నువ్వు ఈ బాలుణ్ణి సంహరిస్తావు ? చెప్పు. ఇప్పుడు

నువ్వు చంపితే పై జన్మలో ఈ ప్రాణి నిన్ను చంపుతుంది. పోనీ మీ ఇద్దరికీ గతజన్మల వైరం ఏమైనా

ఉందా? నీకు తెలిసిందా ? అదైనా చెప్పు, వింటాను.

ఈ అజీగర్తుడు పరమదుర్మార్గుడు. కనకనే కొడుకును నీకు విక్రయించాడు. ధనలోభం ఎంత

పాపమైనా చేయిస్తుంది. ఎవరైనా ఎక్కువమంది పుత్రులు కలగాలని కోరుకుంటారు. ఒకడైనా గయకు

వెడతాడనీ పిండప్రదానం చేస్తాడనీ ఆశ. అశ్వమేధాన్ని చేసినా చెయ్యకపోయినా, నీలవృషభాన్ని విడిచి

పెట్టివా విడిచి పెట్టకపోయినా కనీసం ఇదైనా చేస్తాడని కన్న తండ్రి ఆశిస్తాడు. అటువంటిది ఈ అజీగర్తుడు

ధనలుబ్ధుడై కొడుకును అమ్ముకోడమేకాక ఖండించడానికి సిద్ధపడ్డాటంటే ఎంత దారుణం !

 సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - కైలాస సంహితా - అధ్యాయం - 2                                                                                                             పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించుట


వ్యాసుడు ఇట్లు పలికెను -


ఓ బ్రాహ్మణులారా! భాగ్యవంతులగు మీరు చక్కగా ప్రశ్నించితిరి. ఓంకారముయొక్క అర్థమును ప్రకాశింపజేసే శివజ్ఞానము తేలికగా దొరికేది కాదు (1). గొప్ప శూలమును ఆయుధముగా దాల్చే శివభగవానుడు సాక్షాత్తుగా ఎవరికి ప్రసన్నుడగునో, వారికి మాత్రమే ఓంకారముయొక్క అర్థమును ప్రకాశింపజేసే శివజ్ఞానము కలుగును. దీనిలో సందేహము లేదు. శివభక్తి లేని ఇతరులకు ఆ జ్ఞానము కలుగదని వేదము చెప్పుచున్నది. ఇది నిశ్చయముగా యథార్థము (2,3). మీరు దీర్ఘమగు సత్రయాగముచే పార్వతీపతియగు శివుని ఉపాసించుచున్నారను విషయమును నేనీ నాడు కన్నులారా చూచి నిశ్చయించు కొంటిని (4). ఓ ఆస్తికులారా! కావున, మీకు పూర్వకాలమునకు చెందిన, పార్వతీపరమేశ్వరుల సంవాదరూపమైన అద్భుతగాథనుచెప్పెదను (5). పూర్వము సకలజగత్తులకు తల్లి, దక్షపుత్రి అగు సతీదేవి తండ్రియొక్క యజ్ఞములో శివుడు నిందింపబడిన సందర్భములో దేహమును చాలించెను (6). ఆ దేవి తపస్సు యొక్క ప్రభావముచే హిమవత్పర్వతుని కుమార్తెయై, నారదుని ఉపదేశము వలన శివుని కొరకై ఆ గొప్ప పర్వతమునందు తపస్సును చేసెను. దేవదేవుడగు శివుడు ఆ పార్వతిని స్వయంవరపద్ధతిచే వివాహమాడగా, ఆమె సుఖించెను (7,8). తరువాత ఒకనాడు మహాదేవియగు ఆ గౌరి భర్తతో గూడి గొప్పది యగు హిమవత్పర్వతమునందు కూర్చుండి శివునితో నిట్లనెను (9).


మహేదేవి ఇట్లు పలికెను -


ఓ భగవాన్‌! పరమేశ్వరా! సృష్టిస్థితిలయతిరోధానానుగ్రహములనే అయిదు జగత్కార్యములను చేయువాడవు నీవే. సర్వమును తెలిసిన వాడవు. పరమ-అమృతమగు మోక్షమే స్వరూపముగా గలవాడవు అగు నీవు భక్తిచే తేలికగా లభించెదవు (10). ఓ మహేశ్వరా! నిన్ను నిందించే ప్రసంగము వలన నేను దక్షపుత్రికరూపములో నున్న దేహమును విడిచి ఇప్పుడు హిమవత్పర్వతుని పుత్రికనై యున్నాను (11). ఓ పరమేశ్వరా! మహేశ్వరా! నావు దయతో నాకు మంత్రదీక్షను ఇచ్చి నేను నిత్యము వివుద్ధమగు ఆత్మతత్త్వమునందు ఉండునట్లు చేయుము (12). చంద్రశేఖరుడగు శివుడు ఈ విధముగా పార్వతీదేవిచే ప్రార్థించబడినవాడై, అపుడు సంతోషముతో నిండిన మనస్సుతో ఆ దేవిని ఉద్దేశించి ఇట్లు పలికెను (13).


మహాదేవుడు ఇట్లు పలికెను -


దేవతలకు దేవతవగు ఓ ఈశ్వరీ! ఇట్టి సంకల్పము కలుగుటచే నీవు ధన్యురాలవు. కైలాసపర్వతశిఖరమునకు వెళ్లిన పిదప నిన్ను నీవు కోరిన విధముగా చేసెదను (14). అపుడు ఆయన హిమవత్వర్వతమునుండి పర్వతరాజమగు కైలాసమునకు వెళ్లి ఆమెకు దీక్షావిధానపూర్వకముగా ఓంకారము మొదలగు మంత్రములను క్రమముగా బోధించెను (15). మహాదేవుడు మంత్రములను చెప్పి ఆ దేవి శుద్ధమగు ఆత్మయందు నిష్ఠ కలిగియుండునట్లు చేసి ఆ దేవితో కూడి దేవతల ఉద్యానవనమునకువెళ్లెను (16). తరువాత సుమాలిని మొదలగు పార్వతీదేవి యొక్క చెలికత్తెలు కల్పవృక్షమునుండి పుట్టి వికసించియున్న పుష్పములను తీసుకువచ్చిరి (17). శంకరుడు మహాదేవిని వాటితో అలంకరించి ఆమెను తన అంకముపై కూర్చుండబెట్టుకొని ఆమె ముఖమును చూచి ఆనందముతో నిండిన ముఖము గలవాడై ఉండెను (18). తరువాత పార్వతీపరమేశ్వరులు సర్వప్రాణుల క్షేమమును కోరి వేదార్ధముతో సరిబోలియున్న ప్రీతికరమగు సంభాషణమును చేసిరి (19). ఓ తపశ్శాలులారా! అపుడు సకలజగత్తులకు తల్లియగు పార్వతి భర్తయొక్క అంకమునాశ్రయించి ఉన్నదై భర్తయొక్క ముఖమును చూచి ఇట్లు పలికెను (20).


శ్రీపార్వతీదేవి యిట్లు పలికెను -


ఓ దేవా! నీవు ఓంకారముతో సహా మంత్రములను ఉపదేశించితివి. వాటిలో ముందుగా ఓంకారముయొక్క అర్థమును నేను నిశ్చయముగా తెలియగోరుచున్నాను (21). ఓంకారము ఎట్లు పుట్టినది? అది ఎట్లు ఉచ్చరింపబడును? దానికి ఎన్ని మాత్రలు గలవు? అది వేదమునకు ఆది అని చెప్పుటకు కారణమేమి? (22). దేవతలుఎందరు? ఓంకారము వేదమునకు కారణము అని భావించే విధానమెట్టిది? కర్మలు ఎన్ని రకములు? వాటికి ఫలములతో గల కారణకార్యభావము ఎట్టిది? (23). ఈ మంత్రములో అయిదు బ్రహ్మలు క్రమములో ఎట్లు ఉండును? కళలు ఎన్ని అని చెప్పబడినవి? ఓంకారము ప్రపంచమునకు ఆత్మ ఎట్లు అగుచున్నది? (24) ఓ శివా! ఓంకారమునకు దానిచే బోధించబడే ఈశ్వరునకు గల సంబంధమెట్టిది? అక్షరములనుచ్చరించే స్థానములెయ్యవి. దీనియందు యెవ్వడు అధికారియని గ్రహించదగును? దీనికి విషయము ఎది? (25) ఇచట సంబంధమును ఎట్లు తెలియవలెను? దీనికి ప్రయోజనమేమి? ఉపాసకుని స్వరూపమెట్టిది? ఉపాసనకు స్థానము ఏది? (26) ఉపాసింపబడే వస్తువుయొక్క స్వరూపమెట్టిది? ఉపాసకునకు లభించే ఫలము ఏది? అనుష్ఠానమును చేయు విధానమెయ్యది? ఓ ప్రభూ! పూజకు స్థానము ఏది? (27) పూజలో మండలము ఏది? ఓ హరా! ఋషి మొదలగు వారు ఎవ్వరు? న్యాసమును చేసి జపించు విధమెయ్యది? పూజను చేసే విధానము మరియు క్రమము ఏది? (28). ఓ మహేశ్వరా! ఈ సర్వమును వివరముగా చెప్పుము. నీకు నా యందు దయ ఉన్నచో, నేను ఈ విషయములను యథాతథముగా వినగోరుచున్నాను (29).ఆ దేవి ఇట్లు చక్కగా ప్రశ్నించగా, చంద్రశేఖరుడగు శివభగవానుడు ఆ మహేశ్వరిని ప్రశంసించి చెప్పుటకు ఉపక్రమించెను (30).


శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు పార్వతీదేవి శివుని ప్రశ్నించుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).

కామెంట్‌లు లేవు: