15, జనవరి 2024, సోమవారం

జానపద కళారూపాలు*

 .      *జానపద కళారూపాలు*

            --------------------

      ఒకానొకప్పుడు పల్లెలు కళారూపాల ప్రదర్శనకు ఆలవాలాలుగా వుండేవి. సంవత్సరంలో అనేకరోజులలో అనేకరకాలవారలైన కళాకారుల ప్రదర్శనలవారితో సందడి సందడిగా వుండేవి.

       వారంతా ఆ ఆ గ్రామాలవారే కానక్కరలేదు, వివిధ ప్రాంతాలనుండి వచ్చి , ప్రజాకర్షణీయమైన వివిధరకాలైన కళలను ప్రదర్శించేవారు. అలా ప్రదర్శించినవారిలో, కొందరు ధనరూపేణా, మరికొందరు ధాన్యరూపేణా గ్రామాలలోని వివిధవర్గాల ప్రజలనుండి బహుమతులుగా అందుకొని, అలావచ్చిన వాటితో ఏడందంతా జీవనోపాధిగా మలుచుకొని, పిల్లాపాపలతో ఉఖంగా కాలంగడిపేవారు..అలాటి కళారూపాలను ప్రదర్శించేవారిలో కొందరు కళాకారులనుగూర్చి తెలుసుకొందాం.

        మాచిన్నప్పుడు మా రౌతులపూడికి రకరకాల కళాకారులు బ్రతుకు తెరువుకోసం వచ్చేవారు. పంటలు ఇంటికొచ్చే సమయంలో అయితే మరీ ఎక్కువమంది వచ్చేవారు. వాళ్ళలో పగటి వేషగాళ్ళు, పిట్టలదొరలు, దొమ్మరాటలవాళ్ళు, విప్రవినోదులు, జంగందేవరలు, కొండచెంచులు, తోలుబొమ్మలాటలవాళ్ళు ,బుడలుడక్కలవాళ్ళు, గంగిరెద్దులవాళ్ళు, ఇలా రకరకాలవావాళ్ళు వచ్చేవారు. వీరిలోకొంతమది డబ్బులు ఇచ్చినా తీసుకొనేవారుకాదు. రైతుల కళ్ళాలలోకెళ్ళి  ధాన్యంమాత్రమే వారిచ్చినంతమేరకు సంతోషంగా పట్టికెళ్ళేవారు. కొంతమందిమటుకు కొత్తబట్టలు పెట్టమని అడిగేవారు కానీ, కొత్తబట్టలతోపాటుగా పాతబట్టలు శుభ్రమైనవి ఇచ్చినా పట్టికెళ్ళేవారు.

             అలామాఊరు వచ్చిన కళాకారుల్లో  పగటి వేషగాళ్ళు, పిట్టల దొరలు, దొమ్మరాట వాళ్ళూ, కొమ్మదాసరులు, పిల్లలను బాగా ఆకర్షించేవారు. వారు ఎక్కడ ప్రదర్శనలిస్తే అక్కడికి  పొలోమని పిల్లలంతా వారిని కూడావెంటబడి పోయేవారు. తాటకి వేషం వేసిన వేషగాళ్ళని చూస్తే, పిల్లలకి ఒకరకంగా ఆసక్తిగా, మరోరకంగా భయంగా వుండేది. పెద్ద ఎత్తైన శరీరం, నల్లటి నలుపు, పెట్టుకొన్న రాక్షస కోరలు. జడలుకట్టిన జులపాలవంటి జుట్టూ, మొలకి వేపాకులు చుట్టుకొని, ఎత్తెత్తు వెనుకభాగంతో, బారకో అడుగు, మూరకో

అడుగు వేస్తూ డప్పుల లయకు శరీరాన్ని ఊపుతూ, నల్లటి కొండలా కదిలి వెళుతున్నట్లు తాటకి వేషదారి వెళుతుంటే, పిల్లలు భయపడుతూనే, వెంటబడి వెళ్ళేవారు. ఆ తాటకి  పిల్లలను తమాషాగా భయపెట్టడానికి, వున్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగి నాలుగడుగులు వేసేసరికి,

పిల్లలు భయంతో  పెద్దగా అరుస్తూ వెనక్కి పరుగుదీసేవారు. అలా అని ఆగిపోతారా, అంటే అలాగాగిపోరు మళ్ళీ తాటకి వెంటపడతారు. అదో తమాషావారికి.

         పగటి వేషగాళ్ళు రాముడూ సీతా, లక్ష్మీ విష్ణుమూర్తి, ఆంజనెేయుడూ, గరుక్మంతుడూ, రాధా కృష్ణులు మొదలైన పురాణాలలో వేషాలు వేసేవారు. అవే కాకుండా, నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్ మేదలైన దేశభక్తుల వేషాలూ వేసేవారు. అయితే, మొఖంలో సగభాగం శివుడిగా, సగభాగం పార్వతిగా, సగభాగం పులితోలూ, సగభాగం చీరకట్టుతోనిపించే అర్థనారీశ్వర వేషం చాలాబాగుండేది. అలా క్షణంలో ఎలా శివుడిగా, పార్వతిగా ఎలామారిపోతారో అని అప్పట్లో చాలా ఆశ్చర్యంగా వుండేది. తలమీదనుండి కప్పుకున్న గుడ్డను ముక్కుమీద సగభాగానికి వచ్చేలా కప్పుకొని, మొఖానికి ఒకపక్క శివునిగా, మరోపక్కన పార్వతిగా రంగులువేస్తారన్న విషయం,ఆగుడ్డను ఒకసారి శీవునివైపు, మరొకసారి పార్వతివైపుకు మారుస్తూ, శివపార్వతుల డైలాగులను  చెపుతారన్నవిషయం అప్పట్లోమాకు అస్సలు తెలియదు.

       కొమ్మదాసరి ముచ్చట్లు చెప్పనేలేము. దగ్గరలోవున్న చెట్టును చటుక్కున ఎక్కేసి,"ఓ సూరమ్మప్పయ్యో,! ఓ రామమ్మప్పయ్యో! ఓ పేరమ్మప్పయ్యో!

ఓ పచ్చచీర ట్టుకొన్నప్పయ్యో! ఓ ఎర్రచీర కట్టుకొన్నప్పయ్యో! ఉరికేస్తున్నా! ఉరికేస్తున్నానప్పయ్యో!పప్పుదాకలోకురికేస్తున్నానప్పయో!ఉప్పుదాకలోకురికేస్తున్నానప్పయ్యో!" అంటూ చేతిలో ఆచెట్టుకొమ్మ నొకటి విరిచి పట్టుకొని లయబద్దంగా పాడుతూ అతడు చేసే హడావిడి పిల్లలనూ, పెద్దలనూకూడా నవ్వుల్లో ముంచెత్తేది.

     అలాగే పిట్టలదొర. "దొరలమొచ్చేము.పిట్టలదొరలమొచ్చేము" అంటూ కర్రతుపాకీ పట్టుకువచ్చి చేసేహడావిడి అంతా ఇంతా కాదు. "హడావిడిగావుంది-హడావిడిగావుంది. మీ ఎత్తైన అరుగులు పల్లంచేయమంటారా? ఇంటింకీ కుళాయిలు,ఇంట్లో ఒక కుళాయి, పొయ్యమీదొక కూళాయి, పొయ్యిక్రిందోకుళాయి" అంటూ చెప్పేకబుర్లకు పొట్టలుపట్టుకు నవ్వవలసిందే జనాలందరూ.

       ఇక దొమ్మరాట చిన్న చిన్న పిల్లలను ఎత్తైన గడపైకి 

ఎక్కించి, బొడ్డును బేస్ గా చేసుకొని, డప్పుల ధ్వనికణుగుణంగా గిర్రుమని గుండ్రం తిప్పటం, రెండు గడలను దూరం దూరంగాపాతి, వాటికి సన్నని తాడుకట్టి, చేతితో ఒక పొడవైన గడకర్ర గుడ్రంగా తిప్పుతూ, ఆతాడుపైన యువతులు బేలన్స్ గా నడుస్తుంటే, కళ్ళు ఆర్పకుండా, నోళ్ళు తెరచి చూసేవారు.

      మరో కళాకారుడు నెత్తిమీద నూనె మూకుడు పెట్టి, మూకుడులో పకోడీలువండి పంచి పెట్టే ఛూ..మంతరకాళీ వాళ్ళను చూస్తుంటే భయంతో కూడిన ఆకర్షణగావుండేది.అయితే,చాలామంది పిల్లలు ఝడుసుకొని జ్వరంకూడా తెచ్చుకొనేవారు. 

        అలాగే తూర్పు తెల్లవారకుండా వచ్చే జంగందేవర "భంభం "అంటూ గుక్కతిప్పుకోకుండా ఊదే శంఖం ధ్వని ఊరంతా మారుమ్రోగేది. అతడికి ముందుగనో వెనుకగానో "అంబపలుకు జగదాంబ పలుకు" అంటూ ఆకర్షణీయమైన రంగు రంగుల బట్టలు ధరించి, తలపైన పేకాటలో కింగ్ నెత్తిపైన వుండే కిరీటంలాంటి టోపీ పెట్టుకొని,  డమరుకం మ్రోగిస్తూ వచ్చే బుడబుడక్కలవాడూ, అతడి మాటలూ అదోరకమైన ఆకర్షణ.

తోటపెద్దుఅనే ఆబోతును ఇంటింటికీ తీసుకొచ్చి గుమ్మాలముందు నిలబెట్టి, పెద్దపెద్ద  భజన తప్పెట్లు పట్టుకొని,గుడ్రంగా పద్మంలా కొంతమంది నుంచుంటే, మధ్యలో ఒకడు "హరిహరీ నారాయణా-ఆదినారాయణా- -కరుణించి కాపాడు కమలలోచనుడా.. "అంటూ నెమలికన్నులకట్ట ఒకచేతితో పట్టుకొని, మరోచేతితో ఎడమచెవి మూసుకొని శ్రుతిబధ్ధంగా పాడుతూ తిరుగుతుంటే, తప్పెటగాళ్ళ, తిరిగి ఆపదం ఒకటికి రెండుసార్లు అంటూ భళ్ళు భళ్ళు మని ఆ పెద్ద పెద్ద భజన తప్పెట్లు లయబధ్ధంగా వాయిస్తూ గుడ్రంగా తిరుగుతూ, ఒకకాలు ముందుకూ, మరోకాలు వెనక్కీ వెస్తూ చేసే ఆ కళాజాతర, చూడవలసినంత అందంగా వినవలసినంత శ్రవణానందకరంగావుండేది.ఆ భజనతప్పెట్ల శబ్దాలు మనగుండెల్లో మ్రోగినట్లుండేవి.. 

        అలాగే తూర్పు తెల్లవారకుండా వచ్చే జంగందేవర "భంభం "అంటూ గుక్కతిప్పుకోకుండా ఊదే శంఖం ధ్వని ఊరంతా మారుమ్రోగేది. అతడికి ముందుగనో వెనుకగానో "అంబపలుకు జగదాంబ పలుకు" అంటూ ఆకర్షణీయమైన రంగు రంగుల బట్టలు ధరించి  డమరుకంమ్రోగిస్తూ వచ్చే బుడబుడక్కలవాడూ, అతడి మాటలూ అదోరకమైన ఆకర్షణ.

తోటపెద్దుఅనే ఆబోతును ఇంటింటికీ తీసుకొచ్చి గుమ్మాలముందు నిలబెట్టి, పెద్దపెద్ద  భజన తప్పెట్లు పట్టుకొని, గుడ్రంగా పద్మంలా కొంతమంది నుంచుంటే, మధ్యలో ఒకడు హరిహరీ నారాయణాదినారాయణ- -కరుణించి కాపాడు కమలలోచనుడా.. అంటూ నెమలికన్నులకట్ట ఒకచేతితో పట్టుకొని, మరోచేతితో ఎడమచెవి మూసుకొని శ్రుతిబధ్ధంగా పాడుతూ తిరుగుతుంటే, తప్పెటగాళ్ళ, తిరిగి ఆపదం ఒకటికి రెండుసార్లు అంటూ, బళ్ళు బళ్ళు మని ఆ పెద్ద పెద్ద భజన తప్పెట్లు లయబధ్ధంగా వాయిస్తూ గుడ్రంగా తిరుగుతూ ఒకకాలు ముందుకూ, మరోకాలు వెనక్కీ వెస్తూ చేసే ఆ కళారూపం చూడవలసినంత అందంగా వినవలసినంత శ్రవణానందకరంగావుండేది.

    ఇక తోలుబొమ్మలాట వాళ్ళఆట వినోదం చూసితీరవలసిందే!కెెేతిగాడు, గుర్రాలక్కల హాస్యం వినితీరవలసినదే.ఈ తోలుబొబ్బలాట ఇప్పటికీ, అక్కడక్కడా కనిపిస్తోంది. వాళ్ళు తమకళను అదునాతనంగా మలచుకొని, నిలదొక్కుకోవడానికీ విశ్వప్రయత్నం చేస్తున్నారు.

 బ్రహ్మాల ఇళ్ళవాళ్ళు గౌరమ్మను తీసేమని, పెద్ద గౌరీదేవి ఆకారంలోని కర్రబొమ్మని నెత్తికెక్కించుకొని చేసే సంబరం కూడా చూడవలసినదే. హరికథలు భక్తిని ప్రభోదిస్తే, బుర్రకథలు వీర రసం, శోకరసం వొలికిస్తూ, శ్రుతిలయ భధ్ధంగా అడుగులేస్తూ, పాటపాడుతూ ముగ్గురు మనుషులు కథ చెపుతుంటే, వీరరసం తో గుండెలు ఉప్పొంగిస్తూ, శోకరసంతో గుండెలు పిండేస్తూంటే వంతగాడు హాస్యం చెపుతుంటే మనలో ఆఆ రసాలు ఉత్తేజితులను చేస్తాయి.

     అలాగే హరికథలు. భక్తిరసంతోకూడిన హరికథలను, చూడవచ్చిన జనంలో భక్తినిండి, పరవళ్ళుత్రొక్కేలా  గానం చేసేవారు. మధ్యమధ్యలో హరిదాసు చమత్కారంతో, హాస్యంతో నిండిన పిట్టకథలను చెపుతుంటే , వినేవారి ఆనందమేవేరు. ఎక్కడ హరికథలను చెపున్నారని తెలిసినా జనం ఆలకించడానికి పరుగులు తీసేవారు.

     ఇక నాటకాల సంగతి చెప్పేదేముంది. వాటిగురించి చెప్పలేనిదేముంది?ఎన్నెన్ని నాటకాలు? పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు,పద్యనాటకాలు, గద్యనాటకాలు. మొదటి రెండవతరం సీనీమావాళ్ళంతా నాటకాలలో నటన నేర్చుకొని, అధ్భుతంగా ప్రదర్శనలిచ్చి, ఆ తరువాత తరువాత సినీమాలలో అధ్భుతంగా రాణించారు. ఎనలేని కీర్తిని మూట కట్టుకొన్న వారెందరెందరో.

     

      మరొక కళారూపం విప్రవినోదం. విప్రవినోదులు బహుశా బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారై వుండివుంటారు.అందువలనే ఆ కళకు విప్రవినోదం అనే పేరు వచ్చివుండవచ్చు.

      వీరి వస్త్రధారణ,భాష కూడా తమాషాగా వుంటుంది. పంచకట్టు, చొక్కాపైన కోటు, తలకు కాబూలీవాలాలాంటి రంగురంగులగుడ్డతో తలపాగా, భుజానికి ఒక పెద్దసంచీ, చేతిలో వెండిపిడి కలిగిన లాఠీతో హుందాగా నడచుకొంటూ వస్తారు.

      వీరి విప్రవినోదకళ పిల్లల్ని పెద్దల్నికుడా బాగా ఆకర్షిస్తుంది. అందుకనే వీరి ప్రదర్శనదగ్గర జనం గుంపుగూడతారు.

      ఈ విప్రవినోదం అనేకళ, ఒకరకంగా ఇంద్రజాలం అనిచేప్పవచ్చు. అందుకనే ఇతగాడు మాటకీ మాటకీ మధ్యన, "ఇంద్రజాల-మహేంద్రజాల, జలయక్షిణీ మహేద్రజాల యక్షిణీ, రా.."అంటూ, తన భుజంనుంచి క్రిందకు దింపిన సంచీ పైభాగానికి, తన వెండిపొన్నులాఠీని తాకిస్తూ, తన నుదుటికి తాకించు కొంటుంటాడు.

      "జలయక్షిణీ-మహేంద్రజాలయక్షిణీ " అంటూ మంత్రంలా చదువుతూ, సంచిలోంచి గెచ్చకాయయతీసి, గుప్పిటిలో మూసి, ఆగుప్పిటపై లాఠీని తాకించి, ఆ గెచ్చకాయను శరీరం లేకుండా, తలమాత్రమే కల చిలుక పిట్టను చేస్తాడు. ఆ చిలుకపిట్టతో అతడు చేసే సంభాషణ భలే తమషాగావుంటుంది.

     "అయితే చిలకమ్మా! అమ్మగారు నీకు పప్పన్నం పేడతారు తింటావటే?" అంటాడు. అది "తింటా-తింటా-తింటా"అంటుంది.

"అయితే నెయ్య వేసుకుంటావా, వద్దా" అంటాడు.

అది వేసుకొంటా, నెయ్యి వేసుకొంటా!" అంటుంది.

"అయితే చిలకమ్మా!ఆవునెయ్యి వేసుకొంటివా?గేదనెయ్యా?" అంటాడు.

అది, ఆవునెయ్యే!ఆవునెయ్యే, ఆవునెయ్యే !" అంటుంది.

    "మరిగేద నెయ్యి ఎందుకువెసుకోవే ?" అంటాడు.

    "హమ్మో!జలుబుచేస్తుంది-జలుబు చేస్తుంది-జలుబు చేస్తుంది." అనగానే, అక్కడ గుమిగూడిన జనమంతా ఘొల్లున నవ్వుతారు.

     అలాగే విప్రవినోది సంచీలోంచి ఇసుకను తీసి, పసుపుకుంకుమలుగా చేసి అందరికీ కుంకుమ బొట్లుపెడతాడు. గెచ్చకాయను సంచీలోంచి తీసి, దానికి "జలయక్షిణీ అంటూ మంత్రంచదివి, గెచ్చకాయను రూపాయకాసును చేసి, దగ్గరగా వున్న వాళ్ళ చెవిలోకి పంపించి, మంత్రంచదువుత, లాఠీని ముక్కుకు తాకించి, ముక్కులోంచి రూపాయి కాసును రప్పిస్తాడు.

    అలాగే, గెచ్చకాయను సంచీలోంచి తీసి, జలయక్షిణీ అంటూ మంత్రం చదివి, లాఠీ తిటించి, పొడపాము పిల్లను చేయడం చూస్తుంటే, మనశరీరం భయంతో గగుర్పొడుస్తుంది.

     ఇలాంటివే మరెన్నెన్నో ప్రదర్శిస్తాడు విప్రవినోది. మనని మంచిమాటలతో కనికట్టుచేసి, బియ్యం, డబ్బులూ, బట్టలూ  మొదలైనవి దండిగా తీసుకెళతాడు.పొలాలోకి వెళ్ళి, రైతులదగ్గర మంచిమాటలు చెప్పి ధాన్యం

తీసికెళతాడు.   

           కవితకు కాదేది అనర్హంది  అన్నట్లు గానే, ఈ జానపదకళలలో ఏదిమంచీ, ఏది చెడ్డా? ఏదిబావుంటుంది ?ఏదిబాగుండదు ? అంటే అన్నీ బాగుండేవే జానపదకళలూ-కళారూపాలు.

     నేడు జానపదకళలకు ఆదరణ కొరవడి, చాలామటుకు మరుగున పడిపోయాయి. ఇంకా ఒకటో అరావున్నా, అవికూడా మరుగునపడిపోయే చరమాంక దశలలో వున్నాయి. ఇప్పటి తరంవారికే చాలామటుకు ఈ కళల గురించి తెలియదు. రాబోయేతరాలకు తెలుసుకోవడానికి కూడా ఇవేవీ మిగిలివుండవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: