గుహుని రామభక్తి!
చ: "సుడిఁగొని రామపాదములు సోకిన ధూళివహించి రాయి యే
ర్పడ నొక భామ యయ్యెనట!::,పన్నుగ నీతని పాదరేణువి
య్యడ వడిసోఁక నిది యేమగునో యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామ పదకంజయుగంబు భయంబు పెంపునన్.
మొల్లరామాయణము--- కుమారి మొల్ల కవయిత్రి;
సరళతరమైన మనోజ్ఙమైన రామాయణ రచనగా ఆంధ్ర సాహిత్యంలో మొల్లరామాయణానికి విశిష్టమైన
స్థానం ఉంది. చదువరులకు విసుగు జనించనిరీతి నాసాంతము నొప్పారెడు యీగ్రంధము.మన సాహిత్య సంపదకు వెలలేని యలం
కారము.
రాముడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యమునకు బోవునపుడు గంగను దాటు సందర్భమున నీపద్యము చోటుచేసికొన్నది. గుహుడు నావను నడపి జీవించువాడు. పామరుడే కాని గుండెలనిండుగా రామభక్తి కలవాడు.
నదీతరణమొనరింప రాముడు నావ నెక్కునపుడు గుహుడాతని పదపద్మములను ప్రక్షాళనమొనరించెనట! దానికొక హేతువు
నీకవయిత్రి కమనీయముగా సూచించుచున్నది.
ఆటవికుడు పామరుడును అయిన గుహునకు సందేహముకలిగినదట. ఏమని? వెనుక గౌతమాశ్రమ సందర్శన
సమయమున రాముని పాదరజము సోకి ఒక రాయి వనితామణియైనదని విన్నాడు. మరి రామపాద మహిమచే తన నావ గూడ
నట్లయినచో తనగతియేమి? జీవికయా పోవును. సవతి పోరు ప్రారంభమగును. ఇదీ వాని సందేహము.
తత్పరిహారముగా రాముని పద పద్మములను గుహుడు కడిగినాడు అని మొల్ల సమర్ధనము.
దీనివలన
రామపాద ప్రక్షాళణ పలమూ వానికి దక్కినది. సందేహమూ తీరినది. ఎంత చక్కటి కల్పనము!
స్వస్తి!🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి