25, మే 2024, శనివారం

తెలుగు చరిత్రలో

 తెలుగు చరిత్రలో అరుదైన జ్ఞాపకాలు..


 


జ్ఞాపకం అనే పదం దాదాపుగా దూరమవుతోంది. జ్ఞాపకం ఉండటం లేదు అనే మాట ఇటీవల కాలంలో చాలా చోట్ల వింటున్నాం. ఏ వస్తువు ఎక్కడ పెట్టామో ఎవరికీ గుర్తుండదు. ఎప్పుడు ఏ పని చేయాలో జ్ఞాపకం ఉండదు. ఇక జయంతుల మాట చెప్పనక్కర్లేదు. కుటుంబంలోని వారివైనా ఏదయినా ప్రత్యేకంగా అంటే పండుగ రోజుల్లో ఉంటేనే తప్ప జ్ఞాపకం ఉండదు. ఒక్కోసారి మన పుట్టినరోజు, మన పెళ్ళి రోజు కూడా జ్ఞాపకం ఉండదు.


                ఇలాంటి అయోమయమైన వాతావరణంలో తెలుగు భాషను ఉద్దరించిన ప్రముఖుల అభిమానిగా అంటూ తెలుగు భాషను తమదైన శైలిలో ఒక చరిత్రగా మార్చిన ఎందరో జయంతులను జ్ఞాపకం పెట్టుకుని వారందరిమీద తనకు కలిగిన భావాలను కవిత్వీకరించిన కవి మద్దాళి రఘురామ్‌ గారు ధన్యులు. కేవలం కవిత్వమే కాకుండా నాట్యం, బుర్రకథ, నటన, వీణ, చిత్రలేఖనం వంటి కళలకు ఎంతో కృషి చేసిన ప్రముఖుల జయంతులను కూడా గుర్తు చేస్తూ కవిత్వం రచించి, వారిని మరింతగా చిరస్తాయిగా నిలబడటానికి దోహదం చేసారు. ఒక కార్యకర్తగా, ఒక ప్రచురణ కర్తగానే కాకుండా కవిగా, సంపాదకునిగా తెలుగు భాషకు సేవలను చేస్తున్నారు మద్దాళి రఘురామ్‌ గారు.


                 ఈ కవితా సంపుటిపై ముగ్గురు ప్రముఖులు ముందుమాట రాసారు. రఘురామ్‌ గారి కవితా విశిష్టతను తెలియజేస్తూ, డా॥ కెవి రమణాచారి గారు, ఈ కవిత్వంలోని సొగసు, బహుముఖీనతల్ని తెలియజేస్తూ మాజీ ఉపసభాపతి గారైన మండలి బుద్ధప్రసాద్‌గారు, నాలుగున్నర దశాబ్ధాలుగా తెలుగువారిలో ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకున్న సాంస్కృతికోద్యమం గా కిన్నెర ప్రస్ధానాన్ని తెలియజేస్తూ, రఘురామ్‌ గారిపైన చక్కని కవిత్వాన్ని రచించిన డా॥ ఎన్‌ గోపిగారు, ఇందరి మహనీయులను కవిత్వీకరించే సమయంలో  మనిషికి మనిషికి మధ్య కాలానుగుణంగా ఎదురయ్యే జీవిత సత్యాల్ని, కవి వ్యక్తీకరణలో వివరించిన  అక్షర సత్యాల్ని  కళ్ళకు కట్టినట్లు తెలియజేసిన డా॥ ఓలేటి పార్వతీశం గారు. వీరంతా ఆ గ్రంథానికి చక్కగా పలకరించారు. అవిచాలు కవి రఘురామ్‌ గారి కవితాభినివేశం ఎంతవరకు ఉందో అని చెప్పడానికి..


                వీరు రచించిన వెండివెన్నెల, వెన్నెల కన్నీరు, అక్షరాల కన్నీరు, తూకానికి కన్నీళ్ళు వంటి కవితా సంపుటాలు చదివాను. వీరి ప్రతి కవితా  ప్రామాణిక విలువలు కలిగివుంటాయి. ఒక వ్యక్తిని గురించి రాసేటప్పుడు కానీ, ఇతర వస్తువులపైన, సంఘటనలపైన స్పందించేటప్పుడు కానీ కేవలం విషయమే కాకుండా కవిత్వం ఉండేలా చూసుకోవడమే వీరి ప్రత్యేకత..


                వీరు రచించిన తెలుగు ప్రముఖుల అభిమానిగా అనే పేరుతో వెలువడిన వీరి గ్రంధంలో దాదాపు 36 కవిత్వాలున్నాయి. ఒక వ్యక్తిమీద కవిత్వం రాయడం కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తిమీద కవిత్వం రాయాలంటే వారు నిత్యం కనిపిస్తూ ఉండాలి. లేదా వారు సాధించిన విజయాలు వినిపిస్తూ ఉండాలి.  ఈ రెండూ లేదంటే వారి గురించి తెలుసుకోవాలనే తపనతో అభ్యాసం చేసి ఉండాలి. నాకు తెలిసి ఆ తపన తోనే వీరు ఇంతమంది ప్రముఖులపై కవిత్వం రాసారనిపిస్తుంది. దీనికి తోడు కిన్నెర సంస్థ ద్వారా మనం చూడటానికి కూడా నోచుకోని ప్రముఖుల్ని కూడా సన్మానించుకోవడం, వారితో నిత్యం మాట్లాడుతూ ఉండటం, వారి వారి ఇండ్లకు వెళ్ళి వారితో చాలాసేపు ముచ్చటించడం ద్వారా కూడా వీరికి ఇంత కవిత్వం రాయడానికి కుదిరింది.


                రఘురామ్‌ గారు రచించిన ఈ కవితా గ్రంథంలో గురజాడ నుండి కందుకూరి, గిడుగు రామ్మూర్తి, పానుగంటి, బుచ్చిబాబు శ్రీ రాచకొండ, అడవిబాపురాజు, దేవులపల్లి, కొవ్వలి, పింగలి, ఆరుద్ర, జమున,  వంటి అనేక మంది ప్రముఖులపై వీరునటి జమున వరకు ఎవరి గురించి రాసినా నేను కవిత్వంతో చెబుతాను అంటారు రఘురామ్‌ గారు.. వీరు రచించిన ప్రముఖులపై మనకు కనిపించే కవితాంశాలు..


                 ‘‘ఎన్ని తరాలు మారినా చెదరనిది గురజాడ`అడుగుజాడ’


                ‘‘అతడు అక్షరంలా అనిపిస్తాడు ...‘‘తెలుగు భాషా వికాశాన్ని తీర్చిన వెన్నెల మడుగు’’ గిడుగు


                ఒక కాళిదాసు ఒక శ్రీనాధుడు కలిస్తే పానుగంటి’’


                ‘చిలకమర్తి రచనలన్నీ/ తెలుగు జాతి పక్షాన / తెరచిన గవాక్షాలు’’


                ఏ తరానికైనా నచ్చుబాబు’ అంటూ బుచ్చిబాబు


                ‘తెలుగు కథల కొండ` రాచకొండ’


                ‘బాపిరాజు పేరంటే ప్రజ్ఞకు తొలి అర్థం’’


                ‘నీ కృష్ణ పక్షం చదివాకా/ నేను కృష్ణశాస్త్రి పక్షమే’


                ‘‘వెయ్యి నవలల లోగిలి` కొవ్వలి’


                ‘నీవు తీర్చిన పతాకం/ నీ పార్థివ దేహంపైన దివ్య వస్త్రమై పరచుకుంది (పింగళి)


                ‘నమస్సుల మాలపట్టి/ నీ యశస్సు ముంగిట్లో నిలుచున్నాను.-విశ్వనాధ సత్యనారాయణ


                చేకూరి రామారావు గారిపై చేసిన అద్భుతమైన ప్రయోగం ‘ఆ కుర్చీ ఎప్పటికీ ఖాళీనే’ అని ఇప్పటికీ విమర్శ అంత చక్కగా చేసేవారే లేరని తెలియజెప్పే తీరు..


                ‘రంగు చూసినప్పుడల్లా/ నాకు అతడి జ్ఞాపకమే/ రేఖలు వంపు తిరిగినా/ నాకు అతడి జ్ఞాపకమే’’ అంటూ వడ్డాది పాపయ్య


                డా ఈమని శంకరశాస్త్రి ‘తీరమంతా నీరునిండినట్లు/ నీ ఒడిలో వీణ పరచుకుంది’


                ‘నటరాజ నామధేయం/ మీ శిరస్సుపై వెలిగే కీర్తి కిరీటం’


                ‘షేక్‌ నాజర్‌ అంటే / ఒక వ్యక్తి రూపానికి పెట్టిన పేరు కాదు/ బుర్రకథకు విశ్వరూపం’


                ఇక నటనలో అక్కినేని, తెలుగింటి అత్తగారు సూరేకాంతం, నృత్యంలో శోభానాయుడు, పుచ్ఛా పరబ్రహ్మ శాస్త్రి , ‘సూర్యోదయమా? చంద్రోదయమా? ఏమో కాలం తీర్పు చెప్పాలి’ అంటూ చిత్రకారుడు చంద్ర గురించి అభినవ సత్యభామ జమున గురించి అందరినీ తలచుకుంటూ.. వారిని అక్షర కిరీటంలో రత్నాల్లా పొదిగారు. నిజంగా వీరి ప్రయత్నం నిరంతరం నిలిచిపోయేది. నేడు పరుగుల ప్రపంచంలో ఎవరికి వారే మహా కవులము అనుకుంటున్న భావితరాలకు అందితే తమకు ముందు ఇంతమంది ప్రముఖులు ఉన్నారా అనే స్పురణకు వస్తుంది. నిజమైన కీర్తిలో శబ్ధం ఉండదు. నిజమైన కవిత్వంలో ప్రాసలుండవు. జీవన వాస్తవంలో ఉండేదంతా మానవత్వమే. మహనీయుల సుతిమెత్తని పదాల ప్రయాణమే.. అని నిరూపించిన ఈ గ్రంథ కవి మద్దాళి రఘురామ్‌ గారికి నా అభినందనలు..


 


ప్రతులకు:


కిన్నెర పబ్లికేషన్స్‌


ఫోన్‌: 9866057777


 


                                                                                                                                                శైలజామిత్ర

కామెంట్‌లు లేవు: