25, మే 2024, శనివారం

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి

 దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి 

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత తెలియని తెలుగువారు వుండరు. నిజానికి పండిత పామరులకు ఎల్లప్పుడూ నాలుకమీద ఆడే సామెత ఇది.దీనిని సాధారణ సామాజిక అర్ధంలో యేమని అంటారంటే క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పనులు ముగించుకోవాలి. కాలం గడచినతరువాత వగచిన ప్రయోజనం లేదు. ఇంకా కొంచం వివరంగా చెప్పాలంటే ఏ సమయంలో చేయాల్సిన పనులు ఆ సమయంలోనే చేయాలి కానీ కాలయాపన చేయకూడదు. ఒక రైతు వర్షం రాగానే భూమి దున్ని పైరు వేయటానికి సిద్ధపడాలి, అదే కాలం దాటినదాకా కాలయాపన చేస్తే పైరు పండదు సరికదా పెట్టిన పెట్టుబడికూడా వృధా అవుతుంది. 

అసలు ఈ సామెత ఎలా పుట్టిందా అని ఆలోచిస్తే నాకు తట్టినది. పూర్వం కిరోసిన్ దీపాలు కూడా లేనప్పుడు అంటే అప్పుడు కరంట్ అస్సలు లేదనుకోవాలి. ఆముదంతో దీపాలు వెలిగించేవారట. చిన్న మట్టి ప్రమిదలో ఒకటో రెండో ప్రత్తివత్తులు వేసి ఆముదం పోసి దీపం వెలిగించేవారు. ఇప్పడు మనం దీపావళికి వెలిగిస్తున్నాము. అయితే ఆ దీపం ప్రమిదలో ఆముదం వున్నంతవరకు మాత్రం వెలుగుతూ ఉండేది. తరచూ దానిలోని ఆముదాన్ని చూసుకుంటూ రాత్రిపూట ఇంట్లో పనులు చేసుకునేవారు. అంటే వారు దీపం ఆరిపోకముందే అన్నీ పనులు ముగించుకొని మంచం మీదకు చేరాలి. అది వారి దిన చర్య. అంటే త్వర త్వరగా పనులు చేసుకోవాలి. ఈ సామెతను మనం ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా అన్వయించుకోవచ్చు. 

ఈ ప్రపంచం మొత్తం వెలుగుతో నిండి వున్నది.  ఆ వెలుగు మనకు పగటిపూట సూర్యభగవానులద్వారా వస్తున్నదన్నది అందరకు  తెలిసిన సత్యం. వెలుగు ఉంటేనే ప్రతి వస్తువు ప్రకాశిస్తుంది. వెలుగుతోటె మనకు మనముందు వున్న కుండ కుండగా, గ్లాసు గ్లాసుగా, మనిషి మనిషిగా కనిపించుతున్నాడు. మరి ఆలా కనిపిస్తున్నది ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం ఇస్తాము.  ఆ నేను ఎవరు అని ఆలోచించి మన మేధావులు మనకు ఇచ్చిన సమాధానం నాలో వున్న నేను ఆ నేను అనే ప్రకాశం వలననే నేను నేనుగా బాసిల్లుతున్నాను( తెలియపడుతున్నాను) ఆ ప్రకాశాన్ని మన ఋషులు ఆత్మ అని ఆ ఆత్మ పరమాత్మ అంశమని మనకు తెలియపరిచారు. మన ఉపనిషత్తులు కూడా ఈ సత్యాన్నే తెలుపుతున్నాయి. "అహం బ్రహ్మస్మి' అనే మహా వాక్యము ఇంకా 'తత్వమసి' అనే మహావాక్యాలు ఈ విషయాన్నే తెలుపుతున్నాయి. ఒక సూర్యుడు నీరు వున్న అనేక కుండలలో అనేక సూర్యుళ్ళలాగా ఎలా కనపడుతున్నాడో అదేవిధంగా ఒక పరమాత్మా అనేక జీవులలో అనేక ఆత్మలుగా మనకు గోచరిస్తున్నాడు. ఆ ఆత్మే జీవులలో (మనుషులలో) వెలిగే ప్రకాశం లేక దీపంగా మనం అభివర్ణించవచ్చు. ఆ దీపం ఎంతసేపు వెలుగుతూ వుండాలని నిర్ధారించే ఆముదము మనిషి ఆయుష్షు గా మనం తెలుసుకోవచ్చు. ఏరకంగా అయితే మనం ఇంట్లో దీపం ఆరిపోకముందే ఇంటి కార్యాలన్నీ చక్కదిద్దుకుంటామో అదే విధంగా జీవుడు తనలోని దీపం (ఆయుష్షు) ఆరిపోకముందు తన జీవన వ్యాపారాలన్నీ ముగించుకోవాలి. 

నేను పుట్టింది ఈ శారీరిక సుఖాలను, భోగాలను అనుభవించటానికి కాదు ఇవన్నీ శరీరానికి సంబందించినవి, మరియు తాత్కాలికమైనవి అని ఎప్పుడైతే సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు అతని మనస్సు నిత్యం సత్యము, శాశ్వితము అయిన పరబ్రహ్మ సుఖం వైపు మళ్లుతుంది. అది తెలుసుకున్న ముముక్షువు మోక్షార్ధి అయి సాధన చేసి జీవైక్యం పొందుతాడు. ఆ అద్వితీయ అనుభవానికోసం ప్రతి సాధకుడు కృషిచేయాలి. సాధనాత్ సాధ్యతే సర్వం.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: