అవకాశమే అదృష్టం
మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు. ఇష్టపడినప్పుడు వసంతం రాదు. చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుస్సు కనిపించదు. ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదు. వచ్చినవి. పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే చేతికందిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యానికి చేరువవుతాం.
అవకాశాలు తమంతటతాముగా మన చెంత చేరవు. వాటి కోసం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. అందిన అవకాశాలను చేజిక్కించుకుని కార్యనిర్వహణలో విజయం సాధించాలి. రామాయణంలో హనుమంతుడు సీతాన్వేషణ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. ఎన్నో రకాల పరీక్షలను, అడ్డంకులను అధిగమించి చివరికి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. రామకార్యాన్ని పూర్తిచేశాడు. అలాగే ఉడుత సైతం తన వంతు సాయం చేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాముడి ప్రేమను పొందింది.
చరిత్రలో నిలిచిపోయింది. కురుక్షేత్ర యుద్ధంలో మోహావేశంలో చిక్కుకున్న అర్జునుడి మనసును మార్చాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. మిత్రుడు, బంధువు అయిన అర్జునుడు అజ్ఞానపు చీకటి లోయలోకి జారిపోకుండా కాపాడి గీతామృత బోధ చేసి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. అవకాశాలు కలిసిరావడానికి అదృష్టం ఉండాలని కొందరి వాదన. నిజానికి అదృష్టవంతుడు అంటే ఎవరో కాదు. కిందపడ్డ ప్రతీసారి లేచి నిలబడేవాడు. ఎదురుదెబ్బలు, కష్టనష్టాలు, అవరోధాలు- జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడు. ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికీ కఠినంగా అనిపించదు. అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ప్రతీ సమస్య వెనకా ఒక అవకాశం ఉందని భావించి ఆశావాదంతో ముందడుగు వేస్తాడు.
చాలామంది తమను దురదృష్టం వెంటాడుతోందని, అవకాశాలు రాకుండా ఎవరెవరో అడ్డుకుంటున్నారని, కొందరు మోసం చేస్తున్నారని భావిస్తుంటారు. నిజానికి మనకు ఏది రావాలో అదే వస్తుంది. ఆ భగవంతుడికి ఎవరిమీదా పక్షపాతం ఉండదు. ఎవరు దేనికి అర్హులో అదే వారు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
భగవంతుడి పూజ తరవాత పువ్వు, పండు... ఇలా ఏదైనా భక్తితో, కృతజ్ఞతతో స్వీకరిస్తాం. అలాగే ఈ జీవితంలో లభించిన ఎలాంటి అవకాశాన్నయినా భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరించాలి. స్వశక్తితో ఇతరులను ఒప్పించి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి అనుకున్న లక్ష్యాలను చేరడానికి ప్రయత్నించాలి.
ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్తవ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషికీ తప్పక దైవశక్తి తోడవుతుంది. అప్పుడు అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. చేతికందిన అవకాశాలను స్వార్థప్రయోజనాలకు కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి. దానం, పరోపకారం, సమాజ సేవ నిర్వహించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని దైవకార్యాలుగా భావించి నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. అలాంటి అవకాశాల వల్లే మనిషికి శాశ్వతకీర్తి లభిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి