25, మే 2024, శనివారం

భార్యాపుత్రాదులు

 *ఋణానుబంధ రూపేణా*

*పశుపత్నీ సుతాలయః*,

*ఋణక్షయే క్షయం యాంతి*

*కా తత్ర పరివేదనా*.

```

భావం: "పశువులు,భార్యాపుత్రాదులు, ఇళ్ళూవాకిలి ఇవి ఋణానుబంధ రూపంగా వచ్చి, ఋణం తీరగానే వెళ్ళిపోతాయి. 

ఋణం తీరిపోతే ఇక బంధాల వల్ల కలిగే దుఃఖం ఉండదు కదా"


ముఖ్యంగా మనకు రావాల్సిన వాటిని గుర్తుపెట్టుకుంటాం. కానీ మనం ఇవ్వాల్సిన వాటిని మర్చిపోతాం. మనం ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అది ఇచ్చేవరకు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది. మనం తీసుకున్న వాటిని తిరిగి చెల్లిస్తే బంధవిముక్తులమవుతాం. 


ఈ జన్మలో ఇతరులతో మన అనుబంధాలకు కారణం గత జన్మలోని బంధాలే.   


బంధాలెన్నో రకాలు. అందులో ఋణానుబంధం చాలా ముఖ్యమైనది. మనం బంధవిముక్తులం కావాలంటే ఋణవిముక్తులం కావాలి. 


ఇచ్చిన వారు మర్చిపోయారు, అడగడం లేదు కదా, అని మనం తీసుకున్నదాన్ని తిరిగి ఇవ్వకపోతే జీవితాంతం పూజలు చేసినా మనం బంధవిక్తులం కాలేం. ఇచ్చిన వారు మర్చిపోయినప్పటికీ, తీసుకున్న వారు దానిని గుర్తుపెట్టుకొని, తిరిగి ఇచ్చినప్పుడే బంధ విముక్తులవుతారు.


పూర్వం యోగులు తీసుకున్న దానిని ఎక్కడ మర్చి పోతామేమోనని తక్కువగా గ్రహించేవారు. ఎంత అవసరమో అంతే గ్రహించేవారు. అవసరానికిమించి, అది ఉచితంగా వచ్చినప్పటికీ దానిని స్వీకరించేవారుకాదు. ఇస్తున్నారు కదా అని తీసుకుంటూపోతే ఎప్పటికీ బంధవిముక్తులం కాలేము. 


యోగులు అభ్యసించే  “అపరిగ్రహం” ఎంతోకొంత మనం పాటించగలిగితే ఋణానుబంధానికి దూరంగా ఉండగలుగుతాం, ఆ భగవంతునికి దగ్గరవగలుగుతాం.

కామెంట్‌లు లేవు: