16, జూన్ 2024, ఆదివారం

జననీ జనకుల్ కడు వృద్ధులు

 నాన్నలకోసం...


బతుకుతున్న బతుకు తన కోసమే కాకపోవడంలో- ఒక రకమైన తీయదనం, తృప్తి, ఉదాత్త జీవన సాఫల్యం దాగి ఉంటాయి. లోకంలోని తండ్రులకు దక్కే అపురూపమైన అనుభూతుల్లో ముఖ్యమైనవవి. 'అమ్మా!' అంటూ అదితికి ఎదురొచ్చాడు వామనుడు. 'నన్ను కన్నతండ్రి! నా పాలి దైవమా...' అంటూ ఆప్యాయంగా హత్తుకొంది అదితి. కన్నతండ్రి అనేది మమకారపు నుడికారం. కన్నకొడుకును కన్నతండ్రీ... అని పిలవడం తెలుగు భాషకు దక్కిన వరం! కన్నతండ్రి పదానికది సత్కారం. దాశరథి, వాసుదేవుడు, గాధేయుడు, (విశ్వామిత్రుడు), పాండవులు... వంటి పదాలన్నీ తండ్రిని గుర్తుచేసే తనయుల పేర్లు. తండ్రీ తనయుల అనుబంధాన్ని బలంగా నిలబెట్టే వేళ్లు. 'అమ్మానాన్నలు ద్వంద్వ సమాసం' అంటుంది వ్యాకరణం. ద్వైతం కాదు- అద్వైతం అంటుంది నిజజీవితం. ఆ సమాసంలో తండ్రి పదం ద్వితీయమే అయినా, సంతానాన్ని పెంచి పెద్దచేయడంలో ఆయన పాత్ర అద్వితీయం- అని స్పష్టం చేస్తుంది. శివుడి ఆకలిని తిలకిస్తూ 'ఆకలి తోడ నీ కడుపున ఆరడి అచ్చట... చూడలేక, నీ ఆకలి తీర్చలేక కడుపారడి ఇచ్చట' అంటూ కుమిలిపోయిన తిన్నడి అంశకు చెందినవారు- మన నాన్నలు. రామ వియోగంతో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన దశరథుడి ప్రతిరూపాలు. శకుంతలను అత్తవారింటికి పంపిస్తూ బెంగతో కంటతడి పెట్టిన కణ్వమహర్షులు. కవి రసరాజు చెప్పినట్లు నాన్నల బతుకుల నిండా ఎన్నో ముళ్ల బాటలు... సరి చేసేదెవరు? 'దేహం తండ్రి ప్రసాదం' అంది వేదం. జన్మదాత మాత్రమేకాదు- 'నా ప్రభు నాదుస్వామి మరి నా జనకుండు గురుండు మిత్రుడున్, నా ప్రథమాప్తుడాయన' అన్నారు బులుసుకవి. ఆ మాటకొస్తే ఒక్కో తండ్రి తన కొడుక్కి ఇంకా ఎన్నో! నాన్నంటే- పుస్తకాల పుటలమధ్య దాచుకొన్న నెమలి కన్ను. తనయుడి మనుగడకు బలమైన దన్ను.


'ఫలానావారి పిల్లలు' అని గొప్పగా అనిపించుకొన్నప్పుడు- ఏ కొంతో తీరుతుంది నాన్నలకు మనబాకీ. 'చిన్నప్పుడు నాన్న చేతిలో కర్ర- ఇప్పుడు నాన్నకు నేను చేతికర్ర' కాగలిగితే, మరికొంత...! నిజానికి నాన్నల చేతిలో కర్ర మనల్ని దండించేందుకు కాదు- సరిదిద్దేందుకు. 'చేయి పట్టి నాన్న- నడక నేర్పినదే తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు... ఈత కొరకు నన్ను నీట నెట్టినదే తెలుసుగాని, నా తెగువకు ఉగ్గుపాలు పడుతున్నది తెలియలేదు' అని గజల్ కవి రెంటాల అంటున్నది అదే. దీన్ని గ్రహించేలోగానే తండ్రి కనుమరుగై పోతే... అది, తనయుడి దురదృష్టం. దాన్ని గుర్తుచేయడానికే భారతం మనకు ధర్మవ్యాధుడి కథ చెప్పింది. 'ఎంతయు వృద్ధులై తమకు నీవు ఒకరుండవె తెప్ప (ఆధారం) కాగ... ఉన్న ఒక్కకొడుకును నమ్ముకొని నీ ముసలి తల్లిదండ్రులు కాలం గడుపుతుంటే, వారి కర్మకు వారిని వదిలేసి తగుదునమ్మా- అంటూ దివ్యజ్ఞానం కోరి వచ్చావు. నీకది ఎలా అబ్బుతుంది?' అని కౌశికుణ్ని ధర్మవ్యాధుడు మందలించాడు. 'ఆపాద మస్తంబు అంటు నూనియగాచి నయముగా ఉద్వర్తనం బొనర్చు... పుండరీకుడు తనతండ్రి దేహానికి అనునిత్యం గోరువెచ్చని నూనెను పులిమి వేడినీటితో స్నానం చేయించేవాడని పాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్పాడు. ఆ కాలంలోని తీపి కథలన్నీ- ఈ కాలానికి తీరని వ్యధలుగా మారాయి. ఊరూరా పుట్టగొడుగుల్లా మొలుస్తున్న వృద్ధాశ్రమాల్లోని పండుటాకుల గుండెల్లో అవి ప్రతిధ్వనిస్తున్నాయి. వారి నిరంతర పరితాపం... ఆధునిక జీవనశైలికి శాపం. 'జననీ జనకుల్ కడు వృద్ధులు, ఆకటన్ సోలుచు, చింతతో ఎదురు సూచుచు నుండుదురు' అని ఆత్రపడిన ప్రవరాఖ్యుడే ఈ జాతికి ఆదర్శం. నాన్నల రోజున మనం స్మరించవలసింది అలాంటివారినే!

కామెంట్‌లు లేవు: