*" జంటపదములు "*
ఏతావాతా, దానాదీనా, తాడోపేడో, వాడివేడి, రాతకోతలు, గిల్లికజ్జాలు, గంపగుత్తగా, ఒళ్ళూపై, తిమ్మిని బమ్మిని, తాడూ బొంగరం, వావివరస, కన్నీరుమున్నీరు, ఆదరాబాదరా, కరాకండీ [కరాఖండీ], కన్నూమిన్నూ, ఉబ్బితబ్బిబ్బు, తత్తరబిత్తర, యిలాంటి జోడీలు జాడీలకొద్దీ ఉన్నాయి మనకి. అయితే అవి యిలా ఎందుకు జతలు కట్టాయో చెప్పగలిగితే సంతోషం. కొన్నింటి అర్థాలూ తెలియవుగా మరి!
రెండు అదే పదాలు వస్తే ఆమ్రేడితం అంటారు, రెండు సంబంధం ఉన్న లేక లేని పదాలూ జంటగా వాడతారు. రెండూ అర్థం కలిగినవి వాడతారు, ఒకొక సారి ధ్వనికోసం వాడతారు, నొక్కి చెప్పడానికి వాడతారు.
1. ఏతావాతా = ఏతావత్ అనేది సంస్కృతం శబ్దం = So much, so far ఏతావదుక్త్వా అని రామాయణంలోనూ భారతంలోనూ చాల సార్లు వస్తుంది. 'ఇంతవరకు చెప్పి' - అని అర్థం. ఇది గోదావరిజిల్లా వాడుకలో ఏతావాతా అయింది. ఇంతకూ - అని అర్థం, ఏతావాతా చెప్పొచ్చేదేమంటే = ఇంతకూ చెప్పవచ్చేదేమంటే.
2. దానాదీనా = దాన్నీ దీన్ని = అదీ ఇది = మొత్తము మీఁద = on the whole, దానా దీనా పదిలక్షలు ఖర్చు అయింది.
3. తాడోపేడో తేల్చు = అటో యిటో పరిష్కరించు, either this or that "ఈ వ్యవహారం ఈ రోజు తాడోపేడో తేల్చుకొని కాని ఇక్కడినుండి కదలను."
4. రాతకోతలు, వ్రాఁతకోతలు – Writing the sale deed (రాత) after the final hard bargain and the final cut (కోత) in the price.
5. తిమ్మినిబమ్మినిచేయు = క్రిందిది మీదికి - మీదిది క్రిందికి చేయు వ్యవహారములో దక్షత చూపు. ఇక్కడ తిమ్మి అంటే తిమ్మడు (కోతి) బమ్మి అంటే బ్రహ్మ లేదా బమ్మి (బ్రాహ్మడు). "మొత్తానికి తిమ్మిని బమ్మిచేసి మా వాడికి ఉద్యోగం ఇప్పించాను."
6. వావీ వరుసా = వావి అంటే బంధుత్వము relation, వరుస అంటే "ఆ అమ్మాయి నాకు వరుసకు మరదలు ఔతుంది" distant but equivalent relationship. సుందరకాండలో మైనాకుడు హనుమను నీకు పినతండ్రిని అంటాడు. అది వరుస కలపడం.
7. అమీతుమీ = నేనా నువ్వా, బెంగాలీ పదాలు, ఈ రోజు అమీతుమీ తేల్చుకుందాం.
8. తత్తర బిత్తర = కంగారు; తత్తర పడడం = అంటే తొట్రు పడడం, కంగారు పడడం, బిత్తర పోవడం = అంటే ఆశ్చర్య పడడం, తెల్లబోవడం, మానసిక స్థితిని వర్ణించడానికి రెండూ కలిపి వాడతాం.
9. కన్నీరు, మున్నీరు = సముద్రం, కన్నీరు మున్నీరుగా విలపించడం అంటే దుఃఖ సముద్రంలో పడుటకు చిహ్నం.
10. ఆదరాబాదరా = తగినంత ఆలోచన, వ్యవధి లేకుండా; హడావుడిగా hurry burry, ఆవార్తవిని ఆదరాబాదరాగా బయలుదేరి వచ్చాము. ఆదరా బాదరాగా = కంగారుగా, ఉన్న పళంగా,అద్ధంతరంగా, బాదర బందీలు ఉండగానే.
జంట పదాలను లెక్కించడం సాధ్యం కాదు.
కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. వీటి వివరణలకు ఒక సిద్ధాంత వ్యాసం కావాలి.
ఒక్క కూలీ నాలీ చూదాం:
"కూలి" తెలిసిన పదమే. విశేషణం (కూలిపని), నామవాచకము (నీకెంత కూలి కావాలి?) మన సాఫ్టువేరు ఇంజనీర్లను - techno కూలీలుగా వర్ణించాడు ఒక IAS గారు. South Africa గాంధీ గారిని కూలీ బారిస్టరు అనేవారు. నాలి విశేషణమే కుత్సితము, కుచ్చితము, (ఉదా - నాలి ముచ్చు) hypocrite, hook or crook కూలో నాలో చేసుకు బ్రతుకు అంటే live - by hook or crook
మచ్చుకు మరికొన్ని:-
అన్నెం పున్నెం, అండ దండ, అందం చందం, అడపా తడపా, అలుపూ సొలుపూ, అభం శుభం, అదురు బెదురు (నదురు బెదురు), అవాకులు చెవాకులు, అణా కానీ, అప్పో సొప్పో, అల్లా టప్పా, అతుకు బొతుకు, ఇరుగు పొరుగు, ఊరూ వాడా, ఎండా కొండా, ఒళ్ళూ పై, కలొ గంజో, కల్ల బొల్లి, కరాఖండీ, కఱ్ఱా బుఱ్ఱా, కన్నూ మిన్నూ, కాసర బీసర, కిందా మీదా, కూలీ నాలీ, కూరా నారా, చదువూ చట్టుబండా, చిన్నా చితకా, పిల్లా జెల్లా, చెట్టూ చేమా, చెత్తా చెదారం, చెదురు మదురు, చిన్నా చితకా, చిన్నం చిదరా, చిందర వందర, గంపగుత్తం, గొడ్డూ గోదా, బీదా బిక్కీ, తలాతోకా, వంపు సొంపు, తట్టా బుట్టా, తీరూ తెన్నూ, మొక్కా మోడూ, నెత్తీ నోరూ, నోరూ వాయీ, వంటా వార్పూ, వెనకా ముందూ, వింతా విడ్డూరం, వింత విశేషం, గందర గోళం, గిన్నీ గిట్రా, డబ్బు దస్కం, నగా నట్రా, పొలం పుట్రా, పెట్టీ బేడా, పిల్లా పీచూ, పెట్టూపోతా, పెళ్ళీ పెటాకులు, పుట్టు పూర్వోత్తరాలు, రసాభాస, రాయీ రప్పా, గిల్లి కజ్జా, సింగినాదం జీలకఱ్ఱ, వంకర టింకర, పుణ్యం పురుషార్థం, లెక్కా పత్రం, ముద్దూ ముచ్చట, మాటామంతీ, రానూపోనూ, అదీయిదీ .....
ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయో!!! మరో భాషలోనికి యథా తథంగా అనువదించలేనివి ఇవి. తెలుగు సోయగం ఇది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి