శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
తొమ్మిదవ సర్గ. (9)
తరువాత రాక్షసవీరులైన నికుంభుడు, రభసుడు, సూర్యశత్రువు,
సుప్తఘ్నడు, యజ్ఞకోపుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, దుర్ధర్షుడు,రశ్మికేతువు, రావణుని కుమారుడు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు,వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, నికుంభుడు, దుర్ముఖుడు అనే పేరు గల రాక్షస వీరులు రావణునితో తమ తమ శౌర్యప్రతాపాలను ప్రదర్శిస్తూ, వెంటనే హనుమంతుని చంపివేద్దాము అని ప్రతిజ్ఞలు చేసారు. రావణుని మెప్పు సంపాదించడం కోసరం రాక్షస వీరులుచెప్పిన మాటలను రావణుని తమ్ముడు విభీషణుడు శ్రద్ధగా విన్నాడు. వారందరినీ శాంతింపజేసి వారి వారి స్థానములలోకూర్చోపెట్టాడు. తరువాత విభీషణుడు లేచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. “ఏదైనా ఒక కార్యమును సాధించాలంటే సామ, దాన, భేదో పాయములను ముందు ప్రయోగించాలి. అవి సఫలము కానప్పుడు దండోపాయమును ప్రయోగించాలి అని తెలివికలవాళ్లు చెబుతారు. శత్రువు ఏమరిపాటుగా ఉన్నప్పుడు, ఇతర రాజులచేత ఓడింపబడినప్పుడు, వారికి దైవము అనుకూలంగా లేనప్పుడూ, శత్రువును మన పరాక్రమము ఉపయోగించి లొంగదీసుకోవచ్చును. ప్రస్తుతము మన శత్రువు రాముడు, మహా పరాక్రమవంతుడు. ఏ మాత్రం ఏమరిపాటు లేని వాడు. కోపమును జయించిన వాడు. ఎటువంటి క్లిష్టసమయములోనైనా సరైన నిర్ణయములు తీసుకోగల సమర్ధుడు. అటువంటి మహా వీరుడిని మీరంతా ఎలా ఎదుర్కోగలము అని అనుకుంటున్నారు. ఒక వానరము హనుమంతుడు అనే పేరుకలవాడు, సముద్రమము దాటివచ్చి, సీతను చూచి, లంకను దహించి వెళ్ళాడు అంటే నమ్మగలరా! కనీసం ఊహాంచగలరా! మీరంతా ఇప్పటిదాకా మీ మీ పరాక్రమములు గురించి చెప్పుకొన్నారు. మరి శత్రువుల బల పరాక్రమముల గురించి ఆలోచించారా! ఇంక అసలు విషయానికి వద్దాము. ఈ రాక్షస రాజు రావణుడు, జనస్థానములో ఉన్న రాముని భార్య సీతను, రాముడు ఇంటలేని సమయమున అపహరించి తెచ్చాడు. ఎందుకు? రాముడు రావణునికి ఏమైనా అపకారముచేసాడా! జనస్తానములో ఉన్న ఖరుడు ఏమి చేసాడో విచారించారా! ఖరుడు తన పరిధిని దాటి, మితిమీరి ప్రవర్తించబట్టే రాముడు ఖరుని దండించాడు. రాముడు తన ప్రాణములను, తనవారి ప్రాణములను రక్షించుకోడానికి ఖరుని చంపాడు. తప్పు మన దగ్గర పెట్టుకొని రాముని అనడంలో ఏమి ప్రయోజనము. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించి యుద్ధమును నివారించడమే ఉత్తమము. మనము యుద్ధమును కొని తెచ్చుకున్నాము. దానికి నివారణ చేయడం మంచిది. మనము రామునితో అకారణంగా వైరము పెట్టుకున్నాము. రాముడు సముద్రమును దాటి లంకకు వచ్చి, రాక్షసులను చించి చెండాడక ముందే సీతను రామునికి అర్పించి ఆ వైరమును మాన్పుకుందాము. అపారమైన వానర సేన సముద్రమును దాటి లంకను ముట్టడించకముందే సీతను రాముని వద్దకు పంపుదాము. అలా జరగని ఎడల, లంక సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే
హనుమంతుడు లంకను దహించి అపార నష్టం కలుగచేసాడు.
ఓ రావణా! నేను నీకు మంత్రినే కాదు. తమ్ముడను. బంధువును. అందుచేత ఇంతదాకా చెబుతున్నాను. నీ మెప్పు కోసం మాటలాడటం నాకు చేత కాదు. నీకు మంచి జరిగే మాటలు
చెబుతున్నాను. నా మాట విను. సీతను రాముని వద్దకు పంపు. రాముడు తన వాడి అయిన బాణములను లంక మీదికి సంధించకముందే, సీతను రామునికి ఇచ్చివేయి. రాముని మీద నీకు ఉన్న కోపాన్ని విడిచిపెట్టు. లంక సుఖము కోరి యుద్దము నివారించు. రాముని వద్దకు సీతను పంపితే మనమందరమూ భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలము.” అని పలికి విభీషణుడు మౌనంగా ఉన్నాడు. అప్పటిదాకా రాక్షసవీరులు పలికిన వీరోచిత ప్రగల్భాలూ, వాటికి విభిన్నంగా ఉన్న విభీషణుని మాటలు విన్న రావణుడు అందరినీ పంపివేసి మౌనంగా తన అంతఃపురమునకు వెళ్లిపోయాడు..
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి