1, ఏప్రిల్ 2025, మంగళవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈ శ్లోకములో భక్తి స్వరూపాన్ని వివరించారు. "భక్తి" అంటే ఏమిటో తెలిపారు.*


*శ్లోకము :  61*


*అంకోలం నిజ బీజ సంతతిః అయస్కాంతోపలం సూచికా*

       

*సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం  సింధు స్సరిద్వల్లభమ్,*

       

*ప్రాప్నోతీహ యథా తథా  పశుపతేః పాదార వింద ద్వయమ్*

       

*చేతో వృత్తి  రుపేత్య  తిష్ఠతి  సదా సా  భక్తి రిత్యుచ్యతే  !!*


*పదవిభాగం:~*


*అంకోలం = ఊడుగు చెట్టును*


*నిజబీజ సంతతిః = తన గింజల రాశి*


*అయస్కాంతోపలం = సూదంటురాయిని*


*సూచికా = సూది*


*సాధ్వీ నైజవిభుం = పతివ్రత తన భర్తను*


*లతా క్షితిరుహం = తీగ వృక్షమును* 


*సింధుః సరిద్వల్లభమ్ = నది సముద్రమును*


*యథా ప్రాప్నోతి = ఏ ప్రకారంగా పొందుచున్నదో*


*ఇహ = ఈ లోకమందు*


*తథా = ఆ ప్రకారంగా*


*పశుపతేః పాదారవిందద్వయం = ఈశ్వరుని యొక్క పాద కమల యుగళమును*


*చేతోవృత్తిః = చిత్తవృత్తి*


*తిష్ఠతి = ఉండుట ఏది కలదో*


*సా = అది*


*సదా ఉపేత్య =ఎల్లప్పుడును పొంది*


*భక్తిః ఇతి ఉచ్యతే = భక్తి అని చెప్పబడుచున్నది.*


*తాత్పర్యము : -*


*ఊడుగు చెట్టు గింజలు నేలపై రాలి, ఆచెట్టునే చేరినట్లు, సూది సూదంటు రాయిని అంటుకొనట్లు, పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతడినే వదలకుండా యుండినట్లు, నది సముద్రమును చేరినట్లు, భక్తుడి చిత్త వృత్తి పశుపతి యైన శివుడి పాదపద్మ ద్వయాన్ని ఎల్లప్పుడూ చేరి యుండే స్థితిని "భక్తి"  అని అంటారు.*


*వివరణ :~*


*ఊడుగు చెట్టు గింజలు ఆ చెట్టును తమకు తాముగా మళ్ళీ చేరుకొని అతుక్కుపోతాయంటారు. సూది  అయస్కాంతపు రాతిని తనకు తానుగా అంటుకుంటుంది. పతివ్రత తన భర్తను చేరుతుంది. శీలవతి యైన ఇల్లాలు పుట్టింటినీ, తల్లి దండ్రులనూ, తన వారందరినీ వదలి తనకు దైవమిచ్చిన భర్తను త్రికరణ శుద్దిగా ఆరాధిస్తూ, అతని జీవితంలో ఐక్యమవుతుంది‌. అలాగే తీగలు, తనకు ఆధారంగా నిలచిన చెట్టు చుట్టూ గాఢంగా అల్లుకుపోతాయి.  ఇక నదులు  ఎక్కడో కొండల్లో పుట్టి  పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించి, చివరకు తమకు పతియైన సముద్రంలో సంగమిస్తాయి. ఈవిధంగా  గింజలూ, సూదీ, పతివ్రత, లతలూ, నదులూ, సర్వవిధాలా ఆత్మసమర్పణం చేసుకొని, వృక్షాదులలో లీనమవుతున్నాయి.* 


*ఇందులో మొదటి నాలుగూ ఐక్యదశలో స్వరూపాన్ని బట్టి, అవి లేనట్టుగానే తన్మయం పొందుతాయి.  కాగా నదుల విషయానికొస్తే అవి తమ సర్వస్వాన్నీ సమర్పించుకొని నామ రూపాలనుకూడా కోల్పోయి సాగరంలో లీనమవుతాయి.* 


*ఇందులో కొన్ని జలాలు, మరికొన్ని ప్రాణులు,  ఈ పోలిక వేర్వేరు విధానాలలో ఏకత్వ సిద్ధిని వివరిస్తూ, చిత్త వృత్తులలోని బేధాలను తెలుపుతోంది. వృత్తి వైవిధ్యం ఉంది కానీ స్థితిలో వైవిధ్యం లేదు. భక్తి కూడా* *అటువంటిదే. కలవటం వరకే లేదా కలపటం వరకే  కలసిన తర్వాత పూర్తిగా అద్వైతస్థితి.*


*" సదా ", " తిష్ఠతి  "  అన్న పదాలు ఇక్కడ ముఖ్యం. ఉండటంలో కాలాదులను బట్టి వికారాలు కలుగవని  తాత్పర్యము. భక్తిలో కూడా ఎన్నో వైవిధ్యాలుంటాయి.*


*1) ఊడుగు చెట్టు గింజలు చెట్టుకు అతుక్కు పోవడమనే ఉదాహరణ సామీప్య ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం.*

*2 ఇనుము _ సూదంటు రాయిల  ఆకర్షణ, సాలోక్యముక్తిని సూచించే

భక్తికి నిదర్శనం.*

*3)పతివ్రత భర్తను చేరేవిషయం సాలోక్య _ సామీప్య ముక్తులను సూచించే భక్తికి నిదర్శనం.*

*4 )తీగ చెట్టుకు అల్లుకున్న విధానం సామీప్య ముక్తిని  సూచించే భక్తికి నిదర్శనం.*

*5 ఇంక నదులు తమ నామ రూప గుణ లక్షణాలను విడిచి , సముద్ర లక్షణాలతోనే కనబడడం _ సాయుజ్య ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం.*


*ఈ భక్తికి మరో ఉదాహరణం  కట్టు విప్పిన లేగ దూడ చెంగున దూకుతూ ఆవు వద్దకు చేరడం కూడా భక్తికి ఉదాహరణంగా కొందరు సూచించారు.*

*మనందరి మనస్సులకూ పై విధంగా భగవంతుని వైపు మళ్ళి , భక్తి కలగాలని దైవాన్ని ప్రార్థిద్దాము.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: