1, ఏప్రిల్ 2025, మంగళవారం

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(93వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

          *కాళీయమర్దనం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*బలరామకృష్ణుల మీద పుష్పవృష్టి కురిపించారు. నాటి నుంచి తాళవనం యాదవులవశమయింది. బలరామకృష్ణుల వీరోచితగాధంతా పిల్లల నోటితో పెద్దలు తెలుసుకున్నారు. పొంగిపోయారు. బలరామకృష్ణుల్ని ఊరేగించారు. బలరామకృష్ణులిద్దరూ పక్కపక్కన కూర్చుని రథంలో ఊరేగుతోంటే వారిని చూసి రోహిణి, యశోదలు ఉప్పొంగిపోయారు. వీరపుత్రులనుగన్న వీరమాతలమని ఆనందించారు.*


*కాళీయమర్దనం:~*


*వ్రేపల్లె సమీపానగల యుమునానది దగ్గరగా ‘కాళింది’ అని ఓ మడుగు ఉన్నది. ఆ మడుగులో ‘కాళీయుడు’ అని ఓ సర్పరాజు నివసిస్తున్నాడు. కోరల్లోనే కాదు, ఆ పాము అణువణువునా విషమే! ఆ విషం అంతా మడుగు అడుగడుగునా నిలిచి ఉండి, కుతకుతా ఉడుకుతుండేది. దాని ఆవిరికి మడుగు మీద ఆకాశంలో ఎగిరే పక్షులుసైతం చచ్చిపోయి రాలిపడేవి. ఇక మడుగులో జీవించే జలచరాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఏదీ బతికిన పాపాన పోలేదు. ఆ మడుగు పైనుంచి వీచే గాలి కూడా ప్రమాదకారి అయింది. ఆ గాలిసోకి ఆలమందలు చచ్చిపోతున్నాయి. గోపాలురు అనారోగ్యానికి గురవుతున్నారు. చేసేదిలేక దూరంగా తరలిపోతున్నారంతా..*


*కాళీయుడు కాళింది మడుగులో నివసించేందుకు ఓ కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటంటే...*


*కద్రువ, వినత దక్షుని కుమార్తెలు. ఆ ఇద్దరూ కశ్యప్రజాపతిని వివాహం చేసుకున్నారు. కద్రువ కడుపున సర్పాలు, వినత కడుపున పక్షులు పుట్టాయి.*


*కద్రువకి పుట్టిన సర్పరాజులలో వాసుకి, శేషుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు ముఖ్యులు.*


*వినతకు సూర్యభగవానుని సారథి అనూరుడు, విష్ణువాహనమయిన గరుత్మంతుడు జన్మించారు.*


*కద్రువ కుమారుడు కాళీయుడు రమణకద్వీపంలో ఉండేవాడు. అతనితోపాటు అనేక సర్పాలు కూడా అక్కడ ఉండేవి. సర్పాలకు నిలయమయి ఆ ద్వీపం సముద్రమధ్యంలో ఉండేది. గరుత్మంతుడంటే సర్పాలకు భయం. సర్పం కనిపిస్తే చాలు, పట్టి భక్షించేవాడు గరుత్మంతుడు.

ఆ బాధపడలేక సర్పాలన్నీ అతనితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నెలలో వచ్చే ప్రతి పర్వదినానికీ ఒక నాగు అతనికి ఆహారం అవుతుంది. చెట్టు మొదట్లో నాగుని బలిగా ఉంచుతారు. గరుత్మంతుడు దానిని భక్షించవచ్చు. ఆ ఒప్పందం చాలా రోజులు కొనసాగింది. రమణకద్వీపంలోని సర్పరాజులంతా ఎన్నడూ ఒప్పందాన్ని తప్పలేదు.*


*చివరికి కాళీయుడి వంతు వచ్చింది. మహావిషసర్పం కాళియుడు. పైగా గొప్పబలాఢ్యుడు. ఆ గర్వంతో గరుత్మంతునికి బలి సమర్పించలేదతను. అంతేగాక, గరుత్మంతునికి బలికావాల్సిన సర్పాలను తానే భక్షించసాగాడు. ఇది తెలిసి గరుత్మంతుడు, కాళీయుడంటే కోపాన్ని పెంచుకున్నాడు. అతన్ని చంపడానికి వచ్చాడు. కాళీయుడు ధైర్యంగానే గరుత్మంతుణ్ణి ఎదుర్కొన్నాడు. పెద్దయుద్ధం జరిగింది ఇద్దరికీ. అనేక పడగలు ఉన్న కాళీయుడు, తన కోరలతో గరుత్మంతుణ్ణి కరచి కరచి హింసించాడు. బాణాలతో పొడుస్తున్నట్టుగా బాధకలిగింది గరుత్మంతునికి. ఆగ్రహోదగ్రుడయ్యాడు. వజ్రంలాంటి కాలిగోళ్ళు విప్పి, బలంగా ఓ తన్ను తన్నాడు కాళీయుణ్ణి. అంతే! ప్రాణాలుపోతున్నట్టనిపించాయి.*


*కాళీయుడు రమణకద్వీపం వదలి పారిపోసాగాడు. గరుత్మంతుడు వదలలేదు. వెంటపడి తరిమాడు. ప్రాణభీతితో నలుదిక్కులకూ పరిగెత్తి, ఆఖరికి కాళింది మడుగులో తలదాచుకున్నాడు కాళీయుడు. అక్కడకి రాలేకపోయాడు గరుత్మంతుడు. అతనికి అది రాకూడని స్థలం.*


*దానికి ఓ కారణం ఉంది.

అది ఏమిటంటే...*


*పూర్వం కాళింది ఒడ్డున ‘సౌబరి’ అనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కాళిందిలో అప్పుడు పెద్దపెద్ద చేపలు ఉండేవి. ఆ చేపల్ని తినడానికి ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడక్కడకి. ఓ మత్స్యరాజును పట్టి తినసాగాడు. సౌబరి వద్దని వారించినా వినలేదు గరుత్మంతుడు. తిని ఎగిరిపోయాడు. గరుత్మంతునికి బలయిపోయిన మత్స్యరాజు భార్యలు అనేకం సౌబరి చుట్టూచేరి దీనంగా విలపించసాగాయి. భర్తని కోల్పోయి దిక్కులేనివారమయినామని ఏకధాటిగా రోదించాయి. వాటిని చూసి మునికి జాలికలిగింది. మేలు చేయదలచాడు వాటికి.*


*‘‘ఇక నుంచి గరుత్మంతుడు ఇక్కడకి వచ్చినా, ఈ మడుగులోని చేపలను భక్షించినా మరణించుగాక’’ అని శపించాడు. దాంతో గరుత్మంతుడు అక్కడకి రావడానికి వీలులేకుండాపోయింది.*


*ఈ సంగతి కాళీయుడుకి తెలుసు. అందుకే అక్కడ దాగాడు. దాగి, ఎలాంటి భయమూ లేకుండా భార్యలతో హాయిగా సుఖించసాగాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: