*తిరుమల సర్వస్వం 195-*
**శ్రీవారి ఆభరణాలు -7*
ఆలయంలో ఉండే చిన్న-పెద్ద, కొత్త పాత నగలన్నింటిని పరీక్షించి, అవి నిఖార్సైన బంగారు నగలే అని ధ్రువీకరించారు.
బీరువాలో భద్రపరిచిన నగల వివరాలను ఆయా రిజిస్టర్ లలో ఉన్న వివరాలతో పోల్చి, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేల్చి చెప్పారు.
నిఘా వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉన్నదని, అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పరిశీలించే పటిష్టమైన వ్యవస్థ కూడా ఉన్నట్లుగా కమిటీ అభిప్రాయపడింది.
భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకున్న నగలు చోరీకి గురైనట్లు అప్పుడప్పుడు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు నిజం కాదని; ఒకరో ఇద్దరో క్రింది స్థాయి ఉద్యోగులు చాలా అరుదుగా ఆభరణాల విషయంలో అవినీతికి పాల్పడినప్పటికీ, అటువంటి వారి విషయంలో ఆలయ యాజమాన్యం కఠినంగా వ్యవహరించి, ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించుకుంటూ, దేవాలయ యాజమాన్యం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని
2 నిలబెట్టే విధంగా విశేషమైన కృషి జరుగుతోంది.
ఆభరణంలోని ఏదైనా రాయి ఊడినా, ఆభరణం విరిగినా, ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ రికార్డుల్లో నమోదు చేయబడతాయి. విరిగిన రాళ్లు, ముక్కలు కూడా మిల్లీగ్రాములతో సహా లెక్కగట్టి, వాటిని విడిగా భద్రపరిచే సంప్రదాయం అమలులో ఉంది.
ప్రతి ఆభరణానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను పేర్కొని, ఆ ఆభరణం యొక్క పూర్తి వివరం, బరువు, రాళ్ల సంఖ్య, ఏ జాతి రాళ్ళు మొదలగు వాటన్నింటినీ రిజిస్టర్ లలో లేదా కంప్యూటర్ లో నమోదు చేస్తారు. ఏ ఆభరణాన్నైనా దాని నిర్దిష్టస్థానం నుంచి ఏ కారణం చేతనైనా బయటకు తీసినట్లయితే, – దానిని ఎందుకు బయటకు తీయవలసి వచ్చింది, ఏ తేదీ నాడు ఎవరిద్వారా తీయబడింది, మరలా ఎప్పుడు యథా స్థానానికి చేరింది – వంటి వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయబడుతున్నాయి.
1933వ సంవత్సరంలో తి.తి.దే. యాజమాన్యం లోకి వచ్చినప్పుడు, మహంతుల ద్వారా అప్పగించబడిన నగలన్నీ యథాతథంగా ఈనాటికీ ఉన్నాయని, ఎటువంటి అవకతవకలు జరగలేదని కమిటీ తేల్చి చెప్పింది.
కుప్పలు తెప్పలుగా ఉన్న స్వర్ణాభరణాలన్నీ కేవలం స్వామివారి భౌతిక సంపత్తి అయితే; శ్రీవారిపట్ల కోట్లాది భక్తుల గుండె సవ్వళ్ళలో గూడు కట్టుకున్నట్టి, వెలకట్ట సాధ్యం కాని ప్రేమాభిమానాలు, భక్తితత్పరతలు వారికి అసలైన ఆభూషణాలు.
ఆ ఆనందనిలయుని అలంకారాలన్నీ భక్తులు తనివితీరా చూసి సంతృప్తి చెందడానికే గానీ, వారికివన్నీ నిమిత్తమాత్రం.
వేల సంవత్సరాల క్రితం ఏ విధమైన ఆచ్ఛాదనా లేని ఒక చిన్న నాలుగు కాళ్ళ మంటపంలో చిన్న కౌపీనంతో ఉన్నప్పుడు; బంగారువిమానం క్రిందనున్న భవ్యమందిరంలో వేలకోట్ల ఆభరణాలను ధరిస్తూ షట్కాల పూజలందు కొంటున్న ప్రస్తుత తరుణంలో అదే చిద్విలాసం, అదే వరదహస్తం. పగిలిన కుండపెంకులో చద్దెన్నం పెట్టిన నిరుపేద కుమ్మరి భీమన్నను; కోట్ల రూపాయలు విలువైన ధన, కనక, వస్తు, వాహనాలను సమర్పించుకున్న దక్షిణభారత చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలును స్వామివారు ఒకే రీతిగా కరుణించారు.
*'వడ్డికాసులవాడిగా'* తాను పేరు తెచ్చుకొని, వచ్చిన కానుకలన్నింటినీ పరోపకారార్థమే వినియోగించే, వితరణశీలి అయిన ఆ మాధవుడు చేసే 'మానవసేవ' గురించి మరొక ప్రకరణంలో వివరంగా తెలుసుకుందాం.
*బహుశా భద్రతా కారణాల వల్ల శ్రీవారి ఆభరణాల సంబంధించిన సమగ్రమైన సమాచారం బహిరంగంగా మాధ్యమంలో అందుబాటులో లేదు. అత్యంత అరుదుగా పత్రికల్లో ప్రచురించబడే వార్తలు, ప్రత్యేక కథనాలు, ఆలయంతో చిరకాల అనుబంధం ఉన్న వ్యక్తుల నుండి ముఖతః లభించిన సమాచారం, వీటన్నింటినీ సమన్వయ పరచడం ద్వారా పై వివరాలు సేకరించబడ్డాయి.*
[ రేపటి భాగంలో ... *కలపిల తీర్థం* గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి