*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*
*334 వ రోజు*
*సైంధవుని మరణం*
కృష్ణుడు " అర్జునా! సైంధవుని తల నేల మీద పడితే ప్రమాదం. కనుక దానిని ఆపు " అన్నాడు. అర్జునుడు ఒక దాని వెంట ఒక బాణం సంధిస్తూ ఆ తల నేల మీద పడకుండా ఆపాడు. సైంధవుని తల బంతిలా తిరుగుతూ ఉంది. ఒక వైపు యుద్ధం చేస్తూనే ఒక వైపు బాణప్రయోగంతో సైంధవుని తలని ఆపుతూ " కృష్ణా ! ఎంత సేపు ఈ తలని ఇలా ఆపాలి " అన్నాడు. కృష్ణుడు " సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు. అతడు సింధు దేశపు రాజు. అతడికి వర ప్రసాదంగా సైంధవుడు జన్మించాడు. ఒక రోజు ఆకాశవాణి " సైంధవుని తల యుద్ధంలో నరకబడుతుంది " అని చెప్పింది. అది విన్న వృద్ధక్షతుడు " నా కుమారుని తల నేల మీద పడవేసిన వాడి తల ముక్కలౌతుంది " అని శపించాడు. అతడు ఇప్పుడు తపమాచరించుటకు అడవులకు వెళ్ళాడు. కనుక నీవు పాశుపతాస్త్ర సాయంతో సైంధవుని తల అతడి తండ్రి వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేయి " అన్నాడు. అర్జునుడు " కృష్ణా! వృద్ధక్షతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా! వృద్ధక్షతుడు ఇప్పుడు శమంతక పంచకం సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. నీవు అతడి తలను వృద్ధక్షతుడి ఒడిలో పడేలా అస్త్ర ప్రయోగం చేయి " అన్నాడు. అర్జునుడు పరమశివుని భక్తితో స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాడు. సైంధవుడి తల ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేసాడు. హటాత్తుగా తన ఒడిలో పడిన మానవ మస్తకాన్ని చూసి కంగారు పడిన వృద్ధక్షతుడు దానిని నేల మీద విసిరి వేసాడు. వెంటనే శాపప్రభావంతో అతడి తల ముక్కలైంది. కృష్ణుడుఅర్జునుడిని ప్రశంసించాడు. కౌరసేన భయంతో పారిపోయింది. సైంధవుని తల నేల మీద పడే వరకు అలాగే ఉన్న సైంధవుని మొండెము సైంధవుని తల నేల మీద పడగానే కింద పడింది. ఇది చూసి అందరూ ఆశ్చర్య పడ్డారు. శ్రీకృష్ణుడి సాయంతో అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకొనడం చూసి సాత్యకి, భీముడు సింహ నాదాలు చేసారు. కౌరవ సేనలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. అది విని ధర్మరాజు ఆనందసాగరంలో మునిగాడు. పాడవుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. పాండవసైన్యం తూర్యనాదాలు, భేరి, మృదంగ నాదాలు చేసారు.
*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము సమాప్తం *
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి