10, జులై 2020, శుక్రవారం

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-7*

 *భార్యావియోగపు బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము* 

లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువునకు పాడుపడిన బీడువలెనున్నది. ఒక కళ లేకుండెను. దిగాలుపడి విష్ణుమూర్తి నింరతరము భార్యను గూర్చి ఆలోచించుచుండెను.

 పూవుల ప్రోవువంటి నా లక్ష్మి ఎచ్చటనున్నదో కదా! సుకుమార శరీర లావణ్య శోభితయగు నా రమాదేవి ఎక్కడ ఏ యిడుములబడుచున్నదో గదా? అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపించుచుండెను. 

ఇప్పుడాయనకు ఏ భక్తుల ఆర్తనాదములున్నూవినబడుటలేదు, ఇప్పుడాయన ఏ మునీశ్వరునికి తన దివ్యసుందర విగ్రహ దర్శన భాగ్యము కలుగజేయుటలేదు, తన తలంపులు లక్ష్మిని గూర్చి తన కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచుండెను. 

తన చెవులు ఆమె యొక్క ‘నాథా’ అను శుభకర శబ్ద శ్రవణమున కాతృత చెందుచున్నవి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించుకుండుట నారాయణునకు దుర్భరముగానుండెను. 

ఓదార్చువారు ఓదార్చుచునే యున్నారు. కానీ లాభము లేకుండెను. ఎప్పుడునూ విచారించని వారొక్కమారు విచారించిన అదిమేవో చాలా లోతైన బాధ అయి యుండుట సహజము గదా! దాని నాపజూపుట విఫలమగు ప్రయత్నము మాత్రమే అగును.

తన నిజసతిని వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుట ప్రారంభించినాడు.

ప్రపంచస్థితికి కారకుడయిన శ్రీమహావిష్ణువు యొక్క ఆ స్థితికి లక్ష్మీదేవి కారకురాలయినది. మండుటెండలలో మహావర్షధారలలో ఆయన అడవులందు, కొండలందు, కోనలందు, విచార వదనముతో తిరుగసాగెను. 

రమాదేవికై విలపించసాగెను. రాత్రియనక, పగలనక కాలగణన మనునది లేక తన నిజసతిని గూర్చి అన్వేషణ సాగించుచునే వుండెను. 

మతి భ్రమించినవానివలె తిరుగుచూ వృక్షముల చెంతకు వెడలి ఓ వృక్షములారా! నా ప్రియసతి ఇటు వచ్చుట చూచినారా!’ అనీ, శిలలు వద్దకు వెడలి, ఓ శిలలారా!మీ పక్ర్కల నుండి నా లక్ష్మీదేవి వెడలుట చూచినారా?’ అని అడుగుచుండెను. ఆకలిలేదు, నిద్రలేదు. విశ్రాంతి అనునది అసలు లేనేలేదు. అన్వేషణా ప్రయాణమే పని! రమారమా అని అరచుచూ శుష్కించిన శరీరముతో శేషాద్రికి చేరినాడు.

 *మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా* 
 *వరాహ నరసింహ గోవిందా* *వామన భృగురామ గోవిందా* 
 *బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా* 
 *వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా* 
 *గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా* 

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం🙏

🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-8* 

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *శేషాద్రి యొక్క పుట్టు పూర్వోత్తరములు* 


వాయుదేవుడు ఏ వస్తువు నయిననూ అవలీలగా కదలించగల శక్తి సంపన్నుడు.

 ఆదిశేషుని యొక్క శక్తికి అవధియే లేదు కదా! శక్తిసంపన్నులయిన వీరికి పూర్వము తగవు యేర్పడింది.
.
 ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు

‘‘ఆనంద పర్వతమొక్కటి యున్నదని మీకు తెలిసియేయున్నది కదా! ఆ యానందపర్వతము మేరు పర్వతము నుండి పుట్టినది. అది చాలా గొప్ప కొండ, దానిని కదలించుట మహాశక్తి సంపన్నులకు గానీ సాధ్యము కాదు. 


మీలో ఎవ్వరకు దానిని కదలింపగలరో, వారే అధికశక్తి కలవారనీ తెలియుటకు వీలుండును. ఈపరీక్షకు మీరంగీకరింతురా?’’ అనెను వారు వెంటనే, ‘‘అంగీకరించినాము’’ అని బలదర్పములతో పలికి, ఆనందపర్వతము వద్దకు వెళ్ళారు.

 ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని గట్టిగా చుట్టాడు. పుంజుకున్న బలముతో దానిని కదుప జూచినాడు. 

ఎంత ప్రయత్నించిననూ ఫలితము శూన్యమైనది. ఆశ్చర్యము? సమస్త భారమును వహింపగల ఆదిశేషుడు ఆనంద పర్వతమును ఇసుమంతయినా కదపలేక పోయాడు, 

మరియొక ఆశ్చర్యము! సుడిగాలిగాను తుఫానుగాను వచ్చి, ఎంతటి బలవత్తరమయిన వస్తువునైనను చలింపజేయగల వాయుదేవుని ప్రయత్నములు కూడా వమ్మయిపోయినవి. 

ఆదిశేషుడు, వాయుదేవుడు ఇద్దరునూ వారి వారి బలములను జూపి ఆనంద పర్వతమును కదలించవలెనని చివరవరకూ చాలా ప్రయత్నించారు కాని, యే మాత్రమూ లాభము లేకపోయినది.

వారిద్దరి పట్టుదలల వలన ఆనంద పర్వతము మీద నివసించు వాయుదేవుని మహోన్నత విజ్ఞంభణ శక్తికి లోకములోనే అలజడి ప్రారంభమయి హెచ్చసాగినది. 

సర్వప్రాణులకు వాయువు ముఖ్యము కదా! ఇంద్రుడు ఆదిగా గల దేవతలు దీనికి ఒక పరిష్కార మత్యంతావశ్యకమని అనుకున్నారు. వారు ఆదిశేషుని వద్దకు బయలుదేరి వెళ్ళారు.

 వినయముగా ఆదిశేషునకు నమస్కరించి యీ విధముగా అన్నారు. ‘‘స్వామీ ఇవి ఏమి మీ పట్టుదలలు? యుక్తాయుక్త విచక్షణలు తెలిసిన మీరే యీ విధముగా ఇతర ప్రాణులకు భీతిగొలుపు విధముగా వ్యవహరంచుట ధర్మమా? 

మీ నుండి గదా ధర్మాధర్మములు మేము నేర్చుకొనవలసియున్నది! ఆ వాయుదేవుని భయకర విజ్ఞంభణమునకు లోకము లల్లాడిపోవుచున్నవి. మీరు భూతహితైక దృష్టిని పూర్తిగా యోచించి, యీ ఆనంద పర్వత చాలాన ఘనకార్య జనితోపద్రవమును తప్పించవలసియున్నది.

 ఇందులకు మీరే సహస్ర విధముల నర్హులు, మా యెడల కరుణాదృష్టి గలిగి మీరైన పట్టు సడలించగోరుచున్నాము.’’

ఆదిశేషుని యొక్క హృదయము ప్రాణికోటి యెడల చల్లబడినది. వారల మొరవిని, యాతడు తన పట్టుదలను కొంచెము సడలించెను. పట్టును ఎప్పుడయితే ఆదిశేషుడు సడలించాడో, వాయుదేవునికి పనే సులవయ్యెను. వెనువెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతమును ఆకాశమార్గమునకు ఎగర గొట్టినాడు.

ఎగరగొట్టబడిన ఆ పర్వతము వెళ్ళి భూలోకము నుండి వరాహక్షేత్రములో  స్వర్ణముఖీ నదీ తీరానబడినది. 

శేషుని కారణముగానే భూలోకమునకు ఆ పర్వతము వచ్చినది. 

ఆ కారణముగానే ఆ పర్వతానికి శేషాద్రియను పేరు వచ్చినది. శేషాద్రిని దర్శించిన మాత్రముననే సర్వపాపములూ పటాపంచలగుననుట సందేహము లేని విషయము.

 *బలరామానుజ గోవిందా, భౌద్ధకల్కి గోవిందా,* *వేణుగానలోల గోవిందా, వేంకటరమణా గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||8* ||
శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం

🌸 *జై శ్రీమన్నారాయణ*

కామెంట్‌లు లేవు: