సాంఖ్య సూత్రాలను కపిలుడు ప్రవేశపెట్టాడు. ఇతను క్రీ.పూ. 400కాలం నాటివాడని, బుద్ధుని తర్వాత కాలంనాటి వాడని పలువురి అభిప్రాయం. ప్రకృతి నిత్యమైనది. సమస్త చరాచరా సృష్టింతా దాని రూపాంతరాలే' అని ఆయన ప్రతిపాదించాడు. మొత్తం 25 పదార్థాలతో సృష్టి కార్యం జరుగుందని కపిలుడు విశ్లేషించాడు. భౌతిక పదార్థం ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుందని వీరు చెప్పినారు. వేదాంతదర్శనానికి సాంఖ్యదర్శనం ప్రథమ ప్రత్యర్థిగా నిలిచింది.
బ్రహ్మ సూత్రాల్లో సాంఖ్య సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించారు. సాంఖ్య సిద్ధాంతంలోకి పురుషున్నిప్రవేశపెట్టారు. పురుషుని కోసం ప్రకృతి వుంది.పురుషుని కైవల్యసాధనే అంతిమ లక్ష్యమనిసాంఖ్యం చెప్పడంతో అది రెండు విరుద్ధ భావాల్లోకి పోయి అంతిమంగా భావవాదంలోకి కూరుకుపోయింది.
న్యాయ వైశేషిక దర్శనాల్లో అన్నంభట్టు అనే దార్శనికుడు పృధ్వి అణువులచేత నిర్మితమైన మన శరీరాలు భూలోకంలో వున్నాయన్నాడు. జల అణువులచేత నిర్మితమైనవి వాయులోకంలోనూ,అగ్ని అణువుల చేత నిర్మితమైనవి ఆదిత్యలోకంలో వుంటాయన్నాడు. అయితే ఇతను తన పాత నమ్మకాలను వదలలేదు. సృష్టివాదాన్ని నమ్ముతూనే భౌతిక వాదాన్ని ప్రవేశపెట్టారు.
ఒక సత్యాన్ని లేదా దోషాన్ని నిర్ధారించడానికి న్యాయవైశేషికులు విప్లవాత్మకమైన పద్ధతి ప్రవేశపెట్టారు. దీనికి వారు చెప్పింది ఆచరణే సత్యానికి సరైనదారని.ఆచరణలో పెట్టినపుడు అది సత్యమైనదా కాదా తెలుస్తుందన్నారు. ఆచరణలో మంచి ఫలితాలు వస్తే సత్యమని లేకుంటే అది దోషమని చెప్పినారు.
ఆధునిక కాలంలో ఇదే వైజ్ఞానిక పద్ధతిని పాటిస్తున్నారు. న్యాయ వైశేషికులు అణువుల కలయిక వలన పదార్థంలోని భాగాలు ఏర్పడతాయని భావించారు. అయితే అట్లా కలవడానికి ఒక కర్త కావాలని వీరు భావించారు. కుండలోని భాగాలను కలవడానికికుమ్మరి ఏ విధంగా అవసరమో ఆవిధంగా అణు సమూహాల కలయికకు ఒక కర్త అవసరమన్నారు. ఆవిధంగా వీరి అణు సిద్ధాంతంలోకి భగవంతుని ప్రవేశపెట్టారు. అంతేగాక వీరు ఆత్మను అంగీకరించారు. శరీరంతో సంబంధం కలిగినపుడు ఆత్మ చైతన్యవంతంగా వుంటుందన్నారు. ఆత్మను
అంగీకరించడంతో మోక్షం మొదలైన వేదాంత భావాలు ఈ దర్శనంలోకి చొరబడినాయి.
బుద్ధుని(క్రీ. పూ. 563-463) సమకాలీనుడైన అసిత కేశకంబరుడు భౌతికవాది. ఆయన ప్రకారం పంచభూతాల కలయికవలన మనిషి ఏర్పడుతున్నాడు. మనిషి చనిపోగానే భూమి అంశం భూమిలోనూ, నీటి అంశం నీటిలోనూ, అగ్ని అంశం అగ్నిలోనూ, వాయువు అంశం వాయువులోనూ,ఇంద్రియాలు ఆకాశంలోనూ కలిసిపోతాయన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి