20, ఆగస్టు 2021, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము* *974వ నామ మంత్రము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*974వ నామ మంత్రము* 20.8.2021


*ఓం బిందుతర్పణ సంతుష్టాయై నమః*


శ్రీచక్రమునందు తొమ్మిదవ ఆవరణయైన సర్వానందమయ చక్రమునందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములవారు క్రమముగా క్షీర, ఆజ్య, తేనె, కల్లు బిందువులతో తర్పణచేయడంచేత సంతృప్తి చెందు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బిందుతర్పణసంతుష్టా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం బిందు తర్పణ సంతుష్టాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో అర్చించు సాధకులు ఆ పరమేశ్వరి కరుణకు పాత్రులై ఆత్మానందానుభూతితో తరించుదురు.


శ్రీచక్రమునందలి తొమ్మిదవ ఆవరణసు సర్వానందమయచక్రము అని అందురు. అది నిరాకారుడు, నిర్గుణస్వరూపుడైన పరబ్రహ్మ ఉండు బిందుస్థానము. ఆ బిందుస్థానములో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను నాలుగువర్ణములవారు వరుసగా క్షీరము, నెయ్యి, తేనె, కల్లు బిందువులతో తర్పణచేయుటచేత తృప్తి చెందునది పరమేశ్వరి. గనుక అమ్మవారు *బిందుతర్పణసంతుష్టా* యని అనబడినది. 


శ్రీచక్రమునకు బిందువు కేంద్రస్థానము. అది శివశక్తుల సంగమస్థానము. అక్కడ నాలుగు వర్ణములవారు తంత్రశాస్త్రమునందు చెప్పిన ప్రకారం (బ్రాహ్మణులు క్షీర బిందువులతోను, క్షత్రియులు ఆజ్య (నేతి) బిందువులతోను, వైశ్యులు మధు (తేనె) బిందువుల తోను, శూద్రులు ఆసవ (చెఱకురసముతో చేయబడిన మద్యము) బిందువులతోను జగన్మాతకు తర్పణ చేయవలెను. ఆ విధంగా చేసిన తర్పణతో ఆ శ్రీమాత సంతృప్తి చెందుతుంది గనుక ఆ తల్లి *బిందుతర్పణ సంతుష్టా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బిందుతర్పణ సంతుష్టాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*391వ నామ మంత్రము* 20.8.2021


*ఓం నిత్యాషోడశికారూపాయై నమః* 


పదహారు నిత్యాదేవతల స్వరూపము తానై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిత్యాషోడశికారూపా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం నిత్యాషోడశికారూపాయై నమః* 

అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు సంప్రాప్తింపజేయును.


నిత్యాదేవతలు పదహారుమంది. వీరినే షోడశ నిత్యలు అందురు. ఈ పదహారు నిత్యల స్వరూపము తానై విరాజిల్లు పరమేశ్వరి *నిత్యాషోడశికారూపా* యని అనబడినది. ఈ పదహారు నిత్యలలో అంగి అనగా ప్రధాన నిత్య లలితాంబిక. మిగిలి పదిహేనుమంది అంగదేవతలు అనబడుదురు. ఈ పదిహేనుమందికి ప్రథమనిత్య అయిన లలితాంబిక ఆత్మస్వరూపురాలు. షోడశీమంత్ర స్వరూపురాలు అని కూడా అంటారు.


 1) కామేశ్వరి, 2) భగమాలిని, 3) నిత్యక్లిన్న, 4) భేరుండ, 5) వహ్నివాసిని, 6) మహావజ్రేశ్వరి, 7) శివదూతి, 8) త్వరిత, 9) కులసుందరి, 10) నిత్య, 11) నీలపతాక, 12) విజయ,, 13) సర్వమంగళ, 14) జ్వాలామాలిని, 15) చిత్ర, 16) మహానిత్య...ఇందులో పదహారవ నిత్య అయిన మహానిత్యను మహాత్రిపురసుందరియని కూడా అంటారు. ఇందులో తిథినిత్యలు శుక్లపక్షములో ఒక విధంగాను, కృష్ణపక్షంలో ఇంకొక విధంగానూ ఉంటారు. ఈ వివరము 388వ నామ మంత్రములో చెప్పబడినది. ఆ ప్రకారముగా ప్రతి నిత్యమూ ఆ తిథిప్రకారం చెప్పబడిన నిత్యను పూజిస్తూ, తప్పనిసరిగా మహానిత్య అయిన మహాత్రిపుర సుందరినికూడా పూజిస్తారు. దీనిని బట్టి పరమేశ్వరీ స్వరూపురాలైన మహాత్రిపురసుందరి అన్ని నిత్యలతో అర్చింపబడుతుంది గనుక అమ్మవారు *నిత్యాషోడశికారూపా* యని అనబడుచున్నది.


పరమేశ్వరి షోడశకళాప్రపూర్ణురాలు, తిథినిత్యలందరూ అమ్మవారి విభూతులే గనుక ఆ తల్లి *నిత్యాషోడశికారూపా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిత్యాషోడశికారూపాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻

*20.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - తొంబదియవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని లీలావిహారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*90.9 (తొమ్మిదవ శ్లోకము)*


*సిచ్యమానోఽచ్యుతస్తాభిర్హసంతీభిః స్మ రేచకైః|*


*ప్రతిషించన్ విచిక్రీడే యక్షీభిర్యక్షరాడివ॥11125॥*


భగవంతుని భార్యామణులు నవ్వుల పువ్వులను వెదజల్లుచు, యంత్రములద్వారా శ్రీకృష్ణునిపై జలములను చల్లుచుండిరి. యక్షరాజైన కుబేరుడు యక్షకాంతలతోవలె ఆ స్వామియు ఆ తరుణీమణులపై జలములను చల్లుచు వారితో క్రీడించుచుండెను.


*90.10 (పదియవ శ్లోకము)*


*తాః క్లిన్నవస్త్రవివృతోరుకుచప్రదేశాః సించంత్య ఉద్ధృతబృహత్కబరప్రసూనాః|*


*కాంతం స్మ రేచకజిహీరిషయోపగుహ్య జాతస్మరోత్సవలసద్వదనా విరేజుః॥12126॥*


ఆ జలక్రీడలలో అతని రాణుల వస్త్రములన్నియును తడిసిముద్దలగుచుండెను. తలలు తడియునట్లు క్రుంకులిడుచుండుటవలన, వారి పెద్ద పెద్ద కొప్పులపై అలంకృతములైన పూలమాలలు జాఱిపోవుచుండెను. ఆ పత్నులు తమ ప్రియుడైన శ్రీకృష్ణునిపై జలసేచనములలో పోటీపడుచు చేరువయై ఆ స్వామిని కౌగిలించుకొనసాగిరి. ఆ ప్రభువుయొక్క సుఖస్పర్శతో వారిలో ప్రేమభావములు పొంగిపొఱలెను. అప్పుడు వారి ముఖకమలశోభలు ఎంతయు ఇనుమడించెను.


*90.11 (పదకొండవ శ్లోకము)*


*కృష్ణస్తు తత్ స్తనవిషజ్జితకుంకుమస్రక్- క్రీడాభిషంగధుతకుంతలవృందబంధః|*


*సించన్ముహుర్యువతిభిః ప్రతిషిచ్యమానో రేమే కరేణుభిరివేభపతిః పరీతః॥12127॥*


ఆ సమయమున తరుణీమణుల వక్షస్థలములయందు లిప్తమైన కుంకుమతో శ్రీకృష్ణుని వనమాల రాగరంజితమయ్యెను. క్రీడాభినివేశకారణముగా ఆ స్వామియొక్క కుంతలములు అటునిటు చలించుచు అందములను చిందించుచుండెను. ఆ ప్రభువు తన పత్నీ రత్నములపై సంతోషాతిశయముతో జలములను చల్లుచుండగా వారును ఆ పురుషోత్తముని కవ్వంచుచు రెట్టింపు ఉత్సాహముతో జలసేచనములు గావించుచుండిరి. ఈ విధమగా శ్రీకృష్ణుడు ఆడు ఏనుగులతోగూడిన గజేంద్రునివలె తన భార్యామణులతో విహరించెను.


*90.12 (పండ్రెండవ శ్లోకము)*


*నటానాం నర్తకీనాం చ గీతవాద్యోపజీవినామ్|*


*క్రీడాలంకారవాసాంసి కృష్ణోఽదాత్తస్య చ స్త్రియః॥12128॥*


నిరంతరము కళాకౌశలములతో, గీతావాద్య ప్రావీణ్యములతో తమను మురిపింపజేయుచుండెడి నటీనటులకు, నర్తకీమణులకు, వాద్యకళాకారులకు శ్రీకృష్ణుడును, ఆయన పత్నులును జలక్రీడా సమయమున తాము ధరించిన అమూల్య వస్త్రాభరణములను బహూకరించిరి.


*90.13 (పదమూడవ శ్లోకము)*


*కృష్ణస్యైవం విహరతో గత్యాలాపేక్షితస్మితైః|*


*నర్మక్ష్వేలిపరిష్వంగైః స్త్రీణాం కిల హృతా ధియః॥12129॥*


శ్రీకృష్ణుడు అట్లు విహరించుచు తన ఒయ్యారపు గమనముతోడను, మధురాలాపములతోడను, క్రీగంటి చూపులతోడను, దరహాసములతోడను, ఏకాంతక్రీడలతోను, ఆలింగన సౌభాగ్యములతోడను ఆ పత్నీరత్నములను పరవశింపజేయుచు, వారి హృదయములను దోచుకొనెను. ఆ పారవశ్యములో వారు ఈ లోకమునే మరచిరి.


*90.14 (పదునాలుగవ శ్లోకము)*


*ఊచుర్ముకుందైకధియోఽగిర ఉన్మత్తవజ్జడం|*


*చింతయంత్యోఽరవిందాక్షం తాని మే గదతః శృణు॥12130॥*


రాజా! ఆ కాంతల హృదయములు నిరంతరము కృష్ణలీలారతములై యుండెను. ప్రేమోన్మత్తులై యుండుట వలన వారి నోట మాట పెగలకుండెను. ఆ స్వామి తమ ఎదుట ఉన్నప్పుడును, లేనప్పుడును ఆ అరవిందాక్షునే స్మరించుచు వారు ఏమోమో మాట్లాడుచుండిరి. వాటినన్నింటిని వివరించెదను, సావధానుడవై వినుము.


*మహిష్య ఊచుః*


*కురరి విలపసి త్వం వీతనిద్రా న శేషే స్వపితి జగతి రాత్ర్యామీశ్వరో గుప్తబోధః|*


*వయమివ సఖి కచ్చిద్గాఢనిర్భిన్నచేతా నలిననయనహాసోదారలీలేక్షితేన॥12131॥*


*అప్పుడు కృష్ణపత్నులు ఇట్లు పలుకసాగిరి* గోరువంకా! లోకము పూర్తిగా గాఢనిద్రలో మునిగియున్నది. మన స్వామిగూడ ఏమాత్రమూ బాహ్యవిషయ స్పృహ లేకుండా నిద్రించుచున్నాడు. నీవు ఏమాత్రము నడుము వాల్చక, నిద్రలేకుండా విలపించుచున్నావు. నీకును, మాకువలె ఆ నలినాక్షుని చిరునవ్వులతోను, ఉదారలీలలవలనను, క్రీగంటి చూపుల ప్రభావమునను హృదయము దెబ్బతినినదాయేమి? (మనస్సు పనిచేయుటలేదా? యేమి?).


*90.16 (పదహారవ శ్లోకము)*


*నేత్రే నిమీలయసి నక్తమదృష్టబంధుస్త్వం రోరవీషి కరుణం బత చక్రవాకి|*


*దాస్యం గతా వయమివాచ్యుతపాదజుష్టాం కిం వా స్రజం స్పృహయసే కబరేణ వోఢుమ్॥12132॥*


ఓ చక్రవాకీ! ఈ రాత్రివేళ నీ స్వామి (పతిదేవుడు) కనబడనందున నీవు కనులు మూసికొని, దీనస్వరముతో (దైన్యముతో) దురపిల్లుచున్నావా? నీవును మావలెపతికి దాస్యము (సేవలు) చేయగోరి మేల్కొనియున్నావా? ఆ ప్రభువు పాదములయందు సమర్పింపబడిన పూలమాలను కొప్పునందు ధరించుటకు ఆరాటపడుచున్నావా? తెల్పుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి తొంబదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: