20, ఆగస్టు 2021, శుక్రవారం

ఈ అనంత విశ్వాన్ని ’లక్షించేది’ లక్ష్మి.

 ఈ అనంత విశ్వాన్ని ’లక్షించేది’ లక్ష్మి. 


అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ’కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి - అని భావార్థం. 


కనులు తెరవడాన్ని సృష్తిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు. 


పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి స్థితి లయలే ’ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు.


సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత.


అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ’లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు.


ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ’లక్ష్మి’. 


ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది.


 జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. 


అందుకే దీనిని ’భృగు’వారమనీ వ్యవహరిస్తారు.


భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం.

పర్వతరాజు (హిమవాన్)పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు.


నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణుదయనే ఆయాలోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి......


ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు.


శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి - ఒకే లక్ష్మి తాలూకు విభిన్న రూపాలివి.


’వర’ శబ్దానికి ’కోరుకున్నది’ అని అర్థం. అందరూ కోరుకొనే సంపదలు వరాలు


వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి.


వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. 


అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ ఈ వరలక్ష్మి. .


వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన అయిదు లక్ష్ములనూ సమన్వయించి చరమ నామంగా చెబుతారు.


 ’ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం.


అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం - ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం.


శ్రీమహాలక్ష్మీ అనుగ్రహప్రాప్తి మీకందరికీ కలగాలని కోరుకొంటూ


శ్రీమాత్రే నమః 🙏


 

జై శ్రీమన్నారాయణ🙏

కామెంట్‌లు లేవు: