*19.08.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*
*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*89.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*
*వవంద ఆత్మానమనంతమచ్యుతో జిష్ణుశ్చ తద్దర్శనజాతసాధ్వసః|*
*తావాహ భూమా పరమేష్ఠినాం ప్రభుర్బద్ధాంజలీ సస్మితమూర్జయా గిరా॥12108॥*
అంతట శ్రీకృష్ణుడు తన రూపమేయైన ఆ అనంతునకు (శ్రీహరికి) నమస్కరించెను. పిమ్మట అర్జునుడును ఆ స్వామికి ప్రణమిల్లెను. ఆ శేషతల్పశయనుని దర్శించుటతో అర్జునునిలో భక్తిపూర్వక భయము ఏర్పడెను. అంజలి ఘటించి నిల్చియున్న శ్రీకృష్ణార్జునులతో దేవాధిదేవుడైన శ్రీమహావిష్ణువు దరహాసమొనర్చుచు మృదుమధుర గంభీరవచనమలను ఇట్లు నుడివెను-
*89.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*
*ద్విజాత్మజా మే యువయోర్దిదృక్షుణా మయోపనీతా భువి ధర్మగుప్తయే|*
*కలావతీర్ణావవనేర్భరాసురాన్ హత్వేహ భూయస్త్వరయేతమంతి మే॥12109॥*
*89.60 (అరువదియవ శ్లోకము)*
*పూర్ణకామావపి యువాం నరనారాయణావృషీ|*
*ధర్మమాచరతాం స్థిత్యై ఋషభౌ లోకసంగ్రహమ్॥12110॥*
"కృష్ణార్జునులారా! మీ ఇరువురను చూడవలయునను కోరికతోడనే నేను బ్రాహ్మణ కుమారులను ఇచటికి (నా యొద్దకు) తెప్ఫించితిని. మీరు ఎవరోకారు, ధర్మమును రక్షించుటకే నా అంశలతో భూతలమున అవతరించినవారు. భూమికి భారముగానున్న రాక్షసులను హతమార్చి, తిరిగి నా యొద్దకు త్వరగా విచ్చేయుడు. మీరు ఇద్దరును నరుడు, నారాయణుడు - అను ఋషిప్రముఖులు. మీరు పూర్ణకాములు (ఎట్టికోరికలును లేనివారు). సర్వశ్రేష్ఠులు! లోకకల్యాణము కొరకు ధర్మమును స్థాపించుటకై (ఉద్ధరించుటకై) అవతరించితిరి".
*89.61 (అరువది ఒకటవ శ్లోకము)*
*ఇత్యాదిష్టౌ భగవతా తౌ కృష్ణౌ పరమేష్ఠినా|*
*ఓమిత్యానమ్య భూమానమాదాయ ద్విజదారకాన్॥12111॥*
*89.62 (అరువది రెండవ శ్లోకము)*
*న్యవర్తతాం స్వకం ధామ సంప్రహృష్టౌ యథాగతమ్|*
*విప్రాయ దదతుః పుత్రాన్ యథారూపం యథావయః॥12112॥*
ఆ పరమపురుషుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆయన ఆజ్ఞను తలదాల్చి, కృష్ణార్జునులు ఆ స్వామికి నమస్కరించిరి. అనంతరము వారు ఆ బ్రాహ్మణ పుత్రులను అందఱిని తీసికొని, తాము వెళ్ళిన మార్గము ద్వారానే సంతోషముతో ద్వారకా నగరమునకు తిరిగి విచ్చేసిరి. పిమ్మట వారు, తగిన వయస్సులు, రూపములు కలిగియున్న ఆ బాలకులను ఆ భూసురోత్తమునకు అప్పగించిరి.
*89.63 (అరువది మూడవ శ్లోకము)*
*నిశామ్య వైష్ణవం ధామ పార్థః పరమవిస్మితః|*
*యత్కించిత్పౌరుషం పుంసాం మేనే కృష్ణానుకంపితమ్॥12113॥*
అర్జునుడు ఆ వైకుంఠధామమును దర్శించిన పిదప ఎంతయో ఆశ్చర్యచకితుడయ్యెను. 'మానవులలో ఏమాత్రము బలపౌరుషములు ఉన్నను అవి అన్నియును శ్రీకృష్ణుని అనుగ్రహఫలములే' అని అతడు గ్రహించెను.
*89.64 (అరువది నాలుగవ శ్లోకము)*
*ఇతీదృశాన్యనేకాని వీర్యాణీహ ప్రదర్శయన్|*
*బుభుజే విషయాన్ గ్రామ్యానీజే చాత్యూర్జితైర్మఖైః॥12114॥*
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణపరమాత్మ ఈ లోకమున ఈ రీతిగా అనేకమైన అద్భుతలీలలను ప్రదర్శించెను. లోకదృష్టిలో సామాన్యమానవులవలె సాంసారిక భోగములను అనుభవించెను. మహారాజులవలె పలు యజ్ఞములను ఆచరించెను.
*89.65 (అరువది ఐదవ శ్లోకము)*
*ప్రవవర్షాఖిలాన్ కామాన్ ప్రజాసు బ్రాహ్మణాదిషు|*
*యథాకాలం యథైవేంద్రో భగవాన్ శ్రైష్ఠ్యమాస్థితః॥12115॥*
శ్రీకృష్ణభగవానుడు ఆదర్శ మహాపురుషుని వలె ప్రవర్తించెను. 'ఇంద్రుడు సమయానుసారముగా ప్రజలకు వర్షములను కురిపించి ఆదుకొనినట్లు, ఆ ప్రభువు బ్రాహ్మణాది సమస్త ప్రజలయొక్క మనోరథములను అన్నింటిని ఈడేర్చెను.
*89.66 (అరువది ఆరవ శ్లోకము)*
*హత్వా నృపానధర్మిష్ఠాన్ ఘాతయిత్వార్జునాదిభిః|*
*అంజసా వర్తయామాస ధర్మం ధర్మసుతాదిభిః॥12116॥*
ఈ నందనందనుడు అధర్మపరులైన పెక్కుమంది రాజులను స్వయముగా హతమార్చెను. ఇంకను కొందరిని అర్జునాదులచే వధింపజేసెను. అట్లే యుధిష్ఠిరుడు మొదలగు ధర్మనిరతులైన రాజులద్వారా అవలీలగా ధర్మస్దాపన చేసెను.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే ద్విజకుమారానయనం నామైకోననవతితమోఽధ్యాయః (89)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట* అను
ఎనుబది తొమ్మిదవ అధ్యాయము (89)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి