20, ఆగస్టు 2021, శుక్రవారం

*శ్రీ సూక్తము..* *( ఆఖరి భాగము)*

 *శ్రీ సూక్తము..* *( ఆఖరి భాగము)*


*పదవ ఋక్కు* :: 


*మన॑సః॒ కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి ।*

*ప॒శూ॒నాగ్ం రూ॒పమన్య॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతాం॒ యశః॑ ॥*


 నా మనసు యొక్క కోరికలు ఆకుతి = సంకల్పాలు ఫలించాలి. నా వాక్కు సత్య మయంగా ఉండాలి. (చెప్పినది జరగాలి). పశువులు ధన ధాన్య సమృద్ధి (అన్నం) ఉండాలి. శ్రీదేవి యొక్క కృపాకటాక్షాలు వల్ల పైన చెప్పిన వాటితో పాటు నాకు మంచి పేరు కూడా ఉండాలి. ఇది ఈ ఋక్కు లో భావన. మయి॒ శ్రీః శ్ర॑యతాం॒ అంటే మహాలక్ష్మి నాయందు నిత్యము నివసించు గాక అని అర్థము.

 

*పదకొండవ ఋక్కు* :: 


*క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ ।*

*శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే॒ మా॒తరం॑ పద్మ॒మాలి॑నీం ॥*


 కర్దముడు మహాలక్ష్మి కొడుకుల్లో ఒకడు. కర్దముడి వల్ల సంతానవతి అయ్యావు. ( ఓ కర్దముడి తల్లి అని సంబోధించడము). అట్టి లక్ష్మీదేవి పుత్రుడైన కర్థముడా నీవు నా ఇంట్లో ఉండి, మీ తల్లి అయిన శ్రీదేవిని, మా వంశములో శాశ్వతంగా నిలిచేటట్లు చేయుము, అనేది ఇందులో భావన. నా ఇంట్లో అమ్మవారు ఉండాలి నాకు దగ్గరగా ఉండాలి మొదలైన కోరికలు దాటి నా వంశంలో తరతరాలకు లక్ష్మీదేవి ఉండాలి అనే కోరిక ఈ ఋక్కులో వ్యక్తమవుతుంది.


ప్రజా అంటే సంతానము. కులముఅంటే వంశము. ఈ పదాలు వాడడం వల్ల ఇందులో సంతానలక్ష్మి అనే రూపాన్ని ధ్యానించి నట్టుగా తెలుసుకోవచ్చు.


*పన్నెండవ ఋక్కు* :: 


*ఆపః॑ సృ॒జంతు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే ।*

*ని చ॑ దే॒వీం మా॒తరం॒ శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే ॥*


చిక్లీతుడు లక్ష్మీదేవి కొడుకుల్లో ఒకడు. ఓ చిక్లీతుడా నీవు నా ఇంట్లో నివాసముండు. కర్దము శబ్దానికి బురద అని అర్థము. చిక్లీత శబ్దానికి తడి తేమ అని అర్థాలు. ఈ రెండు పదాలకూ నీటి తో సంబంధం ఉన్నది. స్ని॒గ్ధం అంటే మెత్తటిది నున్నటిది స్నేహం తో కూడినది అని అర్థాలు. లక్ష్మీదేవి స్వయంగా నీటి నుంచి పుట్టింది. చంద్రునికి పద్మములకు సోదరి. అందువలన కర్దముడు చిక్లీతుడు వీళ్లకు జలములు తాతగారు అవుతారు. ఆపః = జలాలకు అభిమాన దేవత అయిన వరుణుడు మాకు స్నేహంతో కూడిన పనులు చేయుగాక అని చిక్లీతుడిని కోరడము జరుగుతుంది.


మీ తల్లి అయిన లక్ష్మీదేవిని మా వంశం లో స్థిర నివాసము ఉండునట్లు గా చేయుము.


 పైన ఋక్కులలో భూమి జలము ఈ రెండింటిని ప్రస్తావించారు. చిక్లీత శబ్దం లో క్లీ బీజము ఉన్నది. క్లీ అనే బీజాక్షరము ఐశ్వర్య ప్రదాయకమైనది. అందులో ఉన్న క కారము జలానికి ల కారము భూమికి ఈ కారము శక్తికి సూచనలు. ( క అంటే జలము అనే అర్ధము వున్నదని ఇంత క్రితమే చెప్పుకున్నాము. లం పృథ్వ్యాత్మనే.. న్యాసంలో చెప్పుకుంటాం కదా.) భూమి నీరు కలిస్తేనే పంటలు వృద్ధి చెందుతాయి. ప్రజలకు జంతువులకు ఆహారం దొరుకుతుంది. వరదల వల్ల భూకంపాల వల్ల ప్రజలకు నష్టం కూడా జరుగుతుంది. క్లీ బీజము లయ కారకమైనదికూడా. భూదేవి ధాన్య లక్ష్మి కి పొలాలకు ఆస్తులు మొదలైనవాటికి ప్రతీక.


ఇంత క్రితము ఆర్ద్రామ్ జ్వలంతీమ్ అన్న చోట జలము అగ్ని వస్తాయి. అక్కడ క్రీ అనే బీజం ఉంది. క+ర+ఈ ఇందులో ర కారము అగ్ని బీజము. అందువల్ల దానిలో జలము+అగ్ని+శక్తి మూడు కలిసి ఉంటాయి. 


*పదమూడవ ఋక్కు* :: 


*ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం॒ పిం॒గ॒ళాం ప॑ద్మమా॒లినీం ।*

*చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥*


*పధ్నాలుగవ ఋక్కు* ::  


*ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం, య॒ష్టిం॒ సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీం ।*

*సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం॒ జాత॑వేదో మ॒ ఆవ॑హ ॥*


 ఈ రెండు ఋక్కులు కలిపి అర్థం చెప్పు కుందాము. ఈ రెండు ఋక్కుల కు ప్రాంతీయ బేధము ఉన్నది. ఒక్కొక్క చోట వరస మార్చి చదువుతుంటారు. అందువలన వీటిలో ఏది 13వది ఏది 14వది అని సరిగ్గా చెప్పలేము.


పు॒ష్కరి॑ణీం, పు॒ష్టిం॒, పిం॒గ॒ళాం, ఈ మూడు మొదటి ఋక్కులో కొత్త పదాలు. య॒ష్టిం॒ రెండవ దానిలో కొత్త పదము. మిగిలినవన్నీ ఇంతకుముందు నేర్చుకున్నవే. కొన్నిచోట్ల యష్టిమ్ బదులు ఇష్టిం అని ఉన్నది. కలిపి అర్థము చెప్పకోడము ఎందుకంటే మొదటి దానిలో చంద్రాం అని ఉంటే రెండవ దానిలో సూర్యాం అని ఉన్నది. పద్మమాలినీమ్ అని ఒక దాంట్లో ఉంటే హేమ మాలినీం అని రెండో దానిలో ఉన్నది. ఆ కొత్త పదాలు అని చూపించినవి తప్ప రెండిటిలోనూ ఏమీ తేడా లేదు.


పుష్కరిణి అంటే కోవెల దగ్గర ఉండే కోనేరు. తామర తీగె. ఏనుగు తొండము యొక్క చివరి భాగము. ఇవి మూడూ కూడా లక్ష్మి స్థానాలు. రెండు ఋక్కుల లో కూడా ఆ॒ర్ద్రాం అని ఉన్నది కనుక ఏనుగు తొండాలతో అభిషేకం చేయించుకుంటూ తడిగాను చల్లగాను ఉన్న లక్ష్మీదేవిని ధ్యానం చేసుకోవాలి.


గజలక్ష్మి పక్కన ఉన్న రెండు ఏనుగులు ఒకటి మదము రెండవది మమకారము. అభిషేకం చేసే జలము తృప్తి. లక్ష్మి మదాన్ని మమకారాన్ని తన పరిచారికలుగా కలిగి ఉంటుంది. డబ్బు రాగానే ముందు అవి రెండు వచ్చి కూర్చుంటాయి. మదము తల పొగరు తెస్తుంది. మమకారము పీనాసి తనము తెస్తుంది. ఏనుగు అనేది తామస స్వరూపము. అమ్మవారి దయ ఉంటే వాటి రెండిటిని అదుపులో ఉంచుకొని తృప్తిని సాధించుకోవచ్చు. గజలక్ష్మిని పూజించి ఆమె అనుగ్రహం పొందిన వాడు ధనం తో పాటు తృప్తిని కూడా పొంది, ధనాన్ని అదుపులో ఉంచుకుంటాడు వినయం తో ఉంటాడు. దానము కూడా చేస్తాడు. గజలక్ష్మి అంటే తృప్తాం తర్పయంతీం అని వర్ణించు కున్న ఆవిడ. 


పుష్టి అంటే ఆరోగ్యము బలము కొద్దిగా కూడా లోపం లేకుండా పరిపూర్ణ స్థితిలో ఉండటము. ఇది కూడా లక్ష్మీదేవి యొక్క లక్షణము.


అమ్మవారు హిరణ్య వర్ణాం, స్వర్ణ వర్ణాం, అన్నప్పటికీ పింగళ వర్ణం లో కూడా ఉంటారు అనేది పౌరాణిక వచనము. పింగళ అంటే అందమైన అమ్మాయి అనే అర్థం కూడా ఉంది. 


ఇందులో చంద్ర, సూర్య , జాతవేద శబ్దాలు చంద్ర సూర్య అగ్ని అర్ధాలను తెలియజేస్తాయి. యోగంలో చెప్పే ఇడా పింగళ సుషుమ్న నాడులు చంద్ర సూర్య అగ్ని ప్రతీకలుగా ఉంటాయి. సుషుమ్న ఇడా పింగళ నాడులలో ఒకటి పింగళ. ఒకటి చెప్తే మిగిలినవి కూడా చెప్పినట్లే. ఈ పింగళ పదాన్ని లక్ష్మీదేవికి విశేషణంగా వాడారు. చంద్ర సూర్య అగ్ని ముగ్గురూ అమ్మవారి రూపాలే కాబట్టి మూడు నాడులు కూడా ఆమె కు సంబంధించినవి. ఈ అర్థంలో ఆమె కుండలినీశక్తి.


యష్టిం అంటే దండ ధారిణీ అని అర్థము. యష్టిం అంటే వంట ఇంటికి అధి దేవత అంటే అన్నపూర్ణ అని కూడా అర్థం ఉందట. ఇష్టిం అంటే యజ్ఞ స్వరూపిణి. హరిణీ అన్న మాట కూడా యజ్ఞ స్వరూపిణి అని అర్థం చెప్పుకున్నాము.


సూర్య కాంతి జ్ఞానానికి అగ్ని పవిత్రతకు చంద్రకాంతి సౌందర్యానికి గుర్తు. అమ్మవారికి ఆ మూడు గుణాలు ఉన్నాయి.


పైన చెప్పిన విశేషాలతో కూడిన లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానించుము అనేది ఈ ఋక్కుల లో సాధారణ అర్థము.


*పదిహేనవ ఋక్కు* :: 


*తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్షీమన॑పగా॒మినీం᳚ ।*

*యస్యాం॒ హిర॑ణ్యం॒ ప్రభూ॑తం॒ గావో॑ దా॒స్యోఽశ్వా᳚న్, విం॒దేయం॒ పురు॑షాన॒హం ॥*


ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్లి రెండవ ఋక్కు చూడండి. అదికూడా ఇక్కడ ఇస్తున్నాను. రెండిటికీ తేడా లేదు.


*రెండవ ఋక్కు* :: 

*తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚ ।*

*యస్యాం॒ హిర॑ణ్యం విం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హం ॥*


 ఆ రెండవ ఋక్కుకు అర్థం చెప్పుకునే టప్పుడు పురుషాన్ పదానికి పనివాళ్ళు అనే అర్థం కూడా చెప్పుకున్నాము. ఇక్కడ దాస్య అని అదే మాట ప్రత్యేకంగా రాశారు.

రెండవ ఋక్కుకు 15 వ ఋక్కుకు అర్థంలో ఏమీ తేడా లేదు. మీకు గుర్తు ఉండే ఉంటుంది ఆవాహన చేసిన తర్వాత రెండవ ఋక్కులో లక్ష్మీదేవిని స్థిరంగా మా ఇంట్లో ఉండాలి అని కోరుకుంటారు. అదే కోరిక ఆఖరులో మరొక్కసారి కోరుకుంటున్నాము.


ప్రభూతం అంటే ప్రకృష్టం భూతం గొప్పగా పుట్టినది అని అర్థము. ఆ పదాన్ని మంచిది గొప్పది అని విశేషణము గా వాడుతారు.


 శ్రీ సూక్తానికి నీలకంఠ భాష్యం లో లలితా దుర్గా పరంగా అర్థం చెప్పారు. రంగనాథ ముని భాష్యం లో వైష్ణవ మతపరంగా మహాలక్ష్మి పరంగా అర్థం చెప్పారు. ఇవి కాక ఇంకా చాలా భాష్యాలు ఉన్నాయి. 


*మొత్తం శ్రీ సూక్తాన్ని మాలా మంత్రం గా జపించడానికి అంగన్యాస కరన్యాసాలు ధ్యానము మొదలైనవి ఒక విధంగా ఉంటాయి..* 

*ఒక్కొక్క ఋక్కును ఒక్కొక్క మంత్రంగా జపించడానికి అంగన్యాస కరన్యాసాలు వేరే విధంగా ఉంటాయి..* 


*అవి గురువులను అడిగి తెలుసుకోవాలి.*


 *శ్రీ సూక్తము పుస్తకాలలో ఈ పదిహేను ఋక్కుల తర్వాత ఫల శృతి కి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. అవి అసలు శ్రీ సూక్తము లో లేవు...అందువలన వాటికి వ్యాఖ్యానము చెప్పడము లేదు...*

 

 శ్రీ సూక్తం సంపూర్ణము.

 

 *పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: