మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*తల్లి చెప్పిన మాట!..*
"నాకు ఆ దత్తయ్య కలలో కనబడి చెప్పాడురా..నీకు మొగపిల్లవాడు పుడతాడు..అదికూడా బుధవారం నాడే పుడతాడు.." అని చోడవరం లో ఉంటున్న రమణారెడ్డి గారితో ఆయన తల్లి గారైన సుబ్బమ్మ గారు పదే పదే చెప్ప సాగారు..అప్పటికి రమణారెడ్డి గారి భార్య ఆరు నెలల గర్భవతి..
ప్రస్తుతం నెల్లూరు జిల్లా లోని జలదంకి మండలం లో ఉన్న ఊరు చోడవరం..ఆ చోడవరం లో నివాసం ఉంటున్న రమణారెడ్డి గారి తల్లి సుబ్బమ్మ గారికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారంటే మహా భక్తి..శ్రీ స్వామివారు 1976 లో సిద్ధిపొందిన తరువాత.. ఓ రెండు మూడేండ్ల కు సుబ్బమ్మ గారు శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని మొదటిసారి దర్శించుకున్నారు..ఆరోజు నుంచి ఆవిడ గారు శ్రీ స్వామివారికి పరమ భక్తురాలిగా మారిపోయారు..
1980 వ సంవత్సరం నాటికి ప్రయాణం చేయాలంటే..పల్లెటూరి వాటికి ఎడ్ల బండ్లు..లేదా కాలినడకే శరణ్యం..అప్పటికి పల్లెలకు బస్ సౌకర్యం పెద్దగా లేదు..సుబ్బమ్మ గారు తాను ఉంటున్న చోడవరం నుంచి..మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి సుమారు ఇరువైరెండు కిలోమీటర్ల దూరం..అంత దూరమూ ఆవిడ నడచి వచ్చేది..ఆరాత్రికి శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేసి..తెల్లవారి మళ్లీ నడుచుకుంటూ తన ఊరు చేరేది..
సుబ్బమ్మ గారి ఒక్కగానొక్క కుమారుడు రమణారెడ్డి..రమణారెడ్డి స్వతహాగా వేంకటేశ్వరస్వామి భక్తుడు..తల్లి మొగలిచెర్ల కు రమ్మని చాలా సార్లు పిలిచినా..అతను పట్టించుకోలేదు..కానీ తన తల్లి బుధవారం రోజే కాన్పు అవుతుందనీ..తనకు మొగపిల్లవాడే పుడతాడని..పదే పదే చెప్పడం..శ్రీ స్వామివారు తల్లికి స్వప్న దర్శనం ఇచ్చాడని చెప్పడం..కొద్దిగా వింతగా అనిపిస్తూ ఉండేది..
మూడు నెలల తరువాత..ఒకరోజు ..రమణారెడ్డి భార్యకు నెప్పులు మొదలయ్యాయి..కాన్పు చేయడానికి దగ్గరలో ఉన్న ఒక నర్సును కూడా మాట్లాడుకున్నారు..కొద్దిసేపటికే కాన్పు జరిగింది..మొగపిల్లవాడు పుట్టాడు..ఆరోజు బుధవారం ..తన తల్లి చెప్పిన మాట ఖచ్చితంగా జరిగేసరికి..రమణారెడ్డి మొదట్లో విస్తుపోయాడు.. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగింది?..నిజంగా మొగలిచెర్ల లో సిద్ధిపొందిన ఆ స్వామివారు కలలో కనబడ్డాడా?..ఆయన అంత మహిమ కలిగి ఉన్నారా?..అనే ఆలోచనలు వెల్లువలా రా సాగాయి..
"అయ్యా..మా అమ్మ చెప్పిన మాట పొల్లు పోకుండా జరిగేసరికి..పురుడు తాలూకు అంటు తీరిపోగానే..నేను కూడా మా అమ్మతో కలిసి ఇక్కడికి వచ్చాను..శ్రీ స్వామివారి సమాధి దర్శించుకోగానే..వళ్ళంతా జలదరింపు వచ్చేసింది..ఆరోజు నుంచి..ఇప్పటిదాకా..ఈ స్వామి పాదాలే నమ్ముకొని వున్నాను.." అంటూ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ రమణారెడ్డి మాతో చెప్పుకుంటూ ఉంటాడు..
రమణారెడ్డి కుమారుడు ప్రస్తుతం బెంగళూరు లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు..చోడవరానికి వచ్చినప్పుడల్లా..తండ్రి తో కలిసి మొగలిచెర్ల కు వస్తూ ఉంటాడు..అతనికి కూడా శ్రీ స్వామివారంటే అమిత భక్తి..శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేస్తే..ప్రతి పనిలో తనకు కలిసొచ్చిందని చెపుతూ ఉంటాడు..అందువలనే ప్రతిసంవత్సరం కనీసం రెండు మూడు సార్లు అన్నదానానికి విరాళం ఇస్తూ ఉంటాడు..అంతేకాక..మందిరం వద్ద ఏదైనా అభివృద్ధి చేయదల్చుకుంటే..తనను కూడా ఆ పనిలో భాగస్వామి గా చేర్చమని కోరుతూవుంటాడు..గత మూడు సంవత్సరాలుగా దత్తదీక్షాధారులకు ఏర్పాటు చేస్తున్న ఉచిత ఆహారానికి తన వంతుగా ఒకటి రెండు రోజుల ఖర్చును భరిస్తూ వున్నాడు..
శ్రీ స్వామివారిని మనసా వాచా నమ్మిన సుబ్బమ్మ గారి భక్తి అనే ఆ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతున్నది..
సర్వం..
శ్రీ దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి