20, ఆగస్టు 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం*

 *19.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - తొంబదియవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని లీలావిహారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*90.1 (ప్రథమ శ్లోకము)*


*సుఖం స్వపుర్యాం నివసన్ ద్వారకాయాం శ్రియః పతిః|*


*సర్వసంపత్సమృద్ధాయాం జుష్టాయాం వృష్ణిపుంగవైః॥12117॥*


*90.2 (రెండవ శ్లోకము)*


*స్త్రీభిశ్చోత్తమవేషాభిర్నవయౌవనకాంతిభిః|*


*కందుకాదిభిర్హర్మ్యేషు క్రీడంతీభిస్తడిద్ద్యుభిః॥12118॥*


*90.3 (మూడవ శ్లోకము)*


*నిత్యం సంకులమార్గాయాం మదచ్యుద్భిర్మతంగజైః|*


*స్వలంకృతైర్భటైరశ్వై రథైశ్చ కనకోజ్జ్వలైః॥12119॥*


*90.4 (నాలుగవ శ్లోకము)*


*ఉద్యానోపవనాఢ్యాయాం పుష్పితద్రుమరాజిషు|*


*నిర్విశద్భృంగవిహగైర్నాదితాయాం సమంతతః॥12120॥*


*90.5 (ఐదవ శ్లోకము)*


*రేమే షోడశసాహస్రపత్నీనామేకవల్లభః|*


*తావద్విచిత్రరూపోఽసౌ తద్గేహేషు మహర్ద్ధిషు॥12121॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణభగవానుదు సకల సంపదలతో తులుతూగుచున్న తన ద్వారకానగరమునందు హాయిగా నివసించుచుండెను. వృష్ణివంశ ప్రముఖులెల్లరును ఆ పురమును సేవించుచుండిరి. నవయౌవనకాంతులతో ఒప్పుచున్న అచటి తరుణీమణులు ఉత్తమ వేషధారిణులై (సముచితములైన అమూల్య వస్త్రాభరణములను ధరించి) అలరారుచుండిరి. వారు తమ హర్మ్యములయందు బంతులతో ఆడుచున్నప్పుడు వారి కదలికలు విద్యుత్కాంతులను తలపింపజేయుచుండెను. అచటి రాజమార్గములన్నియును మదధారలను స్రవింపజేయుచున్న గజములతో, చక్కగా అలంకృతులైన భటులతో, అశ్వములతో, బంగారు కాంతులను విరజిమ్ముచున్న రథములతో ఎల్లప్పుడును క్రిక్కిరిసియుండెను. ఆనగరమునందలి ఉద్యానవనములు, ఉపవనములు బాగుగా ఫుష్పించిన వృక్షముల పంక్తులతో విరాజిల్లుచుండెను. పుష్పములపైజేరి మకరందములను గ్రోలుచు తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. పక్షులు తమ కలకలారావములతో సందడి చేయుచుండెను. ఆ నగరమునందు శ్రీకృష్ణపరమాత్ముడు రుక్మిణీ ప్రభృతి - అష్టమహిషులకును, పదునాఱువేలమంది పత్నులకును ఏకైక వల్లభుడై, వేర్వేఱు రూపములతో తేజరిల్లుచు,సకల భోగ్య భోగోపకరణముతో సమృద్ధములైన వారి సౌధములయందు విహరించుచుండెను.


*90.6 (ఆరవ శ్లోకము)*


*ప్రోత్ఫుల్లోత్పలకహ్లారకుముదాంభోజరేణుభిః|*


*వాసితామలతోయేషు కూజద్ద్విజకులేషు చ॥12122॥*


*90.7 (ఏడవ శ్లోకము)*


*విజహార విగాహ్యాంభో హ్రదినీషు మహోదయః|*


*కుచకుంకుమలిప్తాంగః పరిరబ్ధశ్చ యోషితామ్॥12123॥*


ఆ సౌధములయందలి సరస్సులు అత్యంత సుందరములు. బాగుగా వికసించి, పలువన్నెలతో ఒప్పుచున్న ఉత్పలములు, కల్హారములు, కుముదములు, పద్మములు మొదలగు పుష్పములయొక్క పరాగములతో విలసిల్లుచున్న ఆ సరస్సులయందలి నిర్మలజలములు పరిమళములను వెదజల్లుచుండెను. ఆ జలములయందు విహరించుచున్న హంసలు, బెగ్గురుపక్షులు మొదలగునవి చేయుచున్న కలకలధ్వనులు వినసొంపుగా నుండెను. శ్రీకృష్ణుడు అట్టి సరోవరములయందును, అప్పుడప్పుడు నదులయందును తరుణీమణులతోగూడి గ్రుంకులిడుచు జలక్రీడలు సలుపుచుండెను. వారు ఆ పురుషోత్తముని తమ కౌగిళ్ళలో చేర్చుకొనినప్పుడు వారి వక్షస్థలములయందలి కుంకుమలు ఆ స్వామి అంగములయందు అంటుచు వింతశోభలను గొలుపుచుండెను.


*90.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ఉపగీయమానో గంధర్వైర్మృదంగపణవానకాన్|*


*వాదయద్భిర్ముదా వీణాం సూతమాగధవందిభిః॥12124॥*


ఆ సమయమున శ్రీకృష్ణుని యశోవైభవములను కీర్తించుచు గంధర్వులు మధురముగా గానాలాపన చేయుచుండిరి. ఇతర కళాకారులు మృదంగ, పణవ, ఆనక వాద్యధ్వనులతో, వీణానాదములతో రంజింపజేయుచుండిరి. సూత, మాగద, వంది జనులు వంశావళిని కీర్తించుచుండిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి తొంబదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: