*పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.*
*ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.*
*అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.*
*ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా.? అని చెప్పడంతో..*
*ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.*
*ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.*
*ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు.*
*రాజా.! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.*
*కృష్ణా.! మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.*
*తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.*
*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి