. మంగళం కాదది మంగలం
---------------------------------------------------
మంగళంపేరుతో కొన్ని గ్రామాలున్నాయి. తిరుపతినగరానికి ప్రక్కనే మంగళం వుంది. ఇదే జిల్లాలో
గంగాధరనెల్లూరు మండలంలో మహాదేవమంగళం పేరుతో ఓ గ్రామమంది .
పుత్తూరు మండలంలో పరమేశ్వరమంగలం అనే గ్రామముంది.
మంగళంపల్లె అనే గ్రామం కడపజిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలోని వుంది.
తెలంగాణాలో కరీంనగరు జిల్లాలో కోనారావుపేట మండలంలో మంగలంపల్లి గ్రామముంది.
మంగళమంటే స్త్రీ, పార్వతి, శుభం, క్షేమం అనే అర్థాలున్నాయి.
కనుక మంగళంపల్లి, మంగళం, పరమేశ్వరమంళం అనే గ్రామాలలోని మంగళం అనేమాట శుభం, క్షేమమనే అర్థాలను ఇస్తున్నట్లుగా భావించి, తమగ్రామం మంగళకరమైనదిగా కొందరు భావిస్తున్నారు.
నిజానికి ఆ పేర్లన్ని మంగలం అనేమాటకు సంబంధించినవే. మంగలమంటే 58 బ్రాహ్మణకుటుంబాలు నివాసమున్న గ్రామమని అర్థం.
అలాగే చతుర్వేదమంగలం పేరుతో కొన్ని గ్రామాలుండేవని కింది శాసనంవలన తెలుస్తోంది.
1205 ACE * కాలంనాటి శాసనంలో.... గంగ్గగొండ చోడవలనాట్టి ప్రోలునాణ్టి చుత్తమల్లి చతుర్వేదమంగలమున శ్రీ పురుషోత్తమపట్టనము (Sll V - 8) అనగా గంగకొండ చోడవలనాడు (రాష్ట్రానికి)కు చెందిన ప్రోలుమల్లి నాడు (జిల్లా)లోని చతుర్వేద మంగళానికి చెందిన శ్రీ పురుషోత్తమపట్టణమని అర్థం.
మంగలమంటే క్షురకర్మకు సంబంధించినదని, పలుకటానికి శుభప్రదంగా వుండదని మనం మంగలాన్ని మంగళంగా పిలుచుకొంటున్నాం. ఒకపేరులో నిందార్థముందని దానిని మార్చుకొని పిలవడం, వ్రాయడం, వ్యవహరించడం తప్పు.
భారత గ్రామనామాల సంఘం (Place Names Society of India) ప్రకారం గ్రామానికున్న ప్రతిపేరు అక్కడి చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను తెలియచేస్తాయి. పేరును మార్చడం వలన ఆ గ్రామనికున్న చారిత్రిక, సాంస్కృతిక విలువలు గతించిపోయే అవకాశముంది.
కనుక మంగలం అనే గ్రామాలను మంగళం అని పిలవడం తప్పు.
కనుక వాటిని మంగలమనే పిలుచుకొందాం.
ఇక ఆంగ్లభాషాపుణ్యాన కూడా కొన్ని గ్రామాలపేర్లు ఉనికిని కోల్పోతున్నాయి. ఉదా॥ గోళ్ళపల్లి గొల్లపల్లిగాను, గోళ్ళాపురం గొల్లపురంగాను, గోళ్ళను గొల్లగాను పిలుస్తూ వ్రాస్తున్నాము. గోళ్ళపల్లి, గోళ్ళాపురంలోని గోళ్ళ అనేమాటకు దృఢమైన గోడలు (కోటగోడలు ) వున్న గ్రామమని అర్థం.
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు అనే సామెతకూడా వుంది. ప్రస్తుతతరం (Generation) వారు సామెతలు ఉపయోగించడం పూర్తిగా మర్చిపోయారనుకోండి.
మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. ఇదోవేపుడు చట్టి. సాధారణంగా పాతకుండను తీసుకుని దాని పైభాగాన్ని జాగ్రత్తగా పగులగొట్టి మిగిలిన కిందిభాగాన్ని వేయించుకొనేందుకు బాణలిగా పల్లెలలో వాడేవారు. మంగలంలో ఎండు మిరపకాయలు, వేరుశెనగపప్పు, ఎండుచేపలు,పేలాలు లాంటివి వేయించుతారు.పనైపోయిన తరువాత ఇంటి ముందర అరుగుపై ఆరబెట్టుకొంటారు. ఇక్కడ మంగలమంటే దాదాపుగా అత్యంత బలహీనమైన మట్టిపాత్ర కదా! దీనిపై అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మీద పడితే ఆ మంగలం ముక్కలై పెంకులైఎగిరిపోతుంది.
బలవంతుడు బలహీనుడిపైబడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.
* క్రీ.శ.లేదా AD కి బదులుగా After common Era (ACE), క్రీ.పూ.లేదా BC కి బదులుగా Before Common Era (BCE) ఉపయోగించాలనే నిర్ణయం జరిగింది.
॥సేకరణ॥
-----------------------------------------------------------------
జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి