4, నవంబర్ 2021, గురువారం

*ఇదీ దీపావళి

 *ఇదీ దీపావళి*

          


దీపావళి 5 రోజుల పండగ. ఆశ్వయుజ త్రయోదశినుండి మొదలుకొని కార్తిక శుద్ధ ద్వితీయ వరకూ. 

అవే ... 1. ధనత్రయోదశి >ఆశ్వయుజ బహుళ త్రయోదశి

            2. నరక చతుర్దశి> ఆశ్వయుజ బహుళ చతుర్దశి

            3. దీపావళి > ఆశ్వయుజ అమావాస్య

            4. బలి పాడ్యమి > కార్తిక శుద్ధ పాడ్యమి

            5. యమ ద్వితీయ > కార్తిక శుద్ధ ద్వితీయ


*ఈ అయిదు రోజులలో ఏం చెయ్యాలి?* 

ఆశ్వయుజ బహు ళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలలోనూ మరియు కార్తిక శుద్ధ పాడ్యమి, విదియలలోనూ  ... ఈ అయిదు రోజులలోనూ సాయంత్రం తొలి నక్షత్రం కనబడే వేళకు పూజగదిలోనూ, తులసికోట వద్ద, ఇంటి గుమ్మాలవద్ద దీపాలనువెలిగించాలి.

ఇకరోజువారీగా చేయవలసిన విధులు:


*1.ధనత్రయోదశి*

ధనత్రయోదశి నాడు: ఆయుర్వేదానికి అధిదైవతమైన ధన్వంతరి ఆవిర్భవించిన రోజు. కనుక ఈరోజు ధన్వంతరిని పూజించినవారికి పూర్ణాయుర్దాయం, పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ధనపతి అయిన కుబేర పూజనం, శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాచరణం ... చేయాలి. దానివల్ల ధన, కనక, వస్తువాహనసమృద్ధి కలుగుతాయి.


*2. నరకచతుర్దశి*

రెండవరోజు నరకచతుర్దశి నాడు ...

*సూర్యోదయానికిముందే అభ్యంగస్నానం,

(అంటే తలనుంచి పాదాలవరకూ నువ్వులనూనె పట్టించుకుని ఆపైన నలుగుపిండితో రుద్దుకుని కుంకుడు కాయలు/షికాకాయ పొడితో తలంటు  స్నానం చేయటానికి అభ్యంగస్నానం అని పేరు)

* యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ।

వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ।।

ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమాత్మనే।

వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః।।

అని యమనామములను పఠించి తర్పణములనీయాలి. దీనివలన అకాల మృత్యుదోషములు తొలగి పోతాయి.


*ఉల్కాదానం (గోగుకొమ్మ లేక ఆముదపు కొమ్మ కు నూనెలో తడిపిన నూలు వస్త్రంలో నల్లనువ్వుల ను చిిన్న చిన్న మూటలుగా కట్టి వెలిగించి ఉత్తరం నుంచి దక్షిణంవైపు పడవేయటం.)దీనికే దివిటీలను వెలిగించటమని పేరు.


* సంధ్యాదీపాన్ని వెలిగించవలె.

ఈ విధులవల్ల మనపితరులు జ్యోతిరాది మార్గంలో బ్రహ్మ లోకానికి చేరుకుంటారని ధర్మశాస్త్రం. మానవులకు నరకబాధ ఉండదు కనుక దానికి *నరకచతుర్దశి* అని పేరు.


*3. దీపావళి*

మూడవ రోజున సాయంకాలం *ధనలక్ష్మీ పూజను* చేసి దీపములను వెలిగించి ఇంటినంతటినీ దీపములతో అలంకరించాలి.  ఈదీపములవరుసలతో అలంకరించకుంటాము కనుక ఈరోజు ను దీపావళి అంటారు.

అలాగే సత్యభామాదేవి నరకుని సంహరించినరోజు నరకచతుర్దశి అని, ఆఆనందపు పండగే దీపావళి అని అందుకే మనం బాణసంచా వెలిగిస్తామని అనాదిగా వస్తున్న సంప్రదాయం. 


ఇక్కడితో ఆశ్వయుజంలో చివరి మూడు రోజుల పండుగ సంరంభం జరుపుకోవాలి.

ఇలా ఈమూడు రోజుల పండగ వల్ల మనపితరులకు ఉత్తమలోక ప్రాప్తి, మనకు ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తాయన్నమాట. 

ఆపైన - 

*4. బలిపాడ్యమి* 

ఇది కార్తిక మాసంలో శుక్లపక్షం లో తొలి తిథి. ఈరోజు వామనుని అనుమతితో బలిచక్రవర్తి భూలోక సంచారం ప్రతియింటికీ వస్తాడట. ఆయన రాకను స్వాగతిస్తూ లక్ష్మీ నిలయములైన దీపములతో వారికి స్వాగతం పలుకుతారు. ఈ స్వాగతదీపములను ఇలా.. రాజద్వారములలో, దేవాలయాల్లో, నదీతీరాలలో, తమ తమ గృహాల్లో నెలపొడుగునా వెలిగించాలి. ముఖ్యంగా శివ, విష్ణు ఆలయాల్లో ధ్వజస్తంభం పై గగన తలంలో వెలిగించాలి. దీనికే ఆకాశదీపారంభం అని కూడా పేరు. వాడ వాడలా దీన్ని ఒక మహోత్సవంగా జరుపుతారు. 


*5. యమద్వితీయ*

ఇది కార్తిక శుక్ల ద్వితీయ (విదియ) నాడు జరుపవలసిన పండుగ. తొలికృతయుగంలో యముడీ తిథినాడు  తన సోదరి అయిన యమున యింటికి అతిథిగా వెళ్ళినాడట. అందుకని నాటినుంచి ఈతిథినాడు నరలోకమున సోదరులందరూ తమసోదరి చేతిభోజనముచేసి వారికి విలువైన కానుకలనిచ్చుట సంప్రదాయమైనది. 


ఇలా ఈ అయిదూ లక్ష్మీ ప్రదాయకములైన అయిదు వరుస పండుగలైనవి. 


   

కామెంట్‌లు లేవు: