15, ఫిబ్రవరి 2022, మంగళవారం

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి

 సాహితీ కిరణం

----------+---------





ఈరోజు...

ప్రసిద్ధ నాటక రచయిత,

శతావధానాలలో మేటి,

'కళాప్రపూర్ణ' 

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి

(8-8-1870 ◆ 15-2-1950)


"గగనఘంటాపథంలో విహరిస్తూవుండిన,

పద్యగంగాఝరినితొలుత భూమండలానికి దింపి,

ప్రజావళికి పంచిపెట్టిన వాడుతిక్కన సోమయాజి.


తర్వాత ప్రబంధయుగంలో పాండిత్య ప్రభాకరులైన

రామరాజభూషణాది కవుల తీక్షణతచేత తెలుగు పద్యం ఆవిరైమళ్ళీ ఆకాశమండలం చేరింది.


కానీ-మళ్ళీ తెలుగు పద్యాన్ని భూమండలానికి దింపి,అఖండ గోదావరి ప్రవాహంలాగాప్రవహింపజేసి, తెలుగు సాహిత్య క్షేత్రాన్నిశ్యామలంగాను,

కోమలంగాను వెలుగొందజేసినమహానుభావులు

శ్రీ తిరుపతి వేంకటకవులు"అన్న గుంటూరు శేషేంద్రశర్మ గారిమాటలు అక్షరసత్యాలు.


తిరుపతి వేంకట కవులుగా వినుతికెక్కిన,దివాకర్ల తిరుపతి శాస్త్రి,చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగార్ల

సాహితీ ప్రస్థానాన్నినిశితంగా-సునిశితంగా 

పరిశీలిస్తే-పరికిస్తేపై విషయం మనకు

తేట తెల్లమవుతుంది-ప్రస్ఫుటమవుతుంది.


చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు అవధాన విద్యకు  

రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన 

తిరుపతి వేంకట కవులులో ఒకరు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, ఆయన

మరణానంతరం విడిగానూ ఎన్నో య తండ్రి కామయ్య,తల్లి రామచంద్రమ్మ. గోదావరి జిల్లా కడియం లో నివాస మేర్పరచుకొన్నారు.


శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి,ప్రతివాద భయంకరం 

రాఘవాచార్యులు వద్దఏ కొద్దో చదువుకున్నా,

చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్దనే క్షుణ్ణంగా

విద్యనభ్యసించారు


యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశారు. అనంతరం ఆయన సర్వాత్మనా గురువుగా స్వీకరించిన 

చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు తాడేపల్లిగూడెం సమీపంలోని కడియం గ్రామానికి వెళ్లాడు. వ్యాకరణాన్ని సాంగోపాంగంగానేర్చుకుంటున్న వేంకటశాస్త్రికికాశీకి వెళ్ళి చదువుకోవాలన్న సంకల్పం కలిగింది. ఆపై గురువు అంగీకారంతో వివాహం జరగడం వంటి అనుకోని పరిణామాలు ఎదురు కాగా, వివాహమైన అనంతరం తన సహాధ్యాయితో కలిసి సాహసించి వారణాసి బయలుదేరాడు. వారణాసికి వెళ్ళేందుకు చేతిలో డబ్బు లేకున్నా ఆయన, సహాధ్యాయి కృష్ణశాస్త్రులు విద్యాప్రదర్శనలు, కవిత్వ సభల ద్వారానే డబ్బు సంపాదించుకుని కాశీ చేరుకున్నారు.


నోరి సుబ్రహ్మణ్యశాస్త్రులు (బ్రహ్మయ్యశాస్త్రిగారి గురువు)గారివద్ద వ్యాకరణం తరువాయి నేర్చుకోవటం మొదలుబెట్టారు. వారణాశిలో స్థిరపడ్డ తెలుగు పండితుడు శోభనాధ్రి శాస్త్రులు వేంకటశాస్త్రిని అభిమానించి, ఆ వాత్సల్యం చేత బలవంతపెట్టి మరీ 'సిద్ధాంత చంద్రోదయమ'నే వ్యాఖ్యాన సహితంగా తర్కసంగ్రహాన్ని ఉపదేశించారు. మరికొన్నాళ్ళకు తల్లిదండ్రులు ఉత్తరం వ్రాసి, డబ్బు పంపి తిరిగి రమ్మని మరీమరీ కోరడంతో తిరిగివచ్చేసారు.  వేంకటశాస్త్రి ప్రధానంగా బ్రహ్మయ్యశాస్త్రి శిష్యునిగానే ప్రఖ్యాతుడైనా చాలామంది గురువుల వద్ద శిష్యరికం చేశారు.


కవనార్థం బుదయించినట్లు చెప్పుకున్న చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం

ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. 


వేంకటశాస్త్రి ప్రధాన లక్షణం రంజకత్వం.ఆయన పద్యం చదివేతీరు వినసొంపుగా,వీనుల విందుగా వుండి శ్రోతల హృదయాలను రంజింపజేసేది.

తిరుపతి శాస్త్రి కవిత్వంలో ప్రధానలక్షణం ప్రౌఢిమ.అవధానాల పరంపరలను ఒక వంక కొనసాగిస్తూ,మరొక వంక ఆంధ్ర నాటక సాహిత్యాన్ని 

రసవత్తరమైన పాండవ నాటకాలతో సుసంపన్నం చేశారు.పాండవ జననం మొదలు అశ్వమేథం వరకు కథను ఆరు నాటకాలుగా రచించారు. ఆ తరువాత కథను ఎత్తుకుంటే విషాదాంతం చేయవలసి  వస్తుందని మానేసినట్టు తోస్తుంది.


ఈ ఆ‌రు నాటకాలలో పాండవ జననం, పాండవ రాజసూయం,పాండవ ప్రవాసం,పాండవాశ్వమేథం

వెంకట శాస్త్రిగారు రచించారు.పాండవోద్యోగ విజయాలలో మూడువంతుల రచన వేంకట శాస్త్రిగారిదే.మొదట పాండవోద్యోగం‌,పాండవ విజయం అంటూ రెండు నాటకాలు  వేరువేరుగా లేవు.రెండింటి కథను కలిపి పాండవవిజయం అనే పేరుతోనేప్రకటించారు. తరువాత పాండవవిజయాన్ని వేరుచేసి మొదటి రెండు అంకాలకు ఇంకా నాలుగుఏ అంకాలు చేర్చి 'పాండవోద్యోగమ'నిపేరు పెట్టారు. తక్కిన దానికి ఇప్పటి మొదటి అంకం చేర్చి 

'పాండవవిజయమ'ని ప్రకటించారు.


ఈ ఆ‌రు నాటకాలలో ఎక్కువ ప్రచారంలోకి వచ్చి 

ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న నాటకాలు పాండవోద్యోగం,పాండవవిజయం.ఈ రెంటిని కలిపి 

పాండవోద్యోగ విజయాల పేరుతోనూ,

కురుక్షేత్రం అనేపేరుతోనూ ప్రదర్శిస్తున్నారు. 

ఇవి పౌరాణిక నాటకాలకు విజయ పతాకలు.

ఈ నాటకాలలో స్త్రీ పాత్రకుఅంత ప్రాధాన్యం లేకపోవడంవల్ల,వీటికి ప్రదర్శనా సౌలభ్యం చేకూరింది. పైగా ప్రధాన పురుష పాత్రలు వీటిలో ఎక్కువ.రెండు కలిపిన నాటకం పెద్దది కావడంవల్ల పేరు పొందిన నటులు అనేక మంది ఒకే ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కలిగింది.


ఈ నాటకాల ద్వారానే మంజులూరికృష్ణారావు, 

బుర్రా రాఘవాచార్యులు, పింగళి లక్ష్మీ కాంతం, మల్లాది గోవింద శాస్త్రి,బెల్లంకొండ సుబ్బారావు, 

బందా కనకలింగేశ్వరరావు,పీసపాటినరసింహమూర్తి,

మాధవపెద్దివెంకట్రామయ్య,తదితరులు నటలోకంలో తారాపథం అందుకున్నారు.

పాండవ విజయం,పాండవ ప్రవాసం,అపూర్వ కవితా వివేచనం,సుకన్య,పాండవజననం, అనర్ఘనారదం,పండితరాజం,పాండవఉద్యోగం,పాండవ అశ్వమేథం,ప్రభావతీప్రద్యుమ్నం,రాజసూయం,                వ్యసనవిజయం,మొదలైనవి వీరి స్వతంత్ర నాటకాలు


పల్లెటూళ్ళ పట్టుదలలు,  నవీన విద్యా విలాసం,     

గ్రామ సింగం,తవిటిరొట్టె,రసాభాసం,                   కవిసింహ గర్జితములు,మొదలైనవి వీరి ప్రహసనాలు


మృచ్ఛకటికంముద్రారాక్షసం వీరి అనువాద నాటకాలు


వీరి వచన రచనలలో 'కథలు-గాథలు'విమర్శన వ్యాసాల సంపుటి.1974లో వీరి గ్రంథాలు 

మొత్తం 8 సంపుటాలుగా ప్రచురితమైనాయి.


వీరి అవధానశక్తి అత్యంత విలక్షణం. ధారాశుద్ధితో కూడిన ధారణాశక్తి, ఆశుధారాపటిమ ఆజన్మసిద్ధమా 

అనిపిస్తుంది. అవధానమనే యాగాశ్వంతో 

దిగ్విజయ యాత్ర సలిపి కవితా సామ్రాజ్య 

పట్టాభిషిక్తులయ్యారు. పద్యమైనా, వచనమైనా, 

కబుర్లైనా చవులూరించేటట్లు రాయగలరు; చెప్పగలరు. తిరుపతి వేంకట కవుల కన్నా ముందు 

అవధాన ప్రక్రియ కాస్తో కూస్తో వ్యాప్తిలో ఉంది. 

శ్రీనాథుడు, చరిగొండ ధర్మన్న, భట్టుమూర్తి అవధానాలు చేశారని ప్రతీతి. 64 కళల్లోని కావ్య సమస్యాపూరణం అవధానానికి ప్రాచీన రూపం. పూర్వం నుంచీ సమస్యాపూరణం అనే విద్య రాజస్థానాల్లోనూ, ప్రజాబాహుళ్యంలోనూ ప్రచారంలో ఉండడం చాటువులు చెప్తాయి. తిరుపతి వేంకట కవులకు పూర్వంఏ గుంటూరుకు చెందిన మాడభూషి వేంకటాచార్యులు, పిఠాపుర ఆస్థానకవులు దేవులపల్లి సోదరులు, విజయనగరంలో హరికథా పితామహుడు 

ఆదిభట్ల నారాయణదాసు అష్టావధానాలు చేశారు.

అయితే ఆ విద్యని ఒక క్రీడగా భావించి చేసిన 

ప్రదర్శనలే కానీ అవధానాలను ఉద్యమస్థాయిలో ప్రాచుర్యం తీసుకువచ్చిన వారు తిరుపతి వేంకట కవులు. అష్టావధానాలకూ, శతావధానాలకూ 

స్ఫుటమైన రూపాన్ని సంతరించిపెట్టారు. 

అవధానం అంటే ఇలా ఉండాలి,ఈ అంశాలను ప్రదర్శించాలి, ధారణ సమయం ఇది అంటూ 

నిర్దుష్టంగా ప్రదర్శించి ప్రక్రియాపరమైన ఆకారాన్ని 

కల్పించిన వారు తిరుపతి వేంకట కవులు.


కాశీకి వెళ్ళేందుకు ధనార్జన కోసం చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తన సహాధ్యాయి కందుకూరి కృష్ణశాస్త్రితో కలిసి శనివారప్పేట గ్రామంలో (నేడు ఏలూరు నగరంలో భాగమైపోయింది) తొలి శతావధానం చేశారు. అనంతరం కాశీ నుంచి తిరిగివచ్చాక గంగా సంతర్పణ కోసం ధనార్జన యత్నాల్లో భాగంగా నిడమర్రు, ముమ్మిడివరం, అయినాపురం గ్రామాల్లో ఒంటరిగా అష్టావధానాలు చేశారు.అనంతర కాలంలో గురువు 

చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ఆదేశంతో దివాకర్ల

తిరుపతిశాస్త్రితో కలిసి అవధానాలు ప్రారంభించారు. 

1891లో కాకినాడలో చేసిన శతావధానమే 

తిరుపతి వేంకటకవులుగా వీరి తొలి ప్రదర్శన. 

అందులో వారు చెప్పిన పద్యాల్లో వ్యాకరణ దోషాలున్నాయని పెద్ద పండితులు శంకించారు. 

తిరుపతి వేంకట కవులు కూడా నోరు మెదపకుండా 

అవి నిజంగా తప్పులే అని అందరికీ అనుమానం వచ్చేటట్టుగా ప్రవర్తించారు. అలా శతావధానమంతా అయిపోనిచ్చి, శతావధానం చివరిలో ప్రధానసభకు ముందు జరిగిన ఉపసభలో ఆయా శంకలు అన్నీ 

వరుసగా చెప్తూ పూర్వ మహాకావ్యాల ప్రయోగాలు 

ఉదహరించి ఎగరగొట్టారు. ఆ హఠాత్పరిణామాన్ని ముందుగా ఊహించకపోవడంతో సభ్యులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. పైగా నిండా 20ఏళ్ళు నిండని కుర్రవాళ్లు దిగ్గజాల్లాంటి మహా పండితులను ఓడించడంతో నాటి నుంచి వారి ప్రభ వెలిగిపోవడం మొదలుపెట్టింది.ఆపైన అప్రతిహతమైన వారి శతావధానాల జైత్రయాత్ర తిరుపతి వేంకట కవులకే కాక తెలుగునాట అవధాన ప్రక్రియకే గొప్ప ప్రాచుర్యానికి నాంది అయింది.ఆపై వారి అవధాన పరంపరలో భాగంగా కొప్పరపు సోదర కవులు, వేంకట పార్వతీశ్వర కవులతో వివాదాలు జరిగి పోటాపోటీగా అవధానాలు చేసి పేరు సంపాదించారు.


అవధానాల్లో భాగంగా ఎన్నో గొప్ప పద్యాలను ఆశువుగాఏ రచించారు. అవధానాల్లో ప్రధాన అంశాలైన సమస్యాపూరణం, దత్తపది, ఆశువు, నిషిద్ధాక్షరి వంటి అంశాల్లో వ్రాసిన పద్యాలు ఆయా సభలకు హాజరైన శ్రోతల్నే కాక అనంతర కాలంలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో ప్రచురించిన పలు గ్రంథాల్లో వాటిని చదివిన పాఠకులూ ఆస్వాదించారు.


వేంకటశాస్త్రి గారు బందరు హిందూ 

హైస్కూల్ లో పదవీవిరమణ చేసిన తరువాత కొంత కాలం కడియం గ్రామంలో, ఆ తరువాత విజయవాడలో స్థిరపడ్డారు.

ఉమ్మడి మదరాసు ప్రభుత్వం వారువిజయవాడలో మహాసభ జరిపి  వేంకట శాస్త్రిగారిని ఆస్థాన కవిగా నియమించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం  'కళాప్రపూర్ణ'

బిరుదుతో గౌరవించింది.


పద్య,గద్య కావ్యాలు, నాటకాలు, ప్రహసనాలు, విమర్శనా వ్యాసాలు విరివిగా రాసి,పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటక రచనలతో జీవితపర్యంతమూ, సాహిత్య సేవ చేస్తూ,చిరకీర్తి గడించిన, కళాసాహితీ ప్రియులకు ప్రాతఃస్మరణీయుడైనచెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు,1950 ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినమున శివసాయుజ్యాన్ని పొందారు.

●●●●●●

కామెంట్‌లు లేవు: