24, ఫిబ్రవరి 2022, గురువారం

వేదోదితం స్వకం కర్మ

 

శ్లో॥ వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాదతంద్రితః |

తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిమ్ ||

 (వ్యాసః) వైదికము, సనాతనము, ధర్మశాస్త్ర సమ్మతము అగు స్వధర్మమును అనుష్ఠించుటయే సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు అగు భగవంతుని మహత్తరమైన సపర్య అనగా అతని పూజయే అగును. అది మానవునికి శ్రేయమును అనగా మేలును, శుభమును చేకూర్చును. అందుకే గీతలో భగవానుడు స్వయంగా అంటాడు - 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః | (18–46) (తన స్వధర్మాచరణముద్వారా పరమేశ్వరుని పూజించుటవలన మానవుడు పరమసిద్ధిని పొందును.) ఇందువల్లనే నిత్యములు, నైమిత్తికములు అనెడు కర్మలను ఆచరించుట ప్రతివ్యక్తికి పరమధర్మమనియు, ముఖ్యకర్తవ్యమనియు వేదాది సమస్త శాస్త్రములయందు చెప్పబడియున్నది. ప్రతి వ్యక్తికి మూడు విధములగు ఋణములు ఉండును- 1. దేవఋణము 2. ఋషిఋణము 3. పితృ ఋణము “యత్కృత్వా నృణ్యమాప్నోతి దైవాత్ పైత్ర్యాచ్చ మానుషాత్ '' అని చెప్పినట్లుగా నిత్యకర్మలను చక్కగా ఆచరించుటవలన మానవుడు ఈ త్రివిధ ఋణములనుండి విముక్తుడై పోవును.

తమ జీవితపర్యంతము అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యము యథాధికారముగా స్నానము, సంధ్యా, గాయత్రీజపము, దేవతార్చనము, వైశ్వదేవ-బలి, స్వాధ్యాయము ఇత్యాది నిత్యకర్మలను ఎవరు ఆచరించెదరో, వారి బుద్ధి ఆత్మయందు నిశ్చలమగును. బుద్ధి ఆత్మనిష్ఠమైన మీదట నెమ్మది - నెమ్మదిగా మనిషి బుద్ధిలోగల భ్రాంతి, జడత్వము, వివేకహీనత, అహంకారము, సంకోచము మరియు భేదభావము నశించిపోవును. అప్పుడు ఆ వ్యక్తి పరమాత్మచింతనలో నిమగ్నుడగును. తదనంతరము అతడు అహర్నిశములు పరబ్రహ్మయగు పరమేశ్వరుని సాక్షాత్కారమును పొందుటకై ప్రయత్నము చేయుచుండును. తద్వారా అతనికి పరమానందము యొక్క అనుభూతి కలుగుచుండును. పరమానందముయొక్క అనుభూతి లభించిన మీదట ఆ వ్యక్తికి పరమాత్మ యొక్క వాస్తవికమైన తత్త్వజ్ఞానము యొక్క పరిజ్ఞానము అనుభవమునకు వచ్చును. అప్పుడతడు శాశ్వతమైన

జీవన్ముక్త స్థితిని చేరుకొనును. చివరగా, 'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ'లో పరినిష్ఠితుడై ఆత్మోద్ధరణము గావించుకొనును. ఇదియే విశిష్టమైన మానవజీవితమునకు సర్వోత్కృష్టమగు సార్థకత. కావున మానవజన్మమును సఫలమొనర్చుట కొరకై మానవమాత్రుడైన ప్రతివ్యక్తి నిత్యకర్మలను నియమానుసారముగా ఆచరింపవలయును.

నిత్యకర్మలలో కొన్నింటిని ప్రతివ్యక్తి సంతోషపూర్వకంగా నియమితరూపంగా చేయవలసివచ్చును. ఉదా: శౌచాది క్రియలు, స్నానము, భోజనము, శయనము మున్నగునవి. అయితే ఈ కర్మలన్నియును శాస్త్రమర్యాదను అనుసరించి జరుగవలయును. అప్పుడే అవి ధర్మాచరణముగా రూపాంతరమునొందును. జీవితంలోని అతిసామాన్యమైన, సర్వసాధారణమైన క్రియా-కలాపములనుగూర్చి కూడా శాస్త్రములు చక్కగా వివేచనము చేసి, ఒక నియతముగా తమ సమ్మతిని ప్రకటించినవి. ఉదయము నిద్రనుండి మేల్కొనుట ఎప్పుడు? మేల్కొనిన తర్వాత మొట్టమొదటగా ఏమి చేయాలి? ఇందుకుగాను శౌచము, దంతధావనము, క్షౌరము, తైలాభ్యంగము, స్నానము, వస్త్రధారణము, భోజనము, శయనము మొదలగు వాటినన్నింటిని గూర్చిన విధి-నిషేధములను తెలియజేసినవి. కావున శాస్త్ర మర్యాదను

అనుసరించి జీవనమును కొనసాగించుటయే శ్రేయపథమునకు దిక్సూచియగును.


కామెంట్‌లు లేవు: