🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌷శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ🌷
*ముందు సీటు! ( పాతదే)*
🌷🌷🌷
రాజ్యం పుట్టిపెరిగిన వూళ్ళో, ఊరంతటికీ రెండే రెండు కార్లుండేవి. ఒకటి జమిందారుగారిది. మరొకటి మునసబుగారిదీ! రాజ్యం తండ్రి నడిపే అరుగుబడి ముందునుంచే ఆ కార్లు పట్టణంలోకి వెళ్తూ ఉండేవి. ఇంచక్కా కారులో సవారీచేస్తూ... కాన్వెంటు బడులకెళ్ళే వాళ్ళ పిల్లలనూ, ఆ రాజహంసల్లాంటి కార్లనూ చూసి రాజ్యం కళ్ళు ఆశతో మెరిసేవి.
వయసొచ్చాకా తను చదివిన నవలల్లో నాయిక... హీరోగారి పక్క ముందుసీటులో కూర్చుని .. సుదూరతీరాలకు కారులో ప్రయాణిస్తూ... కధను సుఖాంతం చెయ్యడం ఆమెలో మరిన్ని మధురోహలు రేపేవి.
తనకు భాస్కరం పెళ్ళిసంబంధం వచ్చినపుడు....భార్యపోయిన అతను, అతనికున్న ఇద్దరిపిల్లలూ ఆమెకు అభ్యంతరకరంగా అనిపించలేదు. ఆమెకళ్ళన్నీ పెళ్ళిచూపులకొచ్చిన అత్తగారు , భాస్కరం దిగిన అంబాసిడర్ కారు మీదే!
పెళ్ళిలో... అతనితో ఊరంతా కారులో ఊరేగాలన్న ఆమె కోరిక ఆవిరయిపోడానికి ఎన్నో గంటలు పట్టలేదు! స్థోమతులేని మావగారు గుళ్ళో పెళ్ళి చెయ్యడమేంటి....మరునిమిషంలో..తల్లీ, నీళ్ళోసుకున్న చెల్లెళ్ళనూ, మరిద్దరు పెద్దలనూ కార్లోపంపేసి..... రాజ్యాన్ని బస్సులో తమ ఊరు తీసుకుపోయాడు భాస్కరం!
పెద్దగా ఆరళ్ళు లేకపోయినా పెత్తనమంతా అత్తగారిదే! తనకొడుకుతో సహా ముగ్గురు పిల్లలనూ సాకడం, పాడి, పంట ఒబ్బిడి చెయ్యడం, వంటిల్లూ, పాలేర్ల తిండ్లూ, మరుది, ఆడపడుచులకు మూటలుకట్టి పంపడం... గానుగెద్దు జీవితమే!
అప్పుడప్పుడూ ఆటవిడుపులా పెళ్ళికో, పేరంటానికో... కార్లో వెళ్ళే అవకాశం వచ్చినా... డ్రైవింగ్ చేసే భాస్కరం పక్కసీటు అత్తగారిదే.... సౌకర్యంగా... విశాలంగా ఉంటుందని. మరో నలుగురితో వెనుకసీట్లో ఇరుకిరుకు సవారీయే రాజ్యానికి ప్రాప్తంగా ఉండేది!
అత్తగారు కాలం చేసాకా, ఆస్తుల పంపకాలయిపోయాకా, పిల్లలు గూడొదిలి తలో దిక్కుకూ వెళిపోయాకా... రాజ్యం ధైర్యం చేసి ఒకరోజు భాస్కరం దగ్గర తన కోరిక వెలిబుచ్చింది. " ఏవండీ! అన్నవరం వెళ్దామేంటి కారులో!"... అంటూ! ఆమోదంతో... వెంటనే చెల్లెళ్ళకు ఫోన్ చెయ్యబోతున్న అతని చెయ్యి పట్టుకుని ఆపి... అభ్యర్ధనగా... " మనిద్దరమే! మీ పక్కన నేనే కూర్చోవాలి!"... సగం సిగ్గూ మరి సగం మొహమాటంతో అంటున్న భార్యకేసి వింతగా చూసాడు! అలాగే అని ఒప్పుకున్నాడు! కానీ మరునాడు ఉదయమే మాటతప్పాడు! తను వేరే శాస్వతప్రయాణం పెట్టుకుని వెళ్ళిపోయాడు!
ఆతరవాత రాజ్యం జీవితం ఓ పదేళ్ళ పాటూ కార్లలోనే గడిచిపోయింది వూర్లు తిరుగుతూ. కూతురూ, కోడళ్ళ పురుళ్ళు, వాళ్ళ పిల్లల ఆలనా పాలనలూ, పండగలూ, పేరంటాలతో! అయితే ఏ ఒక్కసారీ రాజ్యం ముందుసీట్లో కొడుకుల పక్కన కూర్చోలేకపోయింది. తనకన్నా రెండొంతులు వలంగా ఉండే కోడళ్ళు ... అత్తగారు ఎక్కడ ముందుసీట్లో కూర్చుంటుందో అని ....గబగబా ....ముందే పరుగెట్టీ భర్తల పక్కన ఉస్సురంటూ కూలబడేవారు.... రాజ్యాన్ని తమ పిల్లలతో వేగడానికి వెనుకసీట్లో కుదేస్తూ! పాపం కూతురు సవితిపిల్లయినా... " అమ్మా! ముందుసీట్లో హాయిగా ఏసీకి ఎదురుగా కూర్చో"... అని కారు ముందుతలుపు తీసేది! "అల్లుడి పక్కన ఎలా కూర్చోగలను! మర్యాదకాదు!"... అనుకుంటూ రాజ్యం బిడియపడి కూర్చునేది కాదు.
ఓరోజు తనింట్లో తోటపని చేసుకుంటోంది రాజ్యం! వీధి గుమ్మం దగ్గర కారాగింది. తన కొడుకు బేగ్ పట్టుకుని ఒంటరిగా దిగాడు. అమ్మ మీద దిగులుగా ఉండి వచ్చానన్నాడు. ప్రశ్నలెయ్యడం రాని రాజ్యం పరమానంద పడిపోయింది. పిల్లాడున్న పదిరోజులూ పదిక్షణాల్లా గడిచిపోయాయి.
అబ్బాయి తన బాల్యం గురించి చెప్పమన్నాడు. కన్నకొడుకు ఆటపాటలు ఏం చూసిందని తను.... ఏమన్నా చెప్పడానికి! కానీ తన బాల్యమంతా చెప్పింది. మాటల్లో తన కారు సరదా కూడా చెప్పింది. పిల్లాడు ఆశ్చర్యపోయాడు...అమ్మకు ఇంత చిన్న కోరిక కూడా తీరలేదా! .... అనుకుంటూ! మనసులోని ఆర్ద్రత కళ్ళల్లోకి తెచ్చుకున్నాడు.
" నడమ్మా! కారులో నా పక్కనే కూర్చో! హైదరాబాద్ తీసుకెళ్తా! ఊరంతా చూపిస్తా! యాదాద్రి చూపిస్తా! చార్మినార్ బజార్ల రంజాన్ సందడి చూద్దాం. నీకోడలు లేదులే. అలిగి పుట్టింటికి వెళ్ళింది పిల్లలతో! ముందు సీటంతా నీదేనమ్మా! హాయిగా ఆరామ్ సే కూర్చుందువుగాని. బోల్డు కబుర్లు చెప్పుకుందాం! వెళ్తూ...సూర్యాపేటలో మంచి లంచ్ చేద్దాం! బయలుదేరమ్మా".... పిల్లాడు ఆప్యాయంగా తల్లి చెయ్యి పట్టుకున్నాడు.
పట్టుకోవడమే కాదు... ఓ వారంరోజులు తన పనికి శెలవుపెట్టి... తల్లిని మహానగరమంతా తిప్పి చూపించాడు. మంచి మంచి హోటల్స్ కు భోజనానికి తీసుకుపోయాడు. పెద్ద పెద్ద మాల్స్ లో " అమ్మా ఇవి కొనుక్కో అవి కొనుక్కో"... అంటూ అమ్మకు ఉపయోగపడేవి బోలెడు కొని పడేసాడు.
కొడుకు పక్కన మహారాణిలా ఊరంతా ఊరేగిన రాజ్యం మనసు సంతృప్తితో నిండిపోయింది. తన జీవితమంతా ఆక్రమించిన ఆ చిన్నికోరిక ఇంత సంతోషంగా తీరిపోయింది! కోడలితో మాట్లాడి ఇద్దరికీ సయోధ్యచేసింది. కొడుకుతో తన వూరికి తిరుగు ప్రయాణమయింది.
అరవైఏళ్ళ వయసు! బయటతిళ్ళు అరాయించుకోలేని అనారోగ్యం. ఒక్కసారి గుండెల్లో చివ్వున లేచిన మంట! భరించలేని నాసియా! వెనక్కు వెళిపోదామంది. చుట్టూ వాహనాలు. అటో మైలూ-ఇటో మైలు... చుట్టూ అష్టదిగ్బంధనం! తల్లి పరిస్థితి చూసి... వైద్యసహాయానికి పిలిచాడు కొడుకు. కొద్ది సేపటికే వచ్చిచేరిన వైద్యసిబ్బంది .... అంబులెన్స్ తో కనుచూపుమేరలో! కానీ కాలు బయట పెట్టలేని నిస్సహాయత!
రాజ్యం కొడుకు ఆందోళనను కళ్ళతోనే వారించింది. తనను పొదివి పట్టుకున్న కొడుకు భుజం మీద తలవాల్చింది! చుట్టూ వాహనాల మధ్య తను! కారు ముందుసీటులో... తన కొడుకుతో! రాజమాతలా! ఊరేగింపుగా పోతున్నట్టు! మరి కళ్ళు తెరవలేదు రాజ్యం! కళ్ళుతెరిచి ...వేచి చూసే ఆశలేవీ మరిక లేదనుకుందో ఏమో!
ధన్యవాదాలతో
ఓలేటి శశికళ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి