కచ్ఛపేశ్వరుడు - కంచి
పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని కొల్ల చత్రంలో చాలా రోజులపాటు మకాం చేశారు. ప్రతిరోజూ కచ్ఛపేశ్వర దేవాలయ కొలనులో స్నానం చేసేవారు. కార్తీక సోమవారాలలో ఆ కొలనులో స్నానాదికాలు చెయ్యడం ఎంతో పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి.
అలా ఒకనాటి కార్తీక సోమవారం రోజు పరమాచార్య స్వామివారు కొలనులో స్నానం చేసి, దైవదర్శనం కోసమని దేవాలయంలోనికి వెళ్ళారు. చెన్నై నుండి వచ్చిన ఒక భక్తుడు కూడా ఇతర భక్తులతో మహాస్వామివారి వెంట వెళ్తున్నాడు. అతను ఎకామ్రేశ్వర దేవాలయానికి వెళ్ళవలసి ఉన్నందున మహాస్వామివారి వద్ద నుండి సెలవు కావాలని ప్రార్థించాడు.
“ఈరోజు కార్తీక సోమవారం. ఇటువంటి రోజున శివాలయంలో పరమశివ దర్శనం అత్యంత పుణ్యప్రదం. కాంచీపురంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఎన్ని వీలైతే అన్ని శివాలయాలను దర్శించుకో. నాకు వయస్సు అయిపొయింది. కాబట్టి నేను అన్ని ఆలయలాను దర్శించలేను. ఈ పృథ్వీ క్షేత్రమైన కంచిలో అత్యంత పురాతన దేవాలయంగా ఈ కచ్ఛపేశ్వర దేవాలయాన్ని చెబుతారు. ఈ దేవాలయ నిర్మాణము, ప్రతిష్ట జరిగిన తరువాతనే ఎకామ్రేశ్వర దేవాలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. కచ్ఛపేశ్వరుడు వెలసి ఉండడం వల్ల ఈ కాంచీపురానికి కచ్చిముదూర్, కచ్చి ఏకాంబరం అను పేర్లు కూడా కలవు. ఆ ‘కచ్చి’యే సంస్కృతమున ‘కంచి’గా మారిందని చెబుతారు” అని సెలవిచ్చారు స్వామివారు.
ఆ చెన్నై భక్తుడు గొప్ప విద్వాంసుడు. పరమాచార్య స్వామివారు చెబుతున్న విషయాలను విని అమిత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతటి గొప్ప చారిత్రిక విషయాలను స్వయంగా స్వామివారి నుండే వినే భాగ్యం పొందాడు. స్వామివారి ఆంతరంగిక సహాయకులకు తెలుసు. స్వామివారికి కంచి చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర కూడా తెలుసని.
--- శ్రీ మఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్ 3
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి