19, జనవరి 2023, గురువారం

మీరొస్తారని

 మీరొస్తారని...


నీ తల్లికి దూరమాయే

నీ ఊరుకి దూరమాయే

నీ తల్లి కన్నీరాయే

నీ ఊరు సిన్న బోయే.


నినుగన్న తల్లి పెంచేలే

పుట్టిన ఊరు బలమునిచ్చేలే

అమ్మను మరిచి

ఊరమ్మను వదిలావా.


పల్లెలోని ఇళ్లు బోసిపోయాయి.

ముసలి కాళ్ళు ఈడుస్తుంటే

రచ్చబండ రాయిలా

కనిపిస్తుంటే... 

ఏమయ్యి పోయావు

నీవు మరిచిపోయావా...


బాల్యమంత ఆడి పాడావా

చెరువులు మావే అన్నావా

కుంటలు మావే అన్నావా

పొలంగట్ల పైన ఆటలాడావా

పల్లెతల్లి ఒడిలో బిడ్డలయ్యారా.


పండగ రోజున అందంగా దిద్దావా

సంకురాతిరి సంబరం జేశావా

మట్టి బొమ్మలను పూజించావా

ఊయల పండగ ఊరేగేవా


వరసలు పెట్టి పలికి

అక్కాబావంటు

అత్తమామంటు

కూతురా కోడాల అంటూ

పిలుచు కున్నారా.


పొలాన ఏరువాక పండగ చేసావా

పంటకు కోతలు నూర్పులు జేసావా

పండిన పంటలు ఇంటముందు 

ధాన్యపు సిరులు జేసి

పల్లె పండగ జరిపారా.


పట్నం మోజులో

పల్లె విడిచి పరుగులు పెట్టి

వెళ్ళి పోయావా

బ్రతుకే భారమైయిందా...

నన్ను మరచి పోయావా.


బస్తీలో బందీ ఆయ్యావా

ఒంటరి బతుకు బ్రతికేవా

నీవు దూరంగా ఉంటేను

అమ్మ అల్లాడి పోతుందో.


కొడుకా కొమరయ్య

బిడ్డా లచ్చమ్మ 

పల్లెమ్మను నేనున్నా

సేద తీర రారండో...

నా చెంతన చేరండో...


అమ్మను మరువకు

ఊరమ్మను మరచకు

ఎదురు చూపులు

చూస్తున్నాము..



మీరొస్తారని....!


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

కామెంట్‌లు లేవు: