19, జనవరి 2023, గురువారం

వడ్డీ వ్యాపారం - వేద ధర్మం

 వడ్డీ వ్యాపారం - వేద ధర్మం


ఒకరోజు మహాస్వామి వారు మేనాలో కూర్చుని ఉన్నారు. ఎప్పటిలాగే చాలామంది భక్తులు మహాస్వామి వారి దర్శనం కోసం వేచియున్నారు. స్వామివారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు.


వారిలో శామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు. వరుసలో అతని వంతురాగానే మహాస్వామి వారు మేనా తలుపు వేసుకునారు. శామ మరియు అక్కడున్నవారందరూ నిరాశపడ్డారు. ఎందుకంటే శామ వల్ల వారికి దర్శనం లభించలేదు. అతను ఏదో తప్పు చేసి ఉంటాడు. కాని అతని కోసం అందరిని శిక్షించడం సబబు కాదు కదా.


అప్పుడు మహాస్వామివారి పరిచారకుల బంధువులొకరు వచ్చారు. అతను స్వామివారి ఆంతరంగిన శిష్యుడైనందువల్ల స్వతంత్రించి, మేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నవించాడు. కాని స్వామివారు మరలా తలుపులు వేసుకున్నారు. అరగంట గడిచిన తరువాత స్వామివారు మేనా తలుపులు తెరిచి యధావిధిగా దర్శనం ఇస్తున్నారు. వరుసలో మళ్ళా శామ వంతు వచ్చింది.


పరమాచార్య స్వామివారి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకుని గొంతుకు చుట్టుకుని బిగించసాగారు. వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్టుగా, “ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పుయొక్క వడ్డీ డబ్బులకోసం అందరి జీవితాలను పిండుతాడు. పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు. ఇతను అసలకు వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా? ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం? ఇలా వడ్డి వెయ్యడం న్యాయమా? అందుకే కొన్ని మతములయందు మత్తు పదార్థములు తీసుకొనుట, వడ్డికి డబ్బు ఇవ్వుట పాపం అని చెప్తారు. మరి అలాంటి పాపము చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించడు”


పరమాచార్య స్వామివారు మేనా తలుపు వేసారు. శామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు. స్వామివారి అంతరంగిక భక్తుడు కలగజేసుకుని మాహాస్వామిని ప్రార్థించారు. “అందరూ పరమాచార్య స్వామిలాగా ధర్మస్వరూపులుగా ఉండలేరు. తెలిసి తెలియక తప్పు చేస్తుంతారు. దయచేసి క్షమించండి. కోపం వలదు”


స్వామివారు శామాను పిలిచి మేనా దగ్గర కూర్చోమన్నారు. అతనితో, “అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కుని రావడం ఇక ఆపు. ఉన్నదాన్ని బ్యాంకులో వెయ్యి. అందునుండి వచ్చే వడ్డీ డబ్బులు నీకు సరిపోతుంది. డబ్బుకోసం పరిగెత్తడం బాధపడటం మానుకో. తరువాతి జన్మ మంచిగా ఉండేట్టు చూసుకొ. మిగిలిన సమయాన్ని పూజ, జపము, ధ్యానము, దేవాలయ దర్శనం చేస్తూ గడుపు” అని చెప్పారు.


శామ మహాస్వామి వారికి సాష్టాంగపడ్డాడు. “పెరియవ నా అజ్ఞానం తొలగిపోయింది” అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు.


పరమాచార్య స్వామివారు రాశీభూతమైన క్షమ, ఆత్మజ్ఞాన సంపన్నులు. వారి కరుణ అపారం.


--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ అనుభవాల సంగ్రహం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: