*మన వస్త్రం ఎలా ఉండాలి?*
మనం యజ్ఞ యాగాదుల్లో ధరించే వస్త్రాలు ఎలా ఉండాలి? వస్త్రానికి అంత ప్రాముఖ్యత ఉందా? అంటే ఉంది అనే చెప్పాయి శాస్త్రాలు..
*అగ్నేస్తూషాధానం వాయోర్వాతపానం పితృణాం నేవిరోషధీనామ్ ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీనతానో విశ్వేషాం దేవానామోతుర్న క్షత్రాణాం అతికాశాస్త్రద్వా ఏతత్సర్వ దేవత్యమ్ యద్వాసః॥*
యజమానికి 'వాససా దీక్షయతి' అను విధి ప్రకారం దీక్షా నియమాల్లో వస్త్రధారణ కూడా ఒక దీక్షా విశేషం.
ఆ వస్త్రం నేత కాలంలో ఒక్కో క్రియ ఒక్కో అభిమాన దేవతతో కూడి ఉంటుంది. వస్త్రం నేయడానికి ముందు నూలు చుట్టడానికి వాడే దారుమయ చిడప పేరు తూషం. అందులో నూలును చుట్టడం తూషావిధానం. దానిని వాయువుచే ఎండబెట్టడం వాతపానం. ఆ నూలును నిలబెట్టిన కర్రలకు ముడివెయ్యడం నీవి. ముడి వేసి ఉంచిన దారాలను శలాకంతో (చిక్కులు లేకుండా చేసే సాధనం) మర్దించడం ప్రహరణం. పొడుగ్గా ప్రసారం చేసిన దారం ఓతం. పడుగు పేకలో మధ్యనున్న చిల్లులే అతీకాశాలు. వస్త్రానికి అగ్ని, వాయువు, పితృదేవతలు, ఓషధిదేవతలు, విశ్వదేవతలు, ఆదిత్యదేవతలు, అభిమాన దేవతలని, ఓత ప్రోతాలకు మధ్యనున్న రంధ్రాలు నక్షత్ర దేవతాకమైనవి.
ఈ ప్రకారంగా సర్వదేవతాకమైన 'సదశమఖండం' ఇత్యాది శాస్త్రానుసారం అంచుతో కూడి, అఖండంగా ఉన్నా వస్త్రాన్ని తడిపి ఆరవేసిన దాన్ని, వేరొకరు తాకని దాన్ని ధరించి కర్మ ఆరంభానికి సంకల్పం చేయాలని శాస్త్రం.
కొందరు ఎరుపు, నీలి రంగు వస్త్రాలను ధరిస్తారు. మరి అలా ధరించవచ్చా అంటే ధరించకూడదు.
*సదశమ ఖండం శ్వేతం ధౌతం చ వస్త్రం ధారయేద్రక్తం నీలం మలినం చ వర్జయేత్॥*
అంచుతో కూడిన, మధ్యగా చీల్చబడిన, తెల్లగా ఉన్నటువంటి, శుభ్రంగా ఉతకబడిన వస్త్రాన్ని ధరించాలి. రక్త, నీలాది వర్ణాలున్న వాటిని ధరించకూడదు. ఇక్కడ గ్రహించదగినది ఏమిటంటే మాలిన వస్త్రాన్ని, రక్తనీలాది వర్ణాలున్న వాటిని ధరించకూడదని శాస్త్రకారులు చెప్పడమే కాదు, రజకులు వాడే నీలి రంగుతో పరిశుద్ధం చేయకూడదని. ఎందుకంటే, "నాస్యపల్పూలనేన వాసః పల్పూలయేయుః" అని నీలిరంగుతో వస్త్రాన్ని శుద్ధం చేయకూడదు. శుద్ధం చేయడంలో కూడా రాతిమీద ఉప్పళించడం శిష్టాచారం కానీ, 'సర్వదేవత్యం వై వాసః" అను శ్రుతి వస్త్రాన్ని సర్వదేవతాకమైనదిగా చెప్పడంచే పాదాలతో మాత్రం ఉతక కూడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి