30, మే 2023, మంగళవారం

పచ్చని పాల సముద్రం

 పచ్చని పాల సముద్రం


పరమాచార్య స్వామివారిని ప్రముఖ గీత రచయిత కన్నదాసన్ కలిశాడు. ఎప్పటిలాగే వారు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకున్నారు. ఇతఃపూర్వం కన్నదాసన్ నాస్తికుడుగా ఉండి మన మతం గురించి హేళనగా రాసేవాడు. మహాస్వామివారి ప్రభావం వల్ల మెల్లిగా మారిపోయాడు. స్వామివారే అతణ్ణి పనికిమాలిన హేతువాదం నుండి బయటకు తెచ్చారు. కాని విమర్శించడం అనే సామాన్య గుణం మాత్రం అతణ్ణి వదలలేదు.


“పాలు తెల్లగా ఉంటాయి కదా? మరి పాలకడలి ఎందుకు మేఘవర్ణంగా చూపబడుతుంది? మహావిష్ణువు రంగు పాలసముద్రంలో కలిసిపోయిందా?” అని అడిగాడు స్వామివారిని.


స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి, “ఆనందంగా ఉండు. మధ్యాహ్నానికి నీకు సమాధానం దొరుకుతుంది” అని చెప్పారు.


కన్నదాసన్ కలవరపడ్డాడు. ఇక ఏమీ మాట్లాడడానికి సాహసం చెయ్యలేదు. ఆ మాధ్యాహ్నం శ్రీమఠానికి వుమ్మిడి బంగారు చెట్టి వచ్చాడు. కన్నదాసన్, వుమ్మిడి ఇద్దరూ చెట్టియార్ కులానికి చెందినవారు. వాళ్ళ పద్దతిలో వారు నమస్కరించుకున్నారు. తరువాత వుమ్మిడి బంగారు చెట్టి పెద్ద పచ్చని మరకతాన్ని స్వామివారు స్వీకరించాలని పాదాల వద్ద సమర్పించాడు. మహాస్వామి వారికి రత్నాలకు రాళ్ళకు భేదం లేదు.


వెంటనే స్వామివారు మఠం పరిచారకులని పిలిచి ఒక పాత్రలో పాలను తెమ్మని చెప్పారు. పాలు తెచ్చిన తరువాత ఆ మరకతాన్ని పాలపాత్రలో ఉంచమని వుమ్మిడికి చెప్పారు. ఇది వుమ్మిడికి పిడుగులాంటి మాట. సాధారంగా మరకతాన్ని పరీక్షించడానికి ఇలా చెయ్యడం తనకు వ్యాపారంలో అనుభవం.


కంచి శ్రీచరణులు నా ఆలోచనల్ని, ఈ రత్నాన్ని శంకిస్తున్నారా? అని అనుకుని మౌనంగా ఆ పనిచేశాడు. వెంటనే ఆచరులు కన్నదాసన్ ను పిలిచారు చూడమని. అది చూసి కన్నదాసన్ ఆశ్చర్యపోయాడు. పలు మొత్తం లేత పచ్చ రంగులోనికి మారిపోయి, పాలలో మునిగిన మరకతం నుండి ఒక చిన్న కాంతిరేఖ కనపడుతోంది.


కన్నదాసన్ కు నోట మాట రావడంలేదు. ఇది ఎలా జరిగింది? ఆచార్యులవారు అలా జరగడానికి గల కారణాన్ని శాస్త్రీయంగా వివరించి, ఇలాగే పాలసముద్రం విషయంలో కూడా, “పరమాత్మ పాల సముద్రంలో పడుకున్నప్పుడు, ఆయన నుండి కూడా ఇటువంటి తేజస్సు వస్తుంది. అందుకే అది మేఘవర్ణంగా ఉంటుంది” అని తెలిపారు.


వెంటనే కన్నదాసన్ కళ్ళు వర్షించగా, అప్పటికప్పుడే “తిరుప్పార్కడలిల్ పళ్ళికొండాయే శ్రీమన్నారాయణా . . .” (ఈ పాటను 1975లో వచ్చిన స్వామి అయ్యప్పన్ అన్న తమిళ సినిమాలో కే. జే. ఏసుదాస్ గారు అద్భుతంగా పాడారు) అన్న అద్భుత గీతాన్ని వ్రాశారు.


వుమ్మిడియార్ కి, ఆచార్య స్వామివారు ఆశీస్సులు అందించి, ఆ మరకతాన్ని వరదరాజస్వామి దేవాలయానికి తీసుకునివెళ్ళి, దానితో స్వామివారికి మకుటాన్ని చేయించమని ఆదేశించారు.


కన్నదాసన్ తో పాటు అతను కూడా కళ్ళనీరు పెట్టుకున్నారు. స్వామివారు మరకతాన్ని పాలలో ముంచమని చెప్పినప్పుడు అవమానపడ్డాను అనుకున్నాడు. కాని అది రత్నాన్ని పరీక్షించడానికి చెయ్యమన్నది కాదని తెలిసి పశ్చాతాప్పడ్డాడు.


ఇలాంటి ఎన్నో సంఘటనలతో జనుల అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టే జ్ఞాన గురువులు మన స్వామివారు.


జయ జయ శంకర, హర హర శంకర


కే. జే. ఏసుదాస్ గారి అద్భుత గళంలో ఆ పాటను ఇక్కడ వినవచ్చు.

www.youtube.com/watch?v=npqGilN-7Os


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: