30, మే 2023, మంగళవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 75*

 .    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 75*


ఆనాడు రాక్షసమాత్యునికి అన్నీ దుశ్శకునములే ఎదురయ్యాయి. నందులతో సత్సంబంధాలు తగ్గిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు నందులకు బౌద్ధక్షిపణకుడు జీవసిద్ధి అత్యంత సన్నిహితుడైనాడు. అతని మాట నందులకు వేదవాక్కు. 


నందులు ఇప్పుడు రాక్షసుని మాటలకు విలువ ఇవ్వడం మానేశారు. "యధారాజా తథా ప్రజా" అన్నట్లు భలభద్ర, బాగురాయణాది ప్రముఖ రాజోద్యోగులు కూడా ఇప్పుడు రాక్షసునికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. ఇంకొకవైపు పాటలీపుత్రంలో నంద వ్యతిరేకత తీవ్రాతి తీవ్రమైంది. రాజగురువు సుబంధుడు వూరూవాడా తిరుగుతూ నందుల దురాగతాలను యండగడుతూ త్వరలో చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించి ప్రజల కష్టాలను తీర్చగలడంటూ ప్రచారాన్ని చేయసాగాడు. బ్రాహ్మణాది వర్ణాలన్నీ సుబంధుడికి బాసటగా నిలవడం చేత అతనికే హాని తలపెట్టినా ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుందన్న భయంతో సుబంధుడిని శిక్షించడానికి వెనకాడాడు రాక్షసుడు. 


ఇక చారుల వలన తెలుస్తున్న వార్తలు రాక్షసునికి మనశ్శాంతిని దూరం చేశాయి. చంద్రగుప్తునితో పాంచాల, సింహపుర దేశాధీశులు బాంధవ్యం కలుపుకుని తమ రాజ్యాలను అతనికి కట్టబెట్టారనీ, పర్వతక, కళింగ, ఆంధ్రరాజుల సహాయ సహకారాలతో చంద్రుడు మగధపై యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాడనీ, వారందరు కలిసికట్టుగా ఏ రోజైనా మగధపై దండెత్తి రావచ్చుననీ... వార్తలు మీద వార్తలు వస్తున్నాయి. 


ఆ వార్త విశేషాలన్నింటినీ, తన భయాలు సలహాలతో జోడించి రాక్షసుడు ఒకనాడు నందులకు తెలియపరచాడు. నందుల చెంతనే ఉన్న జీవసిద్ధి నవ్వి "మహాబలోపేతమైన మగధ పైకి దండయాత్రా ... ? ఆ వృషలుడికి అంత ధైర్యమా ? మా సుకల్పనందుడు ఒక్కసారి కన్నెత్తి చూస్తే ఆ కంటి మంటల జ్వాలకి శత్రుసైన్యాలన్నీ మాడి మసైపోవూ...?" అన్నాడు. 


రాక్షసుడికి ఒళ్ళు మండి "మంత్రాలకు చింతకాయలు రాలవు మహానుభావా... మనం కూడా యుద్ధ ప్రయత్నాలు చేసుకోవాలి. వాళ్ళు ఏ నిమిషాన్నాయినా యుద్ధానికి రావచ్చు" అన్నాడు వుక్రోషంగా. 


"రానివ్వండి చూద్దాం... ఇప్పటినుంచే యుద్ధ ప్రయత్నాలు ఏమిటి ? డబ్బు దండగ" అన్నాడు జీవసిద్ధి నిర్లక్ష్యంగా. నందులు అతన్ని సమర్ధించడంతో విధిలేక వెనక్కి తగ్గాడు రాక్షసుడు. 


ఈనాడు .... రాక్షసుని భయాలన్నీ నిజమయ్యాయి. ప్రాతఃకాలన్నే మేల్కొన్న అమాత్యునికి వరసగా అన్నీ దుశ్శకునాలే తారసిల్లాయి. 'వాటి పర్యావసానం ఏమవుతుందా ?' అని ఆలోచిస్తుండగానే ప్రతీహారి ఒకడు రాక్షసుని దర్శనం చేసుకొని "జయము, జయము అమాత్యులవారికి... నందప్రభువులు మంత్రాంగ మందిరంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమరిని తక్షణం రావాల్సిందిగా కోరుతున్నారు" అని మనవి చేశాడు. 


రాక్షసుడు సాలోచనగా తల పంకించి "సమావేశ విశేషాలు ఏమిటో తెలిపారా ?" అని అడిగాడు. 


ప్రతీహారి తలతిప్పి "లేదు..." అని చెప్పి ఓసారి అటూ ఇటూ చూసి "చంద్రగుప్త మౌర్యులవారి వద్ద నుండి యుద్ధసందేశం వచ్చినట్లు మంత్రులు గుస గుస లాడుకుంటున్నారు" అని చెప్పాడు తగ్గు స్వరంతో. 


రాక్షసుడు అదిరిపడ్డాడు. 


'అనుకున్నంతా అయ్యింది' అనుకుంటూ అతడు తక్షణమే రాజభావనానికి బయలుదేరాడు. మంత్రాంగం మందిరంలో వడివడిగా ప్రవేశించి అక్కడి సన్నివేశాన్ని చూసి నిర్విణుడయ్యాడు.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: