21, మే 2023, ఆదివారం

కర్తవ్యనిష్ఠ

 *కర్తవ్యనిష్ఠ*


పని చేయడంలో యంత్రానికి, జీవరాశికి తేడా ఉంటుంది. యంత్రానిది ఒక మూసలో పోసినట్లు యాంత్రిక పనితనమైతే, జీవులు చేసే పనిలో జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. గిజిగాడు సంక్లిష్టమైన తన గూటిని గడ్డిపరకలతో అల్లి నిర్మిస్తుంది. తన ముక్కును మాత్రమే పనిముట్టుగా ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో గూటి నిర్మాణం సాగిస్తుంది. సాలీడు తన గూటిని అకుంఠిత దీక్షతో ఒక అందమైన వలలా రూపొందిస్తుంది. కాలర్ టైలర్ బర్డ్ గుబురుగా ఆకులు ఉండే చెట్టును ఎంచుకుని, ఆ ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరచి, సాలెగూడు దారంలాంటి దానితో అందమైన గూడు నిర్మించుకుంటుంది. చీమ ఓపిగ్గా మట్టితో పుట్ట ఏర్పరచుకుంటుంది. కర్తవ్యనిష్ఠకు ఇవి ప్రకృతి మనకందించే కొన్ని ఉదాహరణలు. ఆయా జీవరాశులు కేవలం ఆ పనులకే ప్రసిద్ధం. మనిషి అలాకాదు. తాను ఎంచుకున్న ఏ పనిలోనైనా తనదైన ప్రత్యేకతను చాటుకోగలడు. ఎంచుకుని చేసేపనిని తదేక ధ్యానంతో పూర్తి కావించాలి.


ఏ కళాకారుడైనా తన పనిలో ప్రాణం పెడతాడు. అది చీర నేయడం, నగ చేయడం, చిత్రం వేయడం, నృత్యం చేయడం, పాట పాడటం.. ఇలా ఏదైనా కావచ్చు. అందుకే కళలకు అంతటి ప్రాధాన్యం, విలువా! తాము చేసే పనులను అత్యంత ఆసక్తితో చేసేవారు పరమ సిద్ధిని పొందుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. మనం చేసే ప్రతి పనీ మన స్వభావం మీద తనదైన ముద్రను వేస్తుంది. మనిషి వ్యక్తిత్వం మీద, శీలం మీద కర్మ చూపే ప్రభావమే అతడు ఎదుర్కోవలసిన శక్తులన్నింటిలోకీ అత్యంత శక్తిమంతమైనది అంటారు. వివేకానందులు. మనిషి తాను చేసే పని కేవలం ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి, సేవను చేయడానికో కాదని అది తన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసేదని గమనించి శ్రద్ధతో పనిచేస్తేనే అందులో లీనం కాగలుగుతాడు. పరిపూర్ణ ఫలితం పొందగలుగుతాడన్నది. వివేకానందుల వారి ఉద్బోదించారు. నంబి కురవ గ్రామవాసి అతడి వృత్తి వేంకటేశ్వరస్వామి వంటశాలకు కుండలు చేయడం. అందులోనే తలమునకలై స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయేవాడు. కుండలు చేశాక తన చేతికి అంటుకున్న మట్టిని పువ్వుల్లా చేసి కొయ్య వేంకటేశ్వరస్వామికి అర్పించేవాడు. అవి తనకు అత్యంత ప్రియమైనవని తొండమాన్ చక్రవర్తి సమర్పించే సువర్ణ పుష్పాలను పక్కకు తోనేనేవాడు శ్రీనివాసుడు. చక్రవర్తి నంబి దగ్గరకెళ్ళి ఆయన ముందు మోకరిల్లి వేంకటేశ్వరుడు అతడి పూలను ఇష్టపడటానికి కారణమేమిటని అడిగాడు. అదేమీ తనకు తెలియదని కుండలు చేయడమే తనకు తెలిసిన పని అన్నాడు నంబి. నిష్ఠతో పనిచేయడమే భక్తి అన్న భావనతో పరమాత్ముణ్ని మెప్పించిన నంబి- అందరికీ ఆదర్శప్రాయుడు. కర్మనిష్టుడైన మంత్రుల్లో


అప్పాజీ శ్రేష్ఠుడు. రాయల మీద ప్రీతికన్నా రాజ్యక్షేమమే ప్రధానం అని భావించాడు. నేడు మానవుడు చేసే పనిలో శ్రద్ధ, అంకితభావం, నైపుణ్యం కొరవడ్డాయి. సమయం, దనం పని ఫలితాన్ని పలచన చేస్తున్నాయి. పనిలో కృత్రిమత్వం - గోచరిస్తోంది. పని కూడా మోక్షమార్గానికి దారి చూపే భక్తి అని తెలుసుకుని చక్కని పనితనం చూపగలిగితే చాలు... ధన్యజీవులం అవుతాం.


- ప్రతాప వెంకట సుబ్బారాయుడు.

కామెంట్‌లు లేవు: