21, మే 2023, ఆదివారం

ఆగి ఒకసారి చూశారు

 ఆగి ఒకసారి చూశారు


మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది. మాది కులిత్తలై అగ్రహారంలోని శ్రీవైష్ణవ కుటుంబం. మేము శ్రీమఠానికి పెద్ద భక్తులం. మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఎప్పుడు యాత్రకు వచ్చినా మా ఇంట్లోనే బస చేసేవారు.


ఇది అరవైలలో జరిగిన సంఘటన అనుకుంటా. ఆ అగ్రహారంలో పిల్లాపాపలతో ఒక కుటుంబం ఉండేది. అక్కడి ప్రముఖులలో వారి కుటుంబం కూడా ఒకటి. వారు ప్రధానంగా ఏదో వ్యాపారం చేసేవారు. బాగా కలిసివచ్చి హాయిగా ఉండేవారు. వారిది అంతా ధార్మికమైన సంపాదన. చాలాకాలం పాటు హాయిగా సాగిన వారి జీవితాలలో హఠాత్తుగా సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. నేలపైన జుత్తు పెద్ద ఉండలుగా కనపడడం, వసారా మధ్యలో మానవ అశుద్ధము కనపడడము, అద్దాలు పగలడం వంటివి కనపడడం మొదలయ్యాయి.


ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. వీటితో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా బయటకు వెళితే చాలు వాళ్ళ బట్టలన్నీ చిరిగిపోయేవి. ఇది ఆడవాళ్ళ విషయంలో కూడా జరిగేది. ఇవన్నీ వినడానికి నమ్మేలాగా లేకపోయినా ఆ అగ్రహారంలో చాలామంది వీటీని ప్రత్యక్షంగా చూసారు.


తరువాత వాళ్ళు ఇదంతా చేతబడి వల్ల జరిగినది అని తెలుసుకున్నారు. వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు. కాని దీని పరిష్కారం కనిపెట్టలేక పోయారు.


ఆ సమయంలో మహాస్వామివారు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఆ అగ్రహారానికి కూడా వచ్చారు. స్వామివారికి ఆ అగ్రహారం ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్వామివారు అందరిని యోగక్షేమాలు విచారిస్తుండగా, ఆ వీధిలో నివసించే వారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి వారికి సహాయం చెయ్యవల్సిందిగా అడిగారు.


మాహాస్వామి వారు విషయం అంతా విన్నారు కాని ఏమి చెప్పలేదు.


తరువాతిరోజు స్వామివారు వారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా, చుట్టూ ఉన్నవారు ఆ ఇంటివైపు చూపించారు. మహాస్వామివారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోకి నేరుగా చూసి ముందుకు వెళ్ళిపోయారు.


ఆ ఒక్క చూపు ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నిటిని పారద్రోలింది. ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతబడి ప్రభావాలు పూర్తిగా మాయమైపోయాయి. కుటుంబంలో అందరికి ప్రశాంతత చేకూరింది. వారు మళ్ళా వారి వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు.


నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది. మహాస్వామివారి చూపులవల్ల ఎటువంటి క్షుద్ర శక్తి అయినా నాశనం చెయ్యబడుతుంది. అలాగే వారి కరుణా విలాసం భక్తులను రక్షిస్తుంది. ఆ చూపులకు ఎంతటి శక్తి అని ఇప్పటికి నాకు ఆశ్చర్యం వేస్తుంది.


--- శ్రీరామ్, కులిత్తలై అగ్రహారం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: