21, మే 2023, ఆదివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 66*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 66*


సుకల్పనందుడు కోపంగా చూస్తూ "మీరెందుకొచ్చారు ?" అని ప్రశ్నించాడు అసహనంగా. ఆయన కావాలనే, తాము 'తమ వెంట రావద్దని' చెప్పామన్న ఉక్రోషంతోనే అక్కడికి పనిగట్టుకు వచ్చాడని నందులకి అర్థమైపోయింది. 


"ఏం ? రాకూడదా ?" ఎదురు ప్రశ్నించాడు సుబంధుడు. తీక్షణంగా వాళ్లని చూస్తూ "ఇది నా ఆశ్రమం. దీనిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చాను" అన్నాడు పరుషంగా. 


ధర్మానందుడు పటపట పళ్లు కొరుకుతూ "ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇది నీ ఆశ్రమమని.... ? అంతఃపురాల్లో, రాజమందిరాల్లో, మాతో పాటు రాజభోగాలు అనుభవించినంత కాలం గుర్తుకు రాలేదా.. నీకో ఆశ్రమం వున్నదని...?" ప్రశ్నించాడు ఏకవచనంలోకి దిగుతూ. 


"మర్యాద... మర్యాద... స్వధంశ సంజాతుడినైన సద్బ్రాహ్మణుడిని... మర్యాదిచ్చి మాట్లాడండి" అన్నాడు సుబంధుడు ఆగ్రహంతో. 


జీవసిద్ధి నవ్వి "అంటే నందసోదరులు వర్ణసంకర సంజాతులనా ?" అని చణకు విసిరాడు. 


ఆ మాట విని నివ్వెరపోయాడు సుబంధుడు. ఆ మాట నందులకి 'ఎక్కడ తగలాలో అక్కడ' తగిలింది. సుబంధుడు చప్పున తేరుకుంటూ "నా ఉద్దేశ్యం అది కాదు" అన్నాడు గట్టిగా. 


"అది కాదా... ? మరేమిటి...? మా డబ్బుతో ధర్మశాల నడిపించి అక్కడ నీకు అగ్రాసనం పెట్టించుకుని మా ఖర్చుతో నీ గొప్ప చాటుకోవడమా ? డబ్బు మాది, అయినా మేము బ్రాహ్మణద్వేషులమటా... మా తిండి తింటూ మా దగ్గిర కుక్కలా పడుండే నువ్వు సద్భ్రాహ్మణుడివటా.... అంతేనా ?" రెట్టించాడు ధర్మానందుడు వెటకారంగా. 


"నోర్ముయ్... కుక్క గిక్క అంటే మర్యాద దక్కదు..." అరిచాడు సుబంధుడు ఆగ్రహంతో. 


"ఏం చేస్తావురా గుంటనక్కా ... నువ్వోక వేదవేదాంగ వేత్తవా...? నీకొక సమున్నత ఆసనమా... ? అసలు నువ్వు ఏనాడైనా వేదాలు వల్లించావా ? ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మిక, వైదిక శాస్త్రాల విషయాలు ఎప్పుడైనా మా ముందు ప్రస్తావించావా? ఏ ఒక్క శాస్త్రాన్నైనా మాకు నేర్పావా ? మాతో అధ్యయనం చేయించావా ? మీ నాన్న మీదున్న గౌరవంతో ఆయన పోయాక, ఫోన్లే పాపమని ఆయన పదవిని నీకు మేము కట్టబెట్టాం. అంతఃపుర నివాసంతో పాటు రాజభోగాలు కల్పించాం. మాతో సరిసమాన గౌరవాలను కల్పించాం. అదంతా మరిచిపోయి... బ్రాహ్మణాహంకారంతో మమ్మల్ని... మమ్మల్ని 'వర్ణసంకరులని' మాటతూల్తావా ? ఆ చాణక్యుడిని రహస్యంగా రప్పించి అతడితో 'మా వంశం నిర్వంశం అవుతుందని' ప్రతిజ్ఞలు చేయిస్తావా ?" అరిచాడు ధర్మానందుడు ఆవేశంతో. 


ఆ సరికొత్త ఆరోపణకి నివ్వరపోతూ "నేనా.... ?" రెట్టించాడు సుబంధుడు తీవ్రస్వరంతో. 


"మరి నేనా ... ?" కల్పించుకున్నాడు జీవసిద్ధి. తలతిప్పి అసహనంగా సుకల్పనందుని వైపు చూస్తూ "మహారాజా ! యుగధర్మాల గురించి సుబంధుడు మీకు బోధించాడో లేదో నాకు తెలియదు. త్రేతాయుగధర్మానుసారం పద్నాలుగేళ్లు వనవాసం చెయ్యాలని నిబంధన పెట్టింది కైక. అలాగే ద్వాపర ధర్మానుసారం పాండవులు పన్నెండేళ్ళు అరణ్య, ఒక ఏడాది అజ్ఞాత. మొత్తం పదమూడేళ్ళు వనవాసం చెయ్యాలని నిబంధన విధించారు కౌరవులు. కలియుగ ధర్మానుసారం అది పన్నెండేళ్ళు అయ్యింది..." అన్నాడు. 


"అంటే, కలియుగ ధర్మానుసారం పదహారేళ్ల క్రితమే ఈ ఆశ్రమాన్ని పాడుపెట్టి అంతఃపురానికి చేరుకున్న సుబంధుడికి ఈ ఆశ్రమంపై ఎట్టి హక్కు లేదు. దిక్కుదివాణం లేని నీవేశనాన్ని ' ఇల్లు ' లేని వాళ్ళు ఆక్రమించుకోవచ్చు... కనుక ప్రస్తుతం ఈ ఆస్తి, అంటే ఈ ఆశ్రమం జీవసిద్ధి గురుదేవుల వారిది" అని స్పష్టం చేశాడు ధర్మానందుడు. 


"అన్యాయం... అక్రమం... ఒక బౌద్ధ సన్యాసి మాయలో పడి మీ గురువుని నన్ను అవమానిస్తారా... ? ఒక సద్భ్రాహ్మణున్ని అవమానిస్తే దాని పర్యవసానం ఏమవుతుందో తెలుసా?" ఆక్రోశించాడు సుబంధుడు. 


"మహారాజా ! ఇది నా ఆశ్రమం అని తమరు నిర్ధారించారు. నా ఆశ్రమంలో, మీ సమక్షంలో ఏమిటీ గోల ... ?" విసుకున్నాడు జీవసిద్ధి అసహనంతో. 


సుబంధుడు రెచ్చిపోతూ "నాది గోలా... ? నా ఆస్తి కాజేయ్యడానికి నువ్వెవడివిరా...? నీకు ఆస్తిహక్కు కల్పించడానికి ఈ రాజుకేం హక్కుందిరా.... ?" అరిచాడు గొంతు చించుకుని. మరుక్షణం... 


సుబంధుడి చెంప చెళ్లుమనిపించాడు సుకల్పనందుడు. ఆ దెబ్బకి కెవ్వున ఆక్రందిస్తూ వెనక్కితూలిపడ్డాడు సుబంధుడు. అతని కళ్ళు బైర్లుకమ్మాయి. 


జీవసిద్ధి నొచ్చుకుంటూ "శాంతి... శాంతి... అహింసో పరమోధర్మః" అని ప్రభోదించాడు తధాగతుడు. "రాజా ! శాంతికి నిలయమైన మా ఆశ్రమాన్ని హింసాద్వేషాలతో కలుషితం కానివ్వడం మాకిష్టం లేదు. ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలుతుంది. రాజా ! మీరు శాంతించండి. ఆ వెర్రి బ్రాహ్మణుడిని ఇంతటితో వదిలేయ్యండి" అన్నాడు ధర్మపన్నాలు వల్లిస్తూ. 


సుకల్పనందుడు శాంతిస్తూ "తమరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం" అని చెప్పి ధర్మానందుడి వైపు తల తిప్పి "తమ్ముడూ ! నేటి నుంచీ ఈ సుబంధుడికి అంతఃపురం ప్రవేశాన్ని నిషేధిస్తున్నాం. ఇతడు ఇకముందు కోటలో గానీ అంతఃపురంలో గానీ కనిపించాడా... ? జాగ్రత్త" అని హెచ్చరించాడు కఠిన స్వరంతో.


సుబంధుడు చివాల్నలేచి నందులనూ, జీవసిద్ధిని కొరకొర చూసి విసవిసా వెళ్లిపోయాడు.


జీవసిద్ది నిటూర్చి " చూశావా రాజా ! కలుగులోని ఎలుకల్లాగ మీ విరోధులు ఒక్కొక్కరే ఎలా బయటపడుతున్నారో... మొన్న చాణక్యుడు. ఈవేళ సుబంధుడు. ఇలాంటి గాది క్రింద పందికొక్కులు ఇంకా ఎందరున్నారో... ?" అన్నాడు సాలోచనగా. 


నందులు ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు. అందరూ జీవసిద్ధి వైపు భయంగా చూశారు. 


'భయంలేదు. నా రక్షణ మీకున్నంతవరకూ మీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నిశ్చింతంగా ఉండండి" అంటూ అభయప్రదానం చేస్తూ చెయ్యెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు జీవసిద్ధి. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: