సరస సంభాషణం !
" ఎక్కడి యూరు? కాల్నివకూరికిఁ బోయెద నంచుఁ బల్కె దీ
వక్కట! మీ కుటీర నిలయంబులకున్ సరిరాక పోయెనే ?
ఇక్కడి రత్న కంథరము ,లిక్కడి నందన చందనోత్కరం,
బిక్కడి గాంగ సైకతము లిక్కడి యీ లవలీ నికుంజముల్!
మనుచరిత్రము- ద్వి: ఆ: అల్లసాని పెద్దన;
సరస సంభాషణా చతురుడు అల్లసాని పెద్దన. ప్రవర వరూధినీ సంవాద ఘట్టంలోని యీపద్యాన్ని బహు సరసంగా విరచించి పాఠకులకు రసానందాన్ని పంచిపెట్టా డు.
విరసుడైన, పరమ కర్మిష్ఠుడైన బ్రాహ్మణ గృహస్తు ప్రవరుడు. పరమ శృంగార పరాయణియైన జాణ వరూధిని.
వరూధిని దారితప్పివచ్చిన ఆబ్రాహ్మణుణ్ణి వలచింది. ఆతని కా, తలపే లేదు. తిరస్కరించాడు. మావూరికి దారిచెప్పవమ్మా వెళ్ళిపోతాను. అంటూ బ్రతిమాలటం మొదలు పెట్టాడు.
ఎలాగైనా దారికి తెచ్చుకొని ప్రవరునితో తన వలపు పండించుకోవాలని వరూధిని తలపోసింది. అందుకు అనుకూలంగా తియ్యనిగొంతుతో సరస భాషణ చేస్తూ యిలా అంటోంది.
" ఏమయ్యా! మహాను భావా! మావూరో మావూరో అంటూ కలవరిస్తున్నావు. మీవూరేమైపోదులే. చూడవయ్యా?చూడు.ఎం త అందమైన ప్రదేశమో! చుట్టూ మణిమయ కంథరాలతో నిండిన పర్వతాలు, వాటిప్రక్కనే
విస్తరించిన నందనవనాలు, ఆవనాలలో విస్తరించిన చందన వృక్షాలు, వాటి చెంతనే జలజల పారే గంగానదీ తోయాలు. ఆనీటి
చాలుననే విస్తరించిన నదీ సైకతాలు, ఆసైకతాల కిరువైపులా అల్లుకొనిన లవలీ నికుంజాలు, ( లవంగ తీగెలతో నల్లుకొనిన పొదలు.
లవంగములు సువాసనలను విస్త రిస్తున్నాయి. వాటివాసన మన్మధోద్దీప్తము) యింత అందమైన ప్రదేశం నీకు నచ్చలేదా? అక్కడేమున్నదయ్యా మీవూరిలో? పేడకంపు కొట్టేయిల్లు. పొగచూరు వాసన గొట్టే పెళ్ళాం? ఇంతే కదా అక్కడున్నది. అంటోంది. నిజానికి అంతే శ్రోత్రియులగృహములు నిత్యం
గోమయంతో అలుకుతారు.ప్రవరునిభార్య వంటయింటికి పరిమితం"వండనలయదు వేవురు వచ్చిరేని "కాబట్టి పొగచూరి యుండటం.
పెద్దన కవితా కేన్వాసు మీద ఒక అద్భుత మైన చిత్రాన్ని గీశాడు. దాన్ని ఊహాచక్షువులతో వీక్షించాలి.చుట్టూ
ఎత్తైన హిమగిరి కంథరాలు. లోయలలో నందన వనాలు. ఆవనాలలో చందన వృక్షాలశోభలు. గిరిశిఖరాలనుండి జలజలపారే
గంగాప్రవాహం. దరులలో విస్తరించిన సైకత సీమలు. వాటి దాపుననే లవలీ నికుంజాలు. ఆహా! ఎంత సుందర దృశ్యం! అక్కడ
అందాల అప్సరస వరూధిని!ఆమె రారమ్మనే (పొందుకోసం) ఆహ్వానం!
ఇంత బంపర్ ఛాన్సు వచ్చినా యించుకంతైనా చలింప లేదు ప్రవరుడు. అందుకే ఆయన ధీరుడయ్యాడు. మనుచరిత్రము విఫల ప్రేమకు శ్రీ కారం చుట్టినా, మనోజ్ఙమైన ఆసంభాషణలు, వర్ణనలు ,మనహృదయాన్ని
సమాకర్షించి ఊహాలోకాలలో విహారం చేస్తూ కావ్యానందాన్ని (రసానందాన్ని) పొందుతాం. అందుకే మనుచరిత్రము ఉత్తమ
ప్రబంధంగా వాసిగాంచింది.
స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి