శుభోదయం🙏
*చేంబ్రోలు యాజులు గారు*
(విస్మయపరచే కథ!!)
🌹🌹🌹
ఆయనను అందరూ యాజులుగారు అని పిలిచేవారు. పూర్తి పేరు తెలిసిన వారు జీవించి ఉన్నది. ఒక్కరే ! ఆవిడ నోరు తెరిచి ఆ పేరును చెప్పి దాదాపుగా ఐదు పుష్కరాలు అయి ఉంటుంది. అది కూడా పెళ్ళి లో గడపల దగ్గర అమ్మలక్కలు లోపలకి రాకుండా అడ్డం పడితే గత్యంతరం లేక సగం నమిలి సగం మింగేసి చెప్పింది. ఆ అమ్మలక్కల ఇకయికలలో ఎవరికైనా వినిపించిందో లేదో!
ఆయన వేదము, జ్యోతిషము నేర్చుకున్నాడు. అన్నిటినీ మించి తల్లి దగ్గర చిన్నతనంలో ఉపనయనం అవగానే బాల ఉపదేశం పొందాడు. ఆయన ఇల్లు కదిలేది చాలా సకృత్తు. మిగిలిన రోజులలో ఆయన సర్వస్వమూ బాలయే! తెల్లవారుఝామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని బావి దగ్గర స్నానం చేసి నిత్యానుష్ఠానం, ఆ తరువాత బాల! ఎంత పునశ్చరణ చేశాడో ఆయన ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు. యధావిధిగా హోమాలు, తర్పణాలు, అన్న వితరణ లెక్కకు మిక్కిలిగా చేశాడన్నది లోకులు అత్యంత భక్తి తో చెప్పుకునేవారు. ఆయన పర్వదినాలలో సూక్ష్మ శరీరంతో ఉదయం గోదావరి తీరానికి వెళ్ళి స్నానము చేసి వస్తారని శ్రోత్రియ సమూహాలలో విస్మయాశ్చర్యాలతో చెప్పుకునేవారు.
🌷🌷🌷
మధ్యాహ్నం ఒంటిగంటకు మధ్యాహ్న అనుష్టానం పూర్తి చేసి సోమిదమ్మ గారు వడ్డించిన భోజనం క్లుప్తంగా చేసి రెండు గంటలు విశ్రమించాక బయటకు వచ్చి అరుగు మీద కూర్చుని అప్పటికే ఆయన కోసం వచ్చిన జనులకు ముహూర్తాలు, జాతకం వేసి ఇవ్వడం, పెళ్ళిళ్ళ సంబంధాల గురించి సలహాలు ఇవ్వటం, వగైరా పనులలో సమయం తెలియకుండా పొద్దు పొడిచేది. ఆయన ఎప్పుడూ ఇంత ఇమ్మని అడిగేవాడు కాదు, వచ్చిన వారు కూడా ఎంత ఇమ్మంటారని కానీ, ఇదుగో ఇంత తీసుకోమనీ ఎప్పుడూ బలవంతం చెయ్యలేదు. అవతలకు వెళ్ళి గుమ్మం దగ్గర సభక్తికంగా వారికి తోచినదేదో తాంబూలం పెట్టి అక్కడనుండి సోదెమ్మ గారికి దణ్ణం పెట్టి వెళ్లి పోయేవారు.
ఆవిడ ఆ వచ్చిన నగదు తోటో, వస్తువుల తోటో సంసారం గుట్టుగా లాక్కుని వచ్చేది. వారి నలుగురు కుమారులు వారి మాతామహుల ఇంట్లో ఉంటూ నాన్నగారి బాటలోనే వేదం చదువుకుంటూ ఉండేవారు.
ఆయనకు ఉన్న ఆస్తి ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. అలాగని లేదని ఎప్పుడూ చింత పడినవాడూ కాదు. సోమిదమ్మ గారు కూడా మనకి లేదే అని అనుకున్న ఇల్లాలు కాదు.
ఆ యేడాది చైత్ర శుక్ల దశమి నాడు ఉదయమే ఆ గ్రామంలో కలకలం రేగింది. యాజులు గారి ఇంటికి రాచ పల్లకీ వచ్చిందని. రాజుగారి పట్ల గౌరవంతో ఎవరూ పల్లకీ చుట్టూ మూగే ఆలోచన చెయ్యలేదు పిల్లలతో సహా.
యాజులు గారు స్నానం ముగించుకుని అనుష్టానం ప్రారంభించబోతుండగా గడప దగ్గర నుంచి మర్యాద, అధికారం మేళవించిన గొంతుతో "చేంబ్రోలు యాజులు గారు ఉన్నారా అమ్మా?" అన్న వాకబు వినిపించగా ఆయన లేచి వచ్చారు "ఎవరు నాయనా ?" అంటూ బయటకు అడుగు పెట్టిన యాజులు గారికి సాయుధులైన రాజభటులు, అందమైన పల్లకీ, ఆ భటులపై అధికారి కనబడడంతో కొంచెం విస్తుపోయారు.
"పెద్దాపురం సంస్థానాధీశులు శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజులుం గారి దేవేరీ, శ్రీ శ్రీ శ్రీ బుచ్చి సీతాయమ్మ బహద్దూర్ రాణీ వారు తమను దర్శించడానికి వేంచేశారు. అనుమతి ఇస్తే లోపలకి వేంచేయగలరు" అన్నాడు ఆ అధికారి.
రాచ మర్యాద సరిగా తెలియక పోయినా "అయ్యో! తప్పకుండా రావచ్చు " అని తమ దగ్గర ఉన్న చాప, దానిమీద భార్య పట్టుచీర పరిచి ఆహ్వానించారాయన. రాణి గారు శిరసు వంచి ఇంట్లో ప్రవేశించి ఆయనను చూసి అప్రయత్నంగా రెండు చేతులూ జోడించి నమస్కరించింది. "దీర్ఘ సుమంగళీ భవ " అని ఆశీర్వదించారాయన.
అస్పష్టంగా వెక్కిళ్ళ శబ్దం ఆయన చెవుల పడింది
"అమ్మా ! మీరు ఎంతో దుఃఖంలో ఉన్నారు. నా ఆశీర్వచనం తర్వాత మీ దుఃఖం బహిర్గతం అయింది. అంటే మహారాజు ఆరోగ్యం గురించి చాలా ఆవేదన చెందుతున్నారన్న మాట. నా దగ్గరకు వచ్చారంటే వైద్యులు కూడా నిస్సహాయులై ఉండాలి. కానీ మీరు మా ఇంట అడుగు పెట్టిన ముహూర్తం ఆరోగ్య కారకుడైన సూర్యభగవానుడు ఉచ్ఛ దశలో ఉన్న వేళ. మహారాజు ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది" అన్నారు. మ్లానమైన మహారాణి ముఖంలో ప్రసన్న రేఖ తాండవించింది. సంకోచం వదలి ఆయన పాదాలు అంటి నమస్కరించింది.
రెండు గంటల తర్వాత జపం ముగించి బయటకు వచ్చిన యాజులు గారు అర్ధనిమీలిత నేత్రాలతో మృత్యుంజయ మంత్రం పునశ్చరణ చేస్తున్న రాణి గారిని చూసి తృప్తి గా తలాడించారు. జపంలోకి వెళ్ళే ముందు ఆయన రాణిగారికి మృత్యుంజయ మంత్రం ఉపదేశించి, "అమ్మా ! నా జపం గంట పట్టవచ్చు, నాలుగు గంటలూ పట్టవచ్చు. అంతవరకూ మీరు ఈ మహా మంత్రం మానవద్దు. నాకు నా ధ్యానం లో ప్రస్తుత సమస్యకు సమాధానం దొరుకుతుందని గాఢంగా నమ్ముతున్నాను. మాతాపితరులు పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించి, జపం మొదలు పెట్టండి. నేను మళ్ళీ వచ్చిన తరువాతే, నా గొంతు విన్నాకే మీరు కనులు తెరవండి" అని చెప్పారు.
సుగంధ ద్రవ్యాలు వేసిన చక్కెర నీళ్ళు త్రాగుతుండగా యాజులు గారు రాణి గారికి విపులంగా పరిస్థితి వివరించారు. "తల్లీ! ఇది ఎవరు చేయించి ఉంటారు అన్న మాట వద్దు. ఉగ్ర దేవతా ఉపాసనతో పాటు శాబర మంత్ర ప్రయోగం జరుగుతోంది. నెమ్మదిగా పనిచేసే విష ప్రయోగం కూడా జరుగుతున్నది. మీరు రాజా వారి శరీరం రంగులో మార్పు ఏమైనా గమనించారా?" అని అడిగిన ప్రశ్నకు రాణి ఉలిక్కి పడింది.
"అవును గురువుగారూ! నేను గమనించాను కానీ అస్వస్థత కారణంగా వచ్చినదని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను." సాలోచనగా తలతాటించారు యాజులు గారు. "ఎలాంటి విష ప్రయోగమైనా , దుష్ట మంత్ర ప్రయోగమైనా చల్లని తల్లి ఆ పరమేశ్వరి అనుగ్రహం ఉంటే ఏమీ చెయ్యలేవు తల్లీ! దీని కోసం సూర్య నమస్కారాలు, దుష్ట మంత్ర ప్రభావం అడ్డుకునేందుకు కాళి, ఆంజనేయుడు, లక్ష్మి నృసింహులను ప్రార్ధించుదాము. మీరు ప్రతి రోజు ఈ మృత్యుంజయ మంత్రం రాజా వారి దగ్గర కూర్చుని చేయండి. వారికి ఇచ్చే ఏ పదార్ధం అయినా క్షుణ్ణంగా తనిఖీ చేయించండి. మండలం తిరిగే సరికి రాజా వారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది".
"మీరు ఏమి చెప్తే అది చేస్తాను గురువుగారూ! మా ప్రాసాదంలో ఈ సూర్య నమస్కారాలు, జపాలు చేయించవచ్చునేమో?"
"ఒద్దమ్మా! ఈ విషయం ప్రయోగం చేయించిన వారికి తెలిస్తే మంచిది కాదు, ప్రత్యక్షంగా దాడి చెయ్యవచ్చు. నేను స్వయంగా ఇవన్నీ చేస్తాను. గోప్యత చాలా అవసరం తల్లీ!" "మరి ఇవన్నీ చేయడానికి, ద్రవ్యాలు , వాటిని సేకరించుకోవడానికి ధనం అవసరం కదా? నేను ఆ ధనం సమకూరుస్తాను"
"ఒద్దమ్మా! ఈ నేలను చల్లగా పరిపాలించే ప్రభువుల కోసం, వారి ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేయడం నా ధర్మం. మీరు మరేమీ ఆలోచించకుండా రాజా వారి దగ్గరకు వెళ్ళిపోండి. మిగిలిన వన్నీ అమ్మే చేయిస్తుంది".
సజల నయనాలతో మరొక సారి ఆయన పాదాలకు నమస్కరించి పల్లకీ ఎక్కారు రాణి గారు.
🌷🌷🌷
పట్టు పరుపు మీద ఎత్తైన బాలీసుకి ఆనుకుని అలసిన ముఖంలో కొద్దిగా చిరునవ్వుతో, రాణి గారు మంద్రంగా చెప్తున్న వివరాలను పటికబెల్లం, కుంకుమ పువ్వు, ఔషధ మూలికలు కలిసిన ఆవుపాలను త్రాగుతూ వింటున్నారు జగపతి రాయలు.
"ఐతే మీ గురుదేవుల మంత్రబలం చాలా శక్తివంతమైనదని అంటారు, అంతేనా?" కొంచెం పరిహాసం, కొంత గౌరవం కలగలిపి వ్యాఖ్యానించారు ఆయన.
"పరిహాసానికి కూడా వారి శక్తిని శంకించకండి ప్రభూ! మీరు ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నారు అంటే వారి భక్తి ప్రపత్తులే కారణం".
యాజులు గారు దీక్షలోకి వెళ్ళిన వారం రోజులలో రాజావారి ఆరోగ్యంలో మార్పు స్పష్టంగా కనబడింది. పదిహేను రోజులకు ఒత్తిగిలి పడుకోవడం, ఆసరాతో బాలీసును ఆనుకుని కూర్చోవడం చేశారు. ఈ మార్పులు బయటకు పొక్కనీయలేదు రాణీ గారు. నెలరోజులకు ఘన పదార్ధాలు కూడా తినగలిగారు రాజావారు. నలభై రోజులు పూర్తయ్యేసరికి తనంతట తాను లేచి నడవగలిగారు. శరీర వర్ణం పూర్వపు బంగారు వన్నెలోకి వచ్చింది. నలభై రోజులు పూర్తవగానే రాణీ గారు యాజులు గారికి సవివరంగా లేఖ వ్రాయించి నమ్మకమైన అనుచరుడికి ఇచ్చి పంపించారు.
రాజా వారు అత్యంత గోప్యంగా గూఢచర్యం చేయించి అంతర్గత శత్రువులని గుర్తించి ఎవరికీ అనుమానం రాకుండా మట్టు పెట్టించేశారు. ఇదంతా అయేసరికి దాదాపుగా ఐదు నెలలు పట్టింది.
ఆశ్వయుజ మాసం నవరాత్రుల అనంతరం యాజులు గారి ఇంట హడావిడి మొదలయ్యింది. ఈ సారి రాణిగారికి ఆతిథ్యం లో ఏ మాత్రం లోటు రాకుండా సోమిదమ్మ గారు స్వయంగా శ్రద్ధ తీసుకుని ఇంటిని తీర్చి దిద్ది ముస్తాబు చేశారు.
రాణిగారి పల్లకీ వచ్చే సమయానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి సమస్తం ఆవిడే చూసుకున్నారు.
యాజులు గారు అనుష్టానం ముగించుకుని వచ్చేసరికి ఆవిడ రాణిగారికి విసనకర్రతో విసురుతూ రాణిగారు చెప్పే వివరాలు వింటున్నారు.
యాజులు గారిని చూసిన రాణిగారు మ్రాన్పడి పోయారు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడే ఆయన శరీర ఛాయ నలుపులోకి మారింది. కాని కనులలో ఆ తేజస్సు మాత్రం అలాగే ఉంది.
"అమ్మా ! రాజా వారి మీద జరిగిన ప్రయోగం ఎంత జటిలమైనది అంటే దానికి విరుగుడుగా ఆ ప్రయోగాన్ని నా మీదకు త్రిప్పుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా!" అన్నారాయన రాణిగారి సందేహం తీరుస్తూ!
జల జల కారే కన్నీటిని తుడుచుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా ఆ దంపతులకు కాళ్ళకి మొక్కి నూతన వస్త్రాలు బహూకరించి పల్లకీ ఎక్కారు రాణి గారు.
వారం రోజుల తర్వాత వల్లూరు కరణం గారు యాజులు గారి ఇంటికి వచ్చి రాజా వారి వద్దనుంచి వచ్చిన ఫర్మానా చదివి వంద ఎకరాల భూమికి సంబంధించిన పట్టాను సగౌరవంగా అందజేశారు. విస్తుపోవడం ఆ దంపతుల వంతైంది.
*ఉపసంహారం*:
ప్రభువులు రాణి గారు వ్రాయించి తెచ్చిన దానశాసనం పూర్తిగా చదివి, భృకుటి ముడిచి "ఏమిటి రాణిగారి వితరణశీలత డెబ్భై ఎకరాలైంది?" అని అడిగారు.
రాణిగారు ప్రభువుల ముఖం లో అర్ధాలు వెతుకుతూ, "ప్రభువుల ఆరోగ్యం, నా సౌభాగ్యం ముందు ఏదీ ఎక్కువ కాదు ప్రభూ! రాణీగా నాకున్న పరిధి ప్రకారమే డెబ్భై ఎకరాలు వ్రాయించాను" అన్నది.
ఆవిడ ముఖకవళిక చూసి ఫక్కున నవ్వి ఆ శాసనం చేతిలోకి తీసుకుని డెబ్భైని వందగా మార్చి రాజముద్రిక వేసి తిరిగి ఇచ్చేశారాయన. "పూర్ణ సంఖ్య బాగుంటుందని అనిపించింది. పరిహాసం రాణి వారి మేధస్సుకి అందలేదా ?" అని మళ్ళీ కలకలమని నవ్వుతున్న శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు రాణీ శ్రీ శ్రీ శ్రీ బుచ్చి సీతాయమ్మ బహద్దూర్ వారు .
సేకరణ:నిష్ఠల సుబ్రహ్మణ్యంగారు.
🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి