7, జులై 2023, శుక్రవారం

ఖగోళశాస్త్రం

 నిత్యాన్వేషణ


ఖగోళశాస్త్రం


*నార్వేలో కొన్ని నెలలపాటు సూర్యుడు అస్తమించకపోవడానికి కారణమేమిటి ?*


ఎప్పుడైనా జాబిలిలో ప్రశాంతంగా కూర్చోని ఈ రాత్రి తెల్లారకపోతే ఎంత బాగుండు అనుకున్నారా? లేదా మీకు ఇష్టమైన పని ఏదైనా చేస్తూ, ఈ రోజుకి చీకటి పడకపోతే బాగుండు అని అనుకున్నారా? అయితే మీరు ఏదో ఒక ధృవపు ప్రాంతానికి వెళ్తే ఇలాంటి కలలు నిజమవుతాయి. అవును, ఎందుకంటే అక్కడ దాదాపు ఆరు నెలలు పాటు సూర్యుడు ఉదయించడు(ఉదయించినా అతి స్వల్పంగా ప్రకాశిస్తాడు), మరో ఆరు నెలలు పాటు సూర్యుడు అస్తమించడు.

ఎందుకు ఇలా జరుగుతుందని అని తెలుసుకునే ముందు కొన్ని ఖగోళ సంబంధమైన విషయాలు:

1. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి పైవైపు ప్రాంతాన్ని, అలాగే దక్షిణ అక్షాంశానికి కిందవైపు ప్రాంతాన్ని- ధృవపు ప్రాంతాలు అంటారు.

ఉత్తర ధ్రువ పరిధిలో ఉండే కొన్ని ప్రాంతాలను కలిగి ఉన్న దేశాలు- నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, అలస్కా, కెనడా, ఉత్తర సైబీరియా, గ్రీన్లాండ్.


దక్షిణ ధ్రువ పరిధిలో ఏ దేశానికీ చెందని, అంటార్కిటికా ఖండపు భూభాగం ఉంది.


2. భూమి, తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూభ్రమణం వల్లే భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలు, సూర్యుడికి అభిముఖంగా వచ్చినప్పుడు పగలుకి, సూర్యుడికి వ్యతిరేకముఖంగా వెళ్ళినపుడు రాత్రులకి మారతాయి. భూభ్రమణ అక్షం, నిటారుగా కాక కింది చిత్రం లో చూపిన విధంగా 23.5 డిగ్రీలు వాలుగా ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగేప్పుడు కూడా ఈ వాలు మారదు.


3. ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు అస్తమించని స్థితిని 'ధృవపు దినం' అంటారు. అలాగే పగటిపూట కూడా సూర్యుడు ఉదయించని స్థితిని 'ధృవపు రేయి' అంటారు.

4. విషువత్తు(equinox) అనగా రాత్రి, పగలు సమాన సమయాలు కలిగి ఉండు రోజు. ఈ రోజున సూర్య కిరణాలు భూమధ్యరేఖకు లంభంగా పడడంతో రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. మార్చ్ 21న వసంత విషువత్తు, సెప్టెంబర్ 23న శరద్ విషువత్తు సంభవిస్తాయి.

నార్వేలో కొన్ని నెలలపాటు సూర్యుడు ఎందుకు అస్తమించడు?


పై చిత్రంలో ఎడమవైపున ఉన్న గోళ దశ, డిసెంబర్ నెలలో భూగోళం ఉండే స్థితి. భూగోళ అక్షం 23.5 డిగ్రీలు వాలి ఉండడం వల్ల, ఆ సమయానికి ఉత్తర ధృవం- పైచిత్రంలో చూపిన విధంగా చాలా వరకు సూర్యుడికి దూరంగా చీకట్లో ఉంటుంది. అయితే దక్షిణ ధృవం మాత్రం సూర్యుడికి దగ్గరగా ఉండడంతో పాటు సూర్యునికి అభిముఖంగా ఉండటం గమనించవచ్చు. కాబట్టి భూభ్రమణం జరుగుతున్నప్పటికీ భూగోళ అక్షపు వాలు వల్ల దక్షిణ ధృవంలో సూర్యుడు అస్తమించడు మరియు ఉత్తర ధృవంలో సూర్యుడు ఉదయించడు. ఆ విధంగా ఒక ధృవంలో 'ధృవపు దినం' నడుస్తుంటే మరో ధృవంలో 'ధృవపు రేయి' నడుస్తూ ఉంటుంది.

అయితే కుడివైపున ఉన్న భూగోళ దశను గమనిస్తే- జూన్ మాసంలో భూగోళం ఉండే స్థితి. పైన చెప్పిన విధంగానే ధృవపు దినమూ, రేయీ నడుస్తూనే ఉంటాయి- కాకపోతే ఈసారి ఉత్తరధృవం సూర్యుడికి అభిముఖంగా రావడంతో అక్కడ ధృవపు పగలు, అలాగే దక్షిణ ధృవంలో ధృవపు రేయి నడుస్తూ ఉంటాయి.

ధృవపు పగలూ, రాత్రులూ అనేవి ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎంత కాలం నడుస్తాయి?

విషువత్తుల దగ్గర, ధృవ ప్రాంతాల మీద సూర్యకిరణాల ప్రసరణ మారుతుంది. వసంత విషువత్తు దగ్గర నుండి, ఉత్తర ధృవం కొద్ది కొద్దిగా సూర్యుడికి అభిముఖంగా మారుతూ, ఉత్తరాయణ సమయానికి పూర్తిగా ధృవపు పగలుని సంతరించుకుంటుంది. అలాగే దక్షిణ ధృవం శరద్ విషువత్తు దగ్గర నుండి , కొద్ది కొద్దిగా సూర్యుడికి దూరంగా జరిగుతూ దక్షిణాయన సమయానికి ధృవపు పగలుని సంతరించుకుంటుంది.

ఈ కారణాల వల్లనే నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని నెలలపాటు సూర్యుడు అస్తమించడు, మరి కొన్ని నెలలపాటు ఉదయించడు.

కామెంట్‌లు లేవు: