7, జులై 2023, శుక్రవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 109*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 109*


"విషకన్యని సృష్టించినవారే నా తండ్రి మరణానికి కారకులెవరో బయటపెట్టాక కూడా రాక్షసుల వారిని ఉపేక్షించమంటారా ?" అడిగాడు మలయకేతు ఆవేశంతో బాధగా. 


బాగురాయణుడు తలపంకిస్తూ "చిత్తం. కానీ రాక్షసులవారు మీ తండ్రిగారికి మిత్రులు. అందుచేత తొందరపడి నిర్ణయానికి రావడం మంచిది కాదని నా అభిప్రాయం" అని చెప్పాడు. 


అంతలో గుడారం బయట ఏదో గొడవ వినిపించసాగింది. కొద్ది క్షణాల తర్వాత భటులు సిద్ధార్థకుడిని లోపలికి లాక్కొచ్చి "ప్రభూ ! ఇతడు గుర్తింపు పత్రం లేకుండా పారిపోవాలని ప్రయత్నించాడు. అదేమంటే రాక్షసామాత్యుల వారి పసుపున రహస్యకార్యము అంటూ బుకాయిస్తున్నాడు" అని ఆరోపించారు. అక్కడ మలయకేతు బాగురాయణులను చూడగానే సిద్ధార్థకుడి మొహం వెలవెలబోయింది. 


"ఓహో ! తమరు రాక్షసుల వారి అంతరంగిక భృతులు కదా... తమ రహస్య ప్రయాణం ఎక్కడికో వివరిస్తారా ?" వెటకారంగా ప్రశ్నించాడు మలయకేతు. సిద్ధార్థకుడు బదులు చెప్పకుండా తలదించుకున్నాడు. 


మలయకేతు సంజ్ఞల మేరకు భటులు అతనిని సోదాచెయ్యగా దుస్తుల చాటునుంచి ఒక లేఖ, చిన్న నగలపెట్టే బయటపడ్డాయి. నగలపెట్టే మూతపై సీలు వేసి దానిపై రాక్షసనామాక్షర అంగుళీయకపు ముద్ర వేయబడివున్నది. ఆ పెట్టె మూత తెరిచి అందులోని నగలను చూసి నివ్వరపోయాడు మలయకేతు. అవి అతను రాక్షసుడికి బహకరించిన రత్నాలహారము, మరి రెండు ఇతర ఆభరణాలు. మలయకేతు తన ఆవేశాన్ని అణచుకుంటూ ఆ లేఖను చదవమని బాగురాయణుడిని ఆదేశించాడు. ఆ లేఖలో.... 


"కుమారా ..... ! శుభమస్తు.... 


నీవు పంపిన వర్తమానం అందింది. నాకు కానుకగా పంపిన 'ఆ మూడు ఆభరణములూ' చేరినవి. సంతోషం. ఒక దురహంకారిని దూరం చేసి నీవు నాకు సంతోషాన్ని కలిగించావు. ఇక మన బంధమునకు అడ్డుండదు. నేనూ ఇక్కడ పంచప్రాణాలను దారికి తెచ్చాను. వారు మన శత్రునాశనానికి మనతో చేతులు కలుపుటకు అంగీకరించారు. అయితే ముగ్గురు మిత్రులు మన విరోధి సంపదను కోరుతుండగా మిగిలిన ఇరువురూ పశుబలమును ఆశిస్తున్నారు. అట్లే అగుగాక యని నీమీద నమ్మకంతో నేను వాగ్దానము చేశాను. ఇక మనకు కార్య విజయం తథ్యం. అందుకు గుర్తుగా మన శత్రువుకి చెందిన మూడు ఆభరణములను నీకు బహుమతిగా పంపుతున్నాను. ఇతర వివరాలు నా భృతుడు స్వయంగా నీకు విన్నవించగలడు, శుభంభూయాత్......" 


ఆ లేఖలో క్రింద సంతకానికి బదులు రాక్షసామాత్యుని అంగుళీయకము గుర్తు ముద్రించబడింది. 


బాగురాయణుడు చదవడం పూర్తిచేసి "ఈ లేఖలోని దస్తూరి రాక్షసులవారి మిత్రుడు, లేఖరి శకటదాసు వలెనున్నదే...." అంటూ తలెత్తి సిద్ధార్థకుని వైపు అదోలా చూస్తూ "ఓయీ ! నిజం చెబితే నీకెలాంటి హాని జరగదని ప్రభువుల తరపున నేను అభయమిస్తున్నాను. ప్రాణాల మీద ఆశ ఉంటే విషయాన్ని సవిస్తరంగా వివరించు. లేదా......" గద్దించాడు కఠినంగా. 


సిద్ధార్థకుడు భయంతో వణికిపోతూ "ప్రాణం కాపాడుతామని అభియమించారు కాబట్టి నిజం వెల్లడిస్తున్నాను. ఆ లేఖ రాసింది లేకరి శకటదాసు. రాయించిన వారు అమాత్య రాక్షసులవారు. చేరవలసినది చంద్రగుప్తుల వారికి" అని చెప్పాడు. 


ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు మలయకేతు. బాగురాయణుడు గుడ్లురుముతూ "వివరంగా చెప్పు" గద్దించాడు. 


"రాక్షసుల వారికి చంద్రగుప్తుల వారితో రహస్యంగా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని అనుసరించి చాణుక్యుని వదులుకున్న చంద్రగుప్తుల వారు రాక్షసులవారిని మగధ మహామాత్యా పదవిలో సత్కరిస్తారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చంద్రగుప్తుల వారికి విజయం చేకూరేలా రాక్షసుల వారు పనిచేస్తారు. పంచప్రాణాలంటే మలయకేతు వారికి సహాయంగా వచ్చిన ఐదుగురు సామంతులు. వీరిలో కులూత, మలయా, కాశ్మీర రాజులు మలయకేతుల వారి రాజ్యాన్ని, సింధు, పారశీక రాజులు వారి గజబలగాన్ని ప్రతిఫలంగా ఆశిస్తున్నారు. ఈ విధంగా విజయానంతరం, మలయకేతువారి రాజ్యాన్ని గజబలాన్ని ఆ ఐదుగురికి బహుమతిగా ఇవ్వడానికి రాక్షసమాత్యులు వాగ్దానం చేశారు. చంద్రగుప్తుల వారికి ఈ విశేషాలు వివరించి ఆ కానుకలు బహుకరించమని..." 


"చాలు... ఇక చెప్పనవసరంలేదు..." అరిచాడు మలయకేతు. ఆవేశంతో పటపట పళ్ళు కొరుకుతూ "ఆ రాక్షసుని దుస్తంత్రానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ?" అని ప్రశ్నిస్తూ "ఎవరక్కడ... తక్షణం రాక్షసుల వారిని మా సముఖానికి రమ్మని కబురు పంపండి" అని ఆదేశించాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: