శు భో ద యం🙏
ప్రబంధ కవుల ప్రతిభ!! తెనాలి వారి ప్రాగల్భ్యం!!
ఉ: " సారధి ఛాదసుండు; బడి సాగదు చక్రయుగంబు ;ప్రాఁత సం
చారపు గుఱ్ఱముల్ ; రధియు శౌర్యమునందరమాని ;సాత్మవి
స్తారము ఖండ ఖండములు ; తానట మాసరి! యంచుఁదత్పురిన్
దేరులు నవ్వు శంకరుని తేరిని , కేతన కింకిణీ ధ్వనిన్
పాండురంగ మాహత్మ్యము-ప్రథమా శ్వాసము-115 పద్యము; తెనాలి రామకృష్ణ కవి;
పాండురంగ మాహాత్మ్యము చక్కని ప్రౌఢ ప్రబంధం. పాండురంగ విభుని పదగుంభనమునకు నిలయము.
ఈప్రబంధం కాశీపుర వర్ణనతో ప్రారంభమౌతోంది. అక్కడ చాలా పెద్దపెద్ద రథాలు ఉన్నాయట. అవి పరమేశ్వరుని రథాన్ని చూచి
గణగణ మని నవ్వుతున్నాయట. (వెక్కిరిస్తున్నాయని భావం) ఎందుకూ నవ్వటం? మీరు మాకు సరిగారు అని;
ఇంతకూ శివుని రథానికున్న లోపాలేమిటీ? ఒకటా రెండా ? అన్నీ లోపాలేనట!
సారధి చూద్దామా పరమ ఛాందసుడు. లోకంలో ఈఛాందసుడు అనేపదం వట్టి చాదస్తం కలవాడు అనే యర్ధంలో
వాడబడుతోంది. అంటే ఒకరిమాటవినడు తనకు తోచిందే చేస్తాడని యర్ధం. ఇక ఛాందసుడు అనేపదానికి వేదవిదుడు అనే అర్ధంకూడా ఉంది. శివుని రథ సారధి బ్రహ్మగారు. చతుర్వేదములు ఆయన ముఖతః పుట్టాయి.కాబట్టి ఆయన ఛాందసుఁడయ్యాడు.
ప్రస్తుతం మనమిక్కడ చాదస్తం కలవాడనే అనుకోవాలి.
బడి సాగదు చక్రయుగంబు- చక్రాలా ఒకేలా నడిచేవికావు. శివుని రధానికి చక్రాలు సూర్య చంద్రులు,సూర్యుడు పగలు,చంద్రుడు రాత్రి ,మాత్రమే ఉంటారు. ఒకసారి యిద్దరూ ఉండరు.అందువల్ల చక్రాలు సమంగా సాగవు.
ప్రాఁత సంచారపు గుర్రముల్: గుర్రాలు తిరిగి తిరిగి ముసలివైపోయాయి. ఇకవాటికి శక్తిలేదు.ఇంతకీ గుర్రాలు యేవి? వేదాలే
చతుర్వేదాలూ శివుని రథానికి గుర్రాలు. వేదాలు చాలా ప్రాచీనమైనవే! అందుచేత ముసలి గుర్రాలట!
రథియు శౌర్యమునం దరమానిసి"- ఇంక ఆరథమెక్కి తిరిగే ఆయన ఆడో మగో తెలియనివాడు. (పరాక్రమంలో సగంమనిషి!) అర్ధనారీశ్వరుడుగదా!
ఆత్మ విస్తారము ఖండఖండములు "- దాని పొడవు వెడల్పులు చుద్దామా ?ముక్కలూ చెక్కలు. శివుని రథం
భూమి. భూవలయం నవఖండ మండితమైనది. అంటే తొమ్మిది ముక్కలుగా ఉంటుంది. విరిగిన చెక్కముక్కలతో చేసిన రథం.దానికి
బలమెక్కడిది? అనియీసడింపుతో ఆవూరి రథాలు తమ జండాలకు కట్టిన చిరుగంటల మ్రోతలతో శివుని రథాన్ని చూసి నవ్వుతాయట!
ఆహా కవిదెంత గొప్పయూహ! దానికి శ్లేషను జోడించి , చక్కని పద్యాన్ని ప్రకల్పన చేశాడు!
ఇందులో నిందా స్తుతి గర్భితమైన శ్లిష్టోత్ప్రేక్షాలంకారం చోటుచేసికొన్నది!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి