*కార్తిక పురాణము - 29*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
*కార్తిక పురాణము - ఇరవై తొమ్మిదవ అధ్యాయము*
రాజు చూచుచుండగానే సుదర్శన చక్రమంతర్థానము పొందెను.సుదర్శన చక్రము అంతర్థానము పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడవేసి, బ్రాహ్మణోత్తమా!నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను.గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము.నీవు నాయందు దయయుంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి.మూడు లోకములకు భయమును కల్గించు నీకు భయమెక్కడిది? భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి.నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని.నాకు పరలోకము సిద్ధించును. త్వద్దర్శన దానముతో నాకభయ దానము, దానితో ప్రాణ దానము, దానితో పరలోక దానము సంభవించినవని విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాసమహాముని ఆనందముతో,
రాజా! ప్రాణములను రక్షించు వాడు తండ్రియని చెప్పబడును. నీచేత నాప్రాణములు రక్షించబడినవి. నాకు తండ్రివి నీవే.నేను నీకిప్పుడు నమస్కారము చేసినయెడల నీవు దుఃఖించెదవు.తండ్రికి కష్టము కలిగెడు వ్యాపారము చేయగూడదు. నీకు నమస్కారమును చేయను.బ్రహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టమును కల్గించితిని.దానికి ఫలమును అనుభవించితిని.చివరకు నీవు దయతో ఆ కష్టము నివారించితివి.
రాజా! నీతో కూడా భుజించెదనని దుర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మ వేత్తయైన అంబరీషునితో గూడి భుజించెను. సాక్షాత్తూ శివ రూపుడైన దుర్వాసుడు విష్ణు భక్తునియొక్క మహాత్మ్యమును పరీక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై తన ఆశ్రమమునకు వెళ్ళెను. కార్తీకకమాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము. సమస్త ఫలప్రదము. సమస్త యజ్ఞ ఫలప్రదమగును.
కార్తీకమాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశినాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును.
మోక్షమును గోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలయును.కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము.కనుక దానిని ఎంతమాత్రము విడువరాదు.కార్తీకక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము.
ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై అనేక భోగములననుభవించి అంతమందు పరమపదము పొందుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకోనత్రింశాధ్యాయ సమాప్తః!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి