11, డిసెంబర్ 2023, సోమవారం

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 ✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

.           ప్రథమ సంపుటము

 

.             *ఉపోద్ఘాతము -1*         

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


ఇది అష్టాదశ మాహాపురాణాలలో ఒకటి. అగ్నిరూపుడైన శ్రీమహావిష్ణువునుండి ఆవిర్భవించడం చేత దీనికి "అగ్ని మహాపురాణము" అనే పేరు వచ్చినది. 


అగ్నిదేవుడు వసిష్ఠునకు చెప్పిన ఈ పురాణాన్ని వ్యాసుడు ఆయన నుండి (వసిష్ఠుని నుండి) గ్రహించి తన శిష్యుడైన సూతునికి బోధించాడు. అగ్ని పురాణంలో 15000 శ్లోకాలున్నవని భాగవతంలోను, 16000 శ్లోకాలున్నవని మత్స్యపురాణంలోను చెప్పబడి ఉన్నది. 


శ్లోక సంఖ్య12000 అని అగ్నిపురాణం లోనే 272వ అధ్యాయంలోనూ, 15000 అని చివరి అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. వాస్తవంలో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రం 11457 అయితే దీనిలో కొన్ని గద్య భాగాలు ఉన్నాయి. వాటిని 32 అక్షరాల శ్లోకాలుగా భాగించి లెక్క పెటితే దాదాపు 1000 శ్లోకాలు పెరగవచ్చును. 


383 అధ్యాయాల ఈ మహాపురాణంలో పరాపర విద్యలకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నవనీ, అందుచేత ఒక విధంగా ఇది విజ్ఞాన సర్వస్వం అనీ అక్కడక్కడ చెప్పబడింది.


ఈ పురాణంలో మొత్తం 50 ప్రధాన విషయాలు చెప్పబడినట్లుగా చివరి అధ్యాయంలో ఉన్నది. "సర్గశ్చ ప్రతిసర్గశ్చ" ఇత్యాది పురాణ లక్షణం ప్రకారం ఈ పురాణంలో కూడా సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశాలు, మన్వంతరాలు, రాజవంశాలు అనే ఐదు విషయాలు ఉన్నాయి అని చెప్పినా ఈ విషయాలు అసంపూర్ణంగానే కనబడతాయి. 


ఈ పురాణం వ్యాసరచితమైనదనే సంప్రదాయం ఉన్నది కాని ఆధునికులు మాత్రం అనేకమైన ఆంతరంగిక ప్రమాణాలను పురస్కరించుకొని దీని రచన క్రీ. శ. 700-900 సంవత్సరాల కాలంలో జరిగినట్లు భావిస్తున్నారు.


వైష్ణవ పాంచరాత్రము, భగవద్గీత మొదలైనవి పొందు పరచటం చేత ఈ పురాణానికి వైష్ణవచ్ఛాయ కల్పించడం జరిగింది. కృష్ణుని నారాయణునిగా, విష్ణువునుగా పూజించ వలెనని దీనిలో ప్రతిపాదింపబడింది. 


అగ్ని విష్ణువుగాను, కాలాగ్నిగాను, రుద్రుడుగాను ప్రారంభాధ్యాయములలో వర్ణింపబడినాడు. "విష్ణువు, అగ్ని అనేవి ఒక దేవత యొక్క రెండు రూపాలు. ఈ పురాణంలో విష్ణువే అగ్నిగా స్తుతింపబడినాడు" అని 174వ అధ్యాయంలో చెప్పబడింది. 


అగ్ని విష్ణువు యొక్క రూపాంతరమే. సర్వ పాపాలను దహించ కలిగిన ఈ అగ్నిని ధ్యానించి, పూజించి, స్మరించి, స్తుతించాలి. అయితే ఈ పురాణంలో శైవాగమానికి సంబంధించిన విషయాలు, శివలింగపూజ, తాంత్రిక పూజా విధానాలుకూడా చెప్పబడి ఉన్నాయి. ఈ విషయాలు కూడా ఉండడం చేత ఇది 'తామస పురాణం' అని అంటూ, పద్మపురాణంలో దీనినింద కనబడుతుంది. 


అందుచేత దీని రచన శైవ వైష్ణవాల మధ్య అంతగా విరోధభావం ఏర్పడడానికి ముందుగానే, వైష్ణవ మతంలో రాధాకృష్ణ సంప్రదాయం ఆవిర్భవించడానికి కూడా ముందుగానే జరిగి ఉంటుందని ఆధునిక విమర్శకుల ఊహ.


ఈ పురాణానికి పురాణం అనే పేరే కాని ఇందులో ఉపాఖ్యానాదులు చాలా తక్కువ. శైవ_శాక్త-వైష్ణవాగమాదులకు సంబంధించిన అనేక విషయాలు అత్యధికంగా ఉన్నాయి. అందుచేతనే ఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వం వంటిదని చెపుతూ ఉంటారు. సంగ్రహంగా దీనిలోని విషయాలు ఇవి:


అన్ని పురాణాలలో ఉన్న పద్దతిలోనే ఈ పురాణంలో కూడా ప్రథమాధ్యాయంలో ప్రారంభం అవుతుంది. రెండుమూడు అధ్యాయాలలో మత్స్య-కూర్మ-వరాహావతారాలు, తరువాతి ఏడు అధ్యాయాలలో (5-11) రామాయణంలోని ఏడుకాండల కథ వర్ణింపబడినవి. 12వ అధ్యాయంలో హరివంశ కథ-తరువాత మూడు అధ్యాయాలలో (13-15) మహాభారత కథ సంక్షిప్తంగా ఉన్నాయి. 


16వ అధ్యాయంలో బుద్ధావతారము, కల్క్యవతారము చెప్పబడినవి. 17-20 అధ్యాయాలలో సాధారణంగా అన్ని పురాణాలలో ఉండే సర్గ-ప్రతిసర్గ- మన్వంతరాదుల ప్రసంగం ఉన్నది.


21 మొదలు 105 వరకు ఉన్న అధ్యాయాలలోను, 201వ అధ్యాయంలోను, 317-326 అధ్యాయాలలోను శైవ-వైష్ణవ-శాక్త-సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. 


21-70 అధ్యాయలలో సంవాదం నారద-అగ్ని-హయగ్రీవ-భగవంతుల మధ్య జరిగినది. పాంచరాత్రాగమం పేరు చెప్పకుండగానే పాంచరాత్రపద్ధతిలో వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణుల పూజా విధానం చెప్పబడింది. 


39-70 అధ్యాయలలో ఇరవైయైదు పాంచరాత్రాగమ గ్రంథాలు నిర్దేశింపబడ్డాయి. సప్తరాత్ర సంప్రదాయం అనేది ఒకటి పేర్కొనబడింది. ఈ భాగంలో హయగ్రీవ పాంచరాత్రానికి సంబంధించిన అదికాండ-సంకర్షణకాండలను సంక్షిప్తం చేసి చెప్పినట్లు కనబడుతుంది. అరవైనలుగురు యోగినీల మూర్తులవర్ణనం కూడా ఉన్నది.

సశేషం....

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: