11, డిసెంబర్ 2023, సోమవారం

నమస్కారం

 *"నమస్కారం మన సంస్కారం"*


హిందూ మతంలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యత వుంది. 


నమస్సు, నమస్కారం, ప్రణతి, వందనం... ఇవన్నీ ఒకటే. రెండు చేతులూ జోడించి నమస్కరించడం మన సంప్రదాయం. నమస్కారం లేకపోతే అసలు పూజ అనేదే లేదు. పూజలో మొదట, చివర కూడా నమస్కారం ఉండటం వల్ల దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. 


అలాగే నిత్యజీవితంలో కూడా మనం అనేకమందికి నమస్కారం చేస్తూ వుంటాం.


*సభాయాం, యజ్ఞశాలయాం దేవతాయతనే గురౌ*

*ప్రత్యేకం చ నమస్కారం హన్తి పుణ్యం పురాకృతం* 


అని సూర్యపురాణంలో వుంది. దీనికి అర్థమేమిటంటే సభలో ప్రవేశించినపుడు, దేవతలున్న స్థలంలో, అనేకమంది గురువులున్న చోట, యజ్ఞశాలలో, అందరికీ కలిపి ఒకే నమస్కారం చేయాలి. విడి విడిగా నమస్కారం చేయకూడదు. అలా చేస్తే మనం చేసిన పుణ్యంలో కొంత భాగం నశిస్తుంది. 


అందుకే సభలో ప్రవేశించినప్పుడు *"సభాయై నమః"* అని మొత్తం సభకు, సభాదులందరికీ ఒకేసారి నమస్కరించడం మన సంప్రదాయం. ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. అలా చేస్తే ఒక సంవత్సర కాలంలో మనం చేసిన పుణ్యం హరిస్తుంది అన్నారు మన ఋషులు.

కామెంట్‌లు లేవు: