11, డిసెంబర్ 2023, సోమవారం

నాయనార్ల చరిత్ర - 26*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 26*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*నమి నంది అడగళు నాయనారు*


ప్రసిద్ధ శైవ క్షేత్రమైన తిరువారూరు సమీపంలో పాడి పంటలతో కళ

కళలాడుతున్న అందమైన గ్రామం ఒకటుంది. దాని పేరు ఏమప్పేరూరు.


ఆ గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో నమినంది అనే

శివభక్తుడు జన్మించాడు. నమినంది రోజూ తిరువారూరు వెళ్లి అక్కడ వెలసిన

వల్మీక నాధుని దర్శించి, భక్తితో అర్చించి తరువాత పక్కనే ఉన్న అరనెరి

అనే గ్రామంలోని శివాలయానికి వెళ్లేవాడు. 


అతని హృదయంలో

దేవాలయంలో అసంఖ్యాకములైన దీపాలు వెలిగించాలనే కోరిక కలిగింది.

అది సూర్యాస్తమయ సమయం కావడం వలన ఇంటికి వెళ్లి నెయ్యి

తీసుకురావడానికి అవకాశం లేక పోయింది. అందువలన తిరువారూరులోని

ఒక ఇంటికికెళ్లి శివాలయంలో దీపం వెలిగించడానికి నెయ్యి కావాలని

అడిగాడు. 


ఆ ఇంట్లోనున్న వ్యక్తి జైన మతస్తుడు కావడం వలన “చేతిలో

అగ్నిహోత్రుని దాల్చిన శివునికి దీపాలు ఎందుకు? మీరు దీపాలు వెలిగించ

దలుచుకుంటే నీళ్లుపోసి దీపాలను వెలిగించండి" అని పరిహాసంగా పలికాడు.


 శివునిమీద అచంచల భక్తి ప్రపత్తులు కలిగిన నమినంది.

చింతాక్రాంతుడై తిరువారూరు దేవాలయానికి వెళ్లాడు. అక్కడి పరమేశ్వరునికి

సాష్టాంగ నమస్కారాలు చేశాడు. 


దీపాలు వెలిగించడానికి నాకు అవకాశం లేకపోయిందని బాధపడ్డాడు. ఆ సమయంలో అతనికి అశరీరవాణి

వినిపించింది. "ఓ భక్తుడా! నీ హృదయంలో గూడు కట్టుకోనున్న శోకాన్ని

తొలగించుకో. ఈ దేవాలయం సమీపంలో ఒక కొలను ఉంది. అక్కడికి

వెళ్లి ఆ కొలని నీటితో దీపాలను వెలిగించు" అనే మాటలు అతని చెవులలో

ప్రతిధ్వనించాయి. 


నమినంది అత్యంత సంతోషంతో ఉబ్బితబ్బియ్యాడు.

తరువాత పరిగెత్తుకుంటూ వెళ్లి కొలనునుండి నీటిని తీసుకు వచ్చి దానితో

దీపాలను వెలిగించాడు. ఆ దీపాలు ప్రజ్వరిల్లుతూ దశదిశలా

ప్రకాశవంతంగా వెలుగులను విరజిమ్మాయి. 


నమినంది మరింత

సంతోషంతో దేవాలయమంతటా దీపాలను వెలిగించాడు.

దీపం వెలిగించడానికి నెయ్యి ఇవ్వమని నిరాకరించిన జైనులకు

బుద్ధివచ్చేలా నమినంది నీటితో దీపాలను వెలిగించి పరమేశ్వరుని

కృపాకటాక్షాలను వాళ్లకు తెలియజేశాడు.


పరమభక్తుడైన తిరునావుక్కరుసుచే ప్రశంసింపబడి నమినంది

జీవితాంతం పరమేశ్వరుని పాదపద్మాలనే ధ్యానిస్తూ మరణానంతరం శివ

సాయుజ్యాన్ని పొందాడు.


*ఇరవై ఆరవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: