11, డిసెంబర్ 2023, సోమవారం

నవగ్రహా పురాణం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *103వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శనిగ్రహ చరిత్ర - 3*


శనైశ్చరుడు విజయోత్సాహంతో సూర్యమందిరానికి తిరిగి వచ్చాడు. సంజ్ఞకూ , సూర్యుడికీ పాదాభివందనాలు చేశాడు.


*"యముడు ఎక్కడ ?"* అని సంజ్ఞను అడిగాడు.


*"నువ్వు తపస్సుకు వెళ్ళినపుడే సంయమనీ పట్టణానికి వెళ్ళిపోయాడు కద ! ఇప్పుడు నీ సోదరుడు దక్షిణ దిక్పాలకుడు !"* సంజ్ఞ నవ్వుతూ చెప్పింది.


*"నాన్నగారూ ! నేను ఏకకాలంలో బ్రహ్మవిష్ణుమహేశ్వరుల గురించి తపస్సు చేశాను ! ఏక కాలంలో ముగ్గుర్నీ సాక్షాత్కరింపజేసుకున్నాను..."*


*"నిజమా ?! ఏకకాలంలో తపస్సా ?"* సూర్యుడు ఆశ్చర్యంతో అడిగాడు.


*"ముగ్గురూ ఒకేసారి సాక్షాత్కరించారు ! కోరిన వరాలు ప్రసాదించారు !"* శని గర్వంగా అన్నాడు. త్రిమూర్తుల నుండి తాను ఆర్జించిన వరాలను వివరించాడు.


సూర్యుడూ , సంజ్ఞ , సావర్డీ , తపతీ - శనైశ్చరుడిని అభినందించారు.


*"యముడు ఇద్దర్ని మెప్పించినందుకే అంతగా శ్లాఘించారే. నాన్నగారూ ! నేను ఇద్దర్ని కాదు , ముగ్గుర్ని మెప్పించాను ! ఇప్పుడేమంటారు ?"* శని నవ్వుతూ అన్నాడు.


*"మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. శనీ ! ఎందుకంటే యముడి మీద స్పర్ధతో నువ్వు శ్రమించావు , సాధించావు ! స్పర్ధ వృద్ధికి దోహదం చేస్తుంది !"* సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.


*"యముణ్ణి చూసి తండ్రిగా గర్వించాను. నిన్ను చూసి ఇంకా అధికంగా గర్విస్తున్నాను ! ఆయుర్దాయ కారకుడుగా ఎదిగావు కద !"*


*“ఇంక మనం త్వరపడాలి. స్వామీ ! మన శనైశ్చరుడికి తగిన వధువుతో వివాహం జరిపించాలి !"* సంజ్ఞ సూర్యుడితో అంది.


*"జ్యేష్ఠమాతా ! నేను సామాన్య కన్యను స్వీకరించను ! నన్ను చూసి భయపడని ధైర్యం కలిగినదానినీ , నా కళ్ళల్లోకి సూటిగా చూడగలిగిన దానిని మాత్రమే అరాంగిగా అంగీకరిస్తాను !"* శనైశ్చరుడు నిష్కర్షగా అన్నాడు.


*“అలాగే , శనీ ! నువ్వు కోరే ధీరవనితనే ఎన్నిక చేస్తాం !"* సంజ్ఞ చిరునవ్వుతో అంది. 


*“అదే ! ఆ విషయం గుర్తుంచుకోండి , వధువును అన్వేషించేటప్పుడు !"* అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సావర్జీ , యమీ , తపతీ అతని వెంట వెళ్ళారు. శని


*“కష్టతరమే !”* సూర్యుడు సంజ్ఞాదేవిని చూస్తూ సాలోచనగా అన్నాడు.


*"ఏమిటి స్వామీ ?”*


*"మన శనైశ్చరుడి దృష్టిని తట్టుకునే , అతని కళ్ళల్లోకి ధైర్యంగా చూసే స్త్రీ మూర్తి లభించడం !"* సూర్యుడు నిట్టూర్చాడు.


*************************************



ఆమె పేరు జ్యేష్ట , శరీర వర్ణం కారునలుపు. నేత్రాలు నిప్పుకణికలు , ముఖం కారం ! ఒక లిప్త పాటు ఎవ్వరూ చూడలేని , భయానక , బీభత్స 'సౌందర్యం !'


ఆమెను చూడగానే బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరుడూ రోతపుట్టి , తలలు తిప్పేసుకున్నారు. చతుర్ముఖుడు ఆమెను చూడకుండా ఉండే ప్రయత్నంలో చాలా అవస్థపడిపోయాడు. ఎటు తిరిగినా ఏదో ఒక తల ఆమె వైపు తిరిగి ఉంటుంది.


ఆయన అదృష్టం కొద్దీ శ్రీమహావిష్ణువు ఆమెను అక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మని. ఆజ్ఞాపించాడు. ఆమె వెళ్ళిపోయింది.


ఆనాటి నుండీ తనను చేపట్టే పురుషుడి కోసం జ్యేష్ఠ నిర్విరామంగా అన్వేషిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో సంచరించని ఊర్ధ్వలోకాలు లేవు !


సాక్షాత్తూ దేవేంద్రుడు ఆమె సమీపించగానే నందనవనంలోంచి పారిపోయాడు !


గంధర్వ యువకులు , కిన్నర యువకులు , కింపురుషులు - ఒక్కరేమిటి దేవగణాలన్నింటికీ చెందిన పురుషులు ఆమె వైపు చూడడానికే వణికి పోయారు. కొందరు పారిపోయారు. కొందరు పారిపోలేక మూర్ఛతో కూలిపోయారు !


చివరికి లోకభీకరాకారులైన రాక్షసులు కూడా ఆమె భయానక రూపాన్ని దర్శించలేక కకావికలైపోయారు ! దిక్పాలకులు తమ తమ దిక్కులు వదిలి దిక్కుతోచని వాళ్ళలాగా పరుగులు పెట్టారు. సిద్ధులూ , చారణులూ అందరిదీ ఒకటే స్పందన - పరుగు !


విసిగి , వేసారి పోయిన జ్యేష్ఠ అరణ్య మార్గాన నడుస్తూ , తన భవితవ్యం గురించి తీవ్రంగా ఆలోచించుకుంటోంది. ఈ సృష్టి ఇంత అసంపూర్ణంగా ఉందా ? తనను తేరిపార చూసే పురుషుడే లేడా ఈ సృష్టిలో ! జ్యేష్ఠ తటాలున ఆగి , చెవులు రిక్కించింది. ఏదో లయబద్ధమైన ధ్వని ; ఎవరో వస్తున్న అలికిడి , జ్యేష్ఠ వెంటనే చెట్టు చాటుకు తప్పుకుంది.


కాలాన్నీ , స్థలాన్నీ మరిచిపోయి నారాయణనామ సంకీర్తన చేస్తూ వస్తున్న నారదుడు ఉలిక్కిపడి ఆగాడు. వీణ తీగల మీద నర్తిస్తున్న వేళ్ళు కొయ్యబారిపోయాయి. ఎదురుగా , దగ్గరగా , తనదారికి అడ్డుగా భీకరాకారం ! నారదుడు ఆమెను చూడలేక గిరుక్కున వెనుదిరిగి పరుగుపెట్టే ప్రయత్నం చేశాడు.


*"ఆగు !"* జ్యేష్ఠ కంఠం గర్జించింది.


నారదుడు కొయ్యబారి నిలిచిపోయాడు.


*"నువ్వెవరో నాకు తెలుసు ! ఇటు తిరుగు నారదా !"* జ్యేష్ఠ నవ్వింది.


*"అమ్మో... నీ వైపు.. చు.. చు... చూడను !".*


*"ఏం ? ఎందుకు చూడవు ?"* ఎందుకో తెలిసి కూడా అడిగింది జ్యేష్ఠ.


*"నేను చూస్తే... దిష్టి తాకుతుంది నీకు !"* నారదుడు అమాయకత్వం నటిస్తూ అన్నాడు..


జ్యేష్ఠ నవ్వు నారదుడి శరీరాన్ని ఒక్కసారి జలదరింపచేసింది. *"అందుకే నువ్వంటే ఇష్టం ! అందరూ నన్ను భయంతో చూడ్డం లేదు. నువ్వేమో పాపం... నాకు దిష్టి తాకుతుందన్న ప్రేమతో చూడ్డం లేదు ! నేనంటే నీకు ఇష్టమని అర్థమైపోయిందిలే , నారదా ! నన్ను... ఎవ్వరూ వివాహం చేసుకోవడం లేదు ! నువ్వు చేసుకో నారదా !"* జ్యేష్ఠ నారదుడి వీపునే చూస్తూ అంది.


నారదుడు ఉలిక్కిపడ్డాడు. అతని వేళ్ళు అడ్డదిడ్డంగా సోకి వీణతీగలు 'గుయ్' మన్నాయి. *"నేను.. నేను... చేసుకోకూడదు !"*


*"నువ్వు చేసుకోవాల్సిందే ! నాకు ఎంతో నచ్చావు !”*


*“నారాయణ ! నేను ఆజన్మ బ్రహ్మచారిని తల్లీ ! వివాహం చేసుకోకూడదు ! నిన్నే కాదు , ఎవ్వర్నీ చేసుకోను !"*


*"ఎన్ని కారణాలు చెప్పినా , నిన్ను వదలను !"* అంటూ జ్యేష్ఠ నారదుడి భుజం మీద చెయ్యి వేసింది.


నారదుడి శరీరం ఒక్కసారి వణికింది. మెల్లగా నోరు పెకలించుకున్నాడు. *"జ్యేష్ఠా ! నా మాట విను ! నిన్ను భార్యగా స్వీకరించబోయే పురుషుడు నీలాగే ధైర్యసాహసాలు కలిగి ఉండాలి ! నీ ముఖంలోకి చూడలేని నాలాంటి భీరువులు నీకు భర్త కాలేరు !"*


జ్యేష్ఠ చెయ్యి నారదుడి భుజం మీద నుంచి జారింది. *"అంటే , నన్ను చూడాలంటే నీకూ భయమేనా , నారదా ?"*


*"నిజం చెప్పాలంటే భయమే ! దిష్టి తాకుతుందంటూ ఊరికే , హాస్యానికన్నాను ! నా మాట విను ! నీకు తగిన ధైర్యశాలిని పట్టు !"*


*"లోకాలన్నీ గాలించాను. అలాంటి వాడు లేడు ! నా ముఖంలోకి ధైర్యంగా చూసే పురుషుడు లేడు !"* జ్యేష్ఠ విచారంగా అంది.


*"ఎందుకు లేడమ్మా ! ఉన్నాడు. నీ ముఖారవిందంలోకి తదేకంగా ఎలా చూడలేమో , ఆయన ముఖారవిందంలోకి అలాగే తదేకంగా చూడలేం ! ఆ పురుషపుంగవుడు ఎలా ఉంటాడో వర్ణిస్తాను విను. కాటుక ముద్దలాంటి శరీరం ! ఎరుపూ , పసుపూ రంగులు కలిసినట్టుండే మిడిగ్రుడ్లు తేరిపార చూడలేని భీకరాకారం..."*


*"ఆహా ! నిజంగా... అలాంటి... స్ఫురద్రూపం కలిగిన పురుషుడున్నాడా , నారదా ? ఎక్కడ ? ఎక్కడున్నాడు ?"* జ్యేష్ఠ ఉత్సాహంగా అడిగింది.


*"నువ్వు ఏనాడైనా సూర్య మందిరం వైపు వెళ్ళావా ?"* నారదుడు ప్రశ్నించాడు.


*"లేదు...”*


*“వెంటనే అటువైపు సాగిపో ! నీకు తగిన పురుషపుంగవుడు - నీ సమ ఉజ్జీ అక్కడ నీకు తారసిల్లుతాడు !"* 


*"ఎవరతడు ? ఎవరో చెప్పు నారదా ?”* జ్యేష్ఠ మారాం చేస్తున్నట్టు అడిగింది.


*“ఆనవాలు చెప్తాను విను ! అతను నిన్ను చూడగానే వెనుదిరగడు ! పారిపోడు ! నువ్వు చూసినట్టే , తదేకంగా , నిర్భయంగా నీ విశాల , ఉన్నత నేత్రాలలోకి అదేపనిగా , తదేకంగా చూస్తాడు ! అతగాడే , నీ జతగాడు ! వెళ్తావా ?”*


ఎంతసేపటికీ జ్యేష్ఠ నుండి సమాధానం రాకపోయేసరికి నారదుడు మెల్లగా తలతిప్పి చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో , పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి జ్యేష్ఠ త్వరత్వరగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది !


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: