19, డిసెంబర్ 2023, మంగళవారం

శ్రీనాధుని కవిత

 శుభోదయం🙏

.

శ్రీనాధుని కవితలోని  రక్తి-భక్తుల మహోదయం!


-------------- శ్రీనాథుని కవితా వైభవం   - --------------


ఈ క్షోణి న్నిను బోలు సత్కవులు లేరీ?నేటి కాలంబునన్

దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ

వక్షోజ ద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు న

ధ్యక్షించున్ గవిసార్వబౌమ! భవదీయ ప్రౌఢ సాహిత్యముల్.


ఈ పద్యం లోశ్రీనాథ  కవిని స్తుతించింది అల్లాడ వేమారెడ్డి.అయినా పఠితలకు వినవచ్చేది శ్రీనాథుని ప్రౌఢ కవితా(రీతి)సరస్వతి.

అర్థము:--శ్రీనాథుడు కవిసార్వబౌముడు,ఆయన సృజించినది ప్రౌఢ సాహిత్యాలు. సాహిత్యాలంటే రసవత్కావ్యాలని తాత్పర్యం.సార్వబౌముని సాహిత్యాలు కూడా సామ్రాజ్యాలను పాలించాయి.

దాక్షారామ భీమేశ్వర క్షేత్రం లోని గంధర్వా ప్సరో భామినుల వక్షోజాల మీద పరిమళసుందరంగా పరివేష్టించి వున్న మంచిగంధం ,కుంకుమపువ్వు,పూతలు ఆ కవితాసామ్రాజ్యానికి ఎల్లలు.ఆ యెల్లలలొ

చల్లదనం వుంది,రాగ మాధుర్యమూ వుంది.శృంగార రసభాండాలు ఆ సీమలు, ఆ సీమల గౌరవాన్ని పాలించట మంటే రసజగత్తునే జయించట మన్నమాట.ఆ విజయ చిహ్న మే కవి సార్వభౌమ బిరుదమని

పద్యం లో ధ్వని.నాటి కాలానికే కాదు నేటి కాలానికి కూడా శ్రీనాథుని పోలిన కవి శ్రీనాథుడే.


మరి శ్రీనాధుని భక్తిభానమలో అపూర్వము!


కాదుకాదుదుదయాద్రి కనకకూటంబిది డంబైన పానవట్టంబు గాని

కాదుకాదిది సుధాకర పూర్ణబింబంబు కాశ్మీర శంభులింగంబు గాని

కాదుకాదుదయ రాగ ప్రకాశం బిది నవ కుంకుమా లేపనంబుగాని

కాదు కాదిది కళంక చ్చటారింఛోళి పూజచేసిన కల్వపువ్వుగాని

యనగా సప్తార్ణవములు మిన్నంది కొనగ

జంద్రకాంతోపలంబులు జాలువార

నశమశర సార్వభౌము ముత్యాల గొడుగు

విధుడు విశ్వంబు వెన్నెల వెల్లి దేల్చె.


ప్రకృతిని పరమేశ్వర స్వరూపంగా భావించే ప్రజ్ఞ శ్రీనాథుడీ సీసం లో ప్రదర్శించాడు.విశ్వం లో విశ్వాత్మకుడిని ద ర్శి0 చే విశాలమైన భక్తి భావం కనబడుతుంది

చంద్రోదయ వర్ణనం యిందులో వస్తువు.అవస్థాన్థరాలలొ చంద్రబింబ ఆవిర్భావం యిందులో దర్శననీయ

మవుతుంది.ఉపమేయం చంద్రబింబం,ఉపమానం శివలింగం.కవి ఉపమేయాన్ని చెబుతున్నా

ఉపమానాన్ని కన్నులకు కట్టించటం ధ్యేయం.తూర్పుకొండ కోన వెనక చంద్రుడు తలెత్తుతున్నాడు.కనపడుతున్నది కనకశిఖరం ,అది కనకశిఖరం కాదనీ శివలింగపు పానవట్టమనీ వర్ణిస్తాడు.ఆ తర్వాత పూర్ణ చంద్రబింబం పొడసూపింది,అది కాశ్మీర శంభులింగమంటాడు,ఉదయించిన చంద్రుడు రాగకాంతి తో రాణిస్తున్నాడు,ఆ అరుణకాంతి శివలింగాని

కలందిన కుంకుమ లేపనమని చూపిస్తాడు.శశాంక కళంకాన్నిశివలింగం పైని కలువపువ్వుగా(నల్లకలువ)కీర్తిస్తాడు.

ధవళ కాంతులతో వెన్నెల గుమ్మరిస్తున్న ఆ వెలుగు రేనిని శివ ప్రభువు దాల్చిన ముత్యాల గొడుగుగా

మూర్తి కట్టిస్తాడు.లోకాన్ని వెన్నెల వెల్లువలో ముంచుతున్న కలువరేనిని కన్ను కప్పటం అంత తేలిక పని కాదు.అందువలననే 'కాదు కాద'నే క్రియను సీస పద్యపాదారంభం లో కదను తొక్కించాడు. .అర్థాలంకారాన్ని సార్థకం చేశాడు.

చంద్రబింబం లో చంద్రమౌళిని దర్శించిన శ్రీనాథుని భక్తి చరితార్థం

శ్రీనాథు డంటే శృంగార 'సీస'పద్యాలే వ్రాస్తాడని,విమర్శల నే ఎక్కువ చేస్తాడని,అతనికి రక్తి తప్ప భక్తి లేదని చాలా మందికి వున్న అభిప్రాయం తప్పని రుజువు చేస్తుంది ఈ సీసం.


శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ

దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి చూడంగ నేర్చిన చూపుచూపు

దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి చే నింప నేర్చిన చెవులు చెవులు

తారకబ్రహ్మ విద్యాదాత యౌదలవిరులు పూన్పగ నేర్చు కరము కరము

ధవళకర శేఖరునకు బ్రదక్షిణంబు

నర్థి దిరుగంగ నేర్చిన యడుగు లడుగు

లంబికా నాయక ధ్యానహర్ష జలధి

మధ్యమున దేలియాడెడి మనసు మనసు.


ఈ పద్యం చదవగానే తెలుగువారికి "కమలాక్షు నర్చించు కరములు కరములు"అనే పోతన గారి పద్యం గుర్తుకువస్తుంది.పై పద్యం శ్రీనాథుడు వ్రాసింది.


రెండు పద్యాలూ భక్తిభావ వ్యంజకాలే.కానీ శ్రీనాథుడు చెప్పే పద్ధతిలో రాజసం రాణిస్తున్నది.పోతన కవిత్వం లోపారవశ్యం లాస్యం చేస్తున్నది.వస్తుతత్వం ఒకటే అయినా కవి వ్యక్తిత్వాన్ని బట్టి కవితలలో భేదం కనిపిస్తుంది.సీసపద్య పాదాలను సమవిభక్తం చేసి పూర్వార్థం లో భీమేశ్వరాకృతిని సమాన ఘటనం

తో సాక్షాత్కరింప చేసి ఆ మూర్తిని అర్చించాలని ఆదేశిస్తున్నట్లు వున్నది శ్రీనాథుని సీసం.


                     స్వస్తి!

కామెంట్‌లు లేవు: