19, డిసెంబర్ 2023, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఏప్రిల్ 30వ తేదీ 1976..*


*(అరవై రెండవ రోజు)*


శ్రీ స్వామివారు ఏప్రిల్ 30 వతేదీ నాడు తనను కలువమని శ్రీధరరావు దంపతులకు చెప్పి పంపారు..ఆరోజు ఉదయం శ్రీధరరావు ప్రభావతి గార్ల తో పాటు వారి రెండవ కుమారుడు ప్రసాద్ కూడా ఆశ్రమానికి వెళ్ళాడు..కొద్దిసేపు బైట వేచి వుండగానే..శ్రీ స్వామివారు తలుపు తీసుకొని బైటకు వచ్చారు..


వీళ్ళను చూడగానే నవ్వి.."వచ్చారా?.." అన్నారు..

కొద్దీ దూరంలో నిల్చుని ఉన్న ప్రసాద్ దగ్గరకు వెళ్లి..ముఖంలో ముఖం పెట్టి.."ఎవరూ ప్రసాదా?.."అన్నారు..


"అవును స్వామీ!.." అన్నాడతను..


"చూసావా..నిన్ను దగ్గరగా చూస్తే గానీ పోల్చుకోలేకుండా వున్నాను..చూపు కూడా మందగించింది..మీ అమ్మా నాయన్లకు చెప్పరాదూ..స్వామివారికి చూపు కూడా కనబడటం లేదు..ఇంక ఆయన్ను సజీవ సమాధి చేయమని.." అన్నారు పెద్దగా నవ్వుతూ..


"మీరు మాట్లాడుకోండి స్వామీ ఆ విషయాలు.." అన్నాడు ప్రసాద్..


శ్రీ స్వామివారు వెనక్కు వచ్చి..శ్రీధరరావు ప్రభావతి గార్లను కూర్చోమని చెప్పి..తాను వారికెదురుగ్గా పద్మాసనం వేసుక్కూర్చున్నారు..అప్పుడు ఆ దంపతులు గమనించారు ..శ్రీ స్వామివారి రెండు తొడలమీదా అరచెయ్యంత మేర చర్మం కమిలి..లేచి పోయి..పుండు లాగా ఎఱ్ఱగా కనబడుతోంది..


"ఏంది స్వామీ ఆ పుండు?.." అని అడిగారు శ్రీధరరావు గారు..


"ఇదా..ఇది..సిద్దాసనం వేసీ.. వేసీ..ఇలా పుండులాగా మారిపోయింది..అదేం చేస్తుంది.." అన్నారు అరచేతితో అక్కడ తడుతూ..


భరించటానికి కొద్దిగా ఇబ్బందిగా వున్నా..సరే స్వామివారు పట్టించుకొనే స్థితిలో లేరు..ఆయన దృష్టిలో అది సమస్యే కాదన్నట్లు వున్నారు..


"ఈరోజు వైశాఖ మాసం పాడ్యమి..శుక్రవారం..ఇక నేరుగా విషయం లోకి వస్తాను..త్వరలో నేనీ దేహాన్ని వదలి వేస్తాను..మీతో చాలాసార్లు ముచ్చటించి వున్నాను..ఇక నా సజీవ సమాధి కూడా జరుగదు..ప్రత్యామ్నాయ పద్దతి నేనే చూసుకోవాలి..ఇంతకాలం చేసిన తపోసాధన ఒక కొలిక్కి వచ్చింది..మళ్లీ మళ్లీ చెపుతున్నాను..ఇది క్షేత్రం గా మారుతుంది.."


"మీరు మాత్రం ఓ వారం పాటు ఇటు రాకండి..నేనూ ఎవ్వరికీ అందుబాటులో ఉండను..ఇప్పటిదాకా నేను చేసిన సాధన అంతా ముగింపుకు వచ్చే సమయంలో అవరోధం ఉండకూడదు.." అన్నారు..


దంపతులిద్దరూ సరే నన్నట్లు గా తలూపారు..శ్రీ స్వామివారు నిశ్చలంగా కొద్దిసేపు అక్కడే కూర్చుని.."ఇక మీరు బైలుదేరండి..మళ్లీ వారం తరువాత కలుద్దాము.." అన్నారు..


ఇంతకుముందు చెప్పిన దానికన్నా భిన్నంగా చెప్పినదేమీ లేకపోయినా..ఎందుకనో శ్రీ స్వామివారు చెప్పిన వారం గడువులో ఏదన్నా మర్మం వున్నదా అని ఆ దంపతులు ఆలోచించుకున్నారు..శ్రీ స్వామివారి మాటకు ఎదురు చెప్పడం ఎందుకు?..ఈ వారం వేచి చూసి మళ్లీ ఇక్కడకు వస్తే..ఏదైనా వుంటే..ఆయనే చెపుతారు కదా అని సమాధాన పడి.. ఇంటికి చేరారు..


ఫకీరుమాన్యం లోని శ్రీ స్వామివారి ఆశ్రమానికి ఉన్న ప్రహరీగోడ పెద్ద ఎత్తు కలది కాదు..అక్కడికి పశువులు గొర్రెలు మేకలు మేపుకోవడానికి వచ్చే పశువుల కాపరులు..కుతూహలం కొద్దీ..ఆ గోడమీదుగా లోపలికి తొంగి చూడటం ఒక అలవాటు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు స్నానం చేస్తూనో..లేదా పచార్లు చేస్తూనో కనబడుతూ వుండేవారు..ఎప్పుడన్నా శ్రీ స్వామివారు వీళ్ళను చూడటం జరిగితే..పలకరింపుగా నవ్వేవారు..మరీ ఉల్లాసంగా వుంటే..పల్లెటూరి యాస లోనే.."ఏం బాగుండారా?..ఏ ఊరు మనది?.." అని అడిగేవారు..కొన్ని నిమిషాల పాటు వాళ్ళతో ముచ్చటించి..లోపలికి వెళ్లేవారు..వాళ్లకూ పట్టరాని ఆనందంగా ఉండేది..


1976 మే నెల ఒకటవ తేదీ నుంచి..పశువుల కాపర్లకు కూడా శ్రీ స్వామివారి దర్శనం కలుగలేదు..ఒక్కసారి మాత్రం శ్రీ స్వామివారు బావి వద్దకు వచ్చి స్నానం చేసి వెళ్లారు..అంతే.. ఎవ్వరికీ ఆ తరువాత కనబడలేదు..ఆశ్రమం ప్రధాన గదిలోని నేలమాళిగ లోనే తీవ్ర సాధన లో మునిగిపోయారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఆ వారం రోజుల పాటు ఇంటి పనులతో సరిపోయింది..నిరంతరం శ్రీ స్వామివారి ఆలోచన లో వుండే ఆ దంపతులు..చిత్రంగా లౌకిక వ్యవహారాలకు పరిమితం అయ్యారు..వాళ్లకు మళ్లీ శ్రీ స్వామివారి గురించి వచ్చిన వార్త..మే నెల 6వతేదీ నాడే..


ఆత్మత్యాగం...కపాలమోక్షం..రేపటి నుండి..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: